
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగెం మండలం పెరమన దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న కారును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారును మారుతి ఫ్రోనెక్స్ AP40 HG0758గా పోలీసులు గుర్తించారు. ఢీ కొట్టిన స్పీడ్కు కారును టిప్పర్ కొంతదూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారవడం ప్రమాద తీవ్రతను తెలియజేసింది. కారులో నెల్లూరు నుంచి బద్వేల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. హైవే పైకి టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీ కొట్టడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇసుక తరలిస్తున్న టిప్పర్ అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ భయంతో పరారయ్యాడు.
►ALSO READ | మేము జోక్యం చేసుకోలేము.. వివేకా హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..