బోనాలు షురూ.. గోల్కొండ కోటలో అమ్మవారికి తొలిబోనం

బోనాలు షురూ.. గోల్కొండ కోటలో అమ్మవారికి తొలిబోనం

హైదరాబాద్, వెలుగు: డప్పు చప్పుళ్లు లేవు. పోతురాజుల విన్యాసాలు లేవు. శివసత్తుల పూనకాలూ లేవు. సిటీలో బోనాల పండుగ నిరాడంబరంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆడంబరంగా జరిగే గోల్కొండ బోనాలు ఈ ఏడాది కరోనా కారణంగా ఎలాంటి హడావుడి లేకుండానే షురువయ్యాయి. కేవలం 20మంది మాత్రమే బోనాల పండుగను ప్రారంభించారు. అమ్మవారికి జరిగే 9 పూజల్లో గురువారం తొలిపూజ పూర్తయింది. మిగతా 8 పూజలు ప్రతి ఆది, గురువారాల్లో నిర్వహించనున్నారు. వచ్చే నెల 23న అమ్మవారికి చివరి పూజ నిర్వహించి బోనాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

భక్తులు లేకుండానే గోల్కొండ బోనాలు..

గురువారం గోల్కొండ కోటలో జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పూజారులు, కులవృత్తి పనివారు తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించారు. కరోనా కారణంగా భక్తులను అనుమతించలేదు. ఊరేగింపు లేకుండా చోట బజార్ నుంచి గోల్కొండ కోటకు 15 నిమిషాల్లో అమ్మవారి విగ్రహాలను, తొట్టెలను ట్రాలీ ఆటోలో గోల్కొండ కోటకు తీసుకెళ్లారు. పాతబస్తీలో కూడా ఆషాడమాసం బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది బోనాలు 27 రోజుల పాటు జరగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా భక్తులు ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉండటంతో అన్ని రోజుల్లో బోనాలు సమర్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఊరేగింపును అడ్డుకున్న పోలీసులు..

ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయం నుంచి గోల్కొండ శ్రీ జగదాంబ ఆలయానికి బంగారు బోనం సమర్పించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో వెళ్తుండగా సౌత్ జోన్ పోలీసులు అడ్డుకున్నారు. బంగారు బోనం ఎత్తుకున్నశివసత్తు నిషాక్రాంతిని, ఒడిబియ్యం సమర్పించడానికి మరో మహిళను అయినా అనుమతించాలని కమిటీ సభ్యులు కోరినా పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో ఊరేగింపు కమిటీ గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయంలో సమర్పించాల్సిన బంగారు బోనంను పురానాఫూల్ భూలక్ష్మీ దేవాలయంలో సమర్పించి వెనుదిరిగింది.

కాళేశ్వరం ఖర్చులు చెప్పలేక ఇరుకున పడ్డ సర్కార్