ఆకుకూరల అమృతమ్మ అందరికీ ఆదర్శం

ఆకుకూరల అమృతమ్మ అందరికీ ఆదర్శం

వ్యవసాయమంటే ఆమెకు ఎంతో ఇష్టం... అందులోనే ఆమెకు సంతృప్తి.  ఆ ఇష్టమే ఆమెకు గ్రామంలో ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ.. ఏకంగా ఓ బంగ్లానే కట్టేసిందామె. వారసత్వంగా వచ్చిన ఎకరం భూమిలో ఆకుకూరలు పండించి.. ఏకంగా నాలుగెకరాల భూమి కొనుగోలు చేసి.. తన కొడుకులనూ  వ్యవసాయదారులుగా తీర్చిదిద్దింది. ఆమే.. జగిత్యాల పట్టణ పరిధిలోని శంకులపల్లికి చెందిన అమృతమ్మ.. అలియాస్ ఆకుకూరల  అమృతమ్మ..

అమృతమ్మ కొడుకులిద్దరూ పుట్టిన కొద్ది రోజులకే భర్త గంగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. అయినా ఆమె అధైర్యపడకుండా ఆకుకూరలు సాగు చేస్తూ ఇద్దరు కుమా రులను పోషించింది. ప్రస్తుతం వారిద్దరూ వ్యవ సాయం చేస్తుండగా అమృతవ్వ ఆకుకూరల సాగును మాత్రం వదలడం లేదు. భర్త ఉన్నప్పటి నుంచే వ్యవసాయ పనులన్నీ తన మీదేసుకుని కుటుంబానికి పెద్ద దిక్కుగా పనిచేసేది అమృతమ్మ. అత్తామామల ప్రోత్సాహంతో.. అన్ని రకాల వ్యవసాయ పనులు నేర్చుకుంది. భర్త చనిపోయాక... తన కుటుంబానికి ఆ పనులే అండగా నిలిచాయి. పిల్లలిద్దరినీ సాకుతూనే... వారసత్వంగా వచ్చిన ఎకరం భూమిలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసేవారు అమృతమ్మ. అందరిలాగా వరి, పత్తిలాంటి పంటల జోలికి పోకుండా... ఎకరం భూమిలోనే దాదాపు 10 రకాల ఆకుకూరలు, ఒకటో రెండో రకాల కూరగాయలు సాగు చేసేవారు. నాగలి దున్నడం మొదలుకొని అన్ని పనులు ఆమే చేసుకునేవారు. భర్త చనిపోయిన విషాదం నుంచి తేరుకుని పూర్తిగా వ్యవసాయమే లోకంగా బతికేవారు అమృతమ్మ.   రాత్రి పూట ఎప్పుడు నిద్రపోతుందో గానీ.. వేకువ జామునే చేను దగ్గరికి వెళ్లిపోతుంది.. తనకున్న ఎకరం భూమిలో రెక్కల కష్టంతో సాగు చేసిన ఆకుకూరల సాగులో బిజీ అవుతుంది. ఉదయం ఆకు కూరలు తెంపడం, వాటిని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మడం... తిరిగి ఇంటికొచ్చి బుక్కెడెంత తిని మళ్లీ చేనులోకి వెళ్లి.. ఆకుకూరల సస్యరక్షణ చర్యలు చూసుకోవడం... తిరిగి మళ్లీ వాటిని తెంపి మార్కెట్లో విక్రయించడం... ఇదే దాదాపు 40 ఏళ్లుగా అమృతమ్మ దినచర్య.

అమృతమ్మ పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, పుదీన, తోటకూర, మెంతి, కొత్తిమీర, పుదీనా, గోంగూర వంటి రకరకాల  రకరకాల ఆకుకూరలు సాగు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె అసలు ఇంటిపేరు ఇప్పుడూ అందరూ మరిచిపోయి.. ఆకుకూరల అమృతవ్వగా గుర్తింపు పొందారు. తాను పండించిన ఆకుకూరలను మధ్య దళారులకు అమ్మకుండా.. ఆమే స్వయంగా మార్కెట్ కు వెళ్లి అమ్మి ఆదాయం గడిస్తున్నారు. ఈ సంపాదనతోనే కొడుకులిద్దరినీ పదో తరగతి వరకు చదివించారు. కానీ వారిద్దరికీ కూడా వ్యవసాయం పై మక్కువ ఉండటంతో..  ఆకుకూరల సాగుద్వారా వచ్చిన ఆదాయానికి తోడు, కొడుకులిద్దరూ కూడా పనిలో సాయం చేయడంతో వచ్చిన సంపాదనతో మరో నాలుగెకరాల భూమి కొనుగోలు చేసారు. గ్రామంలో ఓ బంగ్లా కూడా కట్టుకున్నారు.

 అమృతమ్మ ఎకరం భూమిని నాలుగైదు గుంటల చొప్పున వర్గీకరించి వేర్వేరు ఆకు కూరలు సాగుచేస్తారు. దీంతో. ఏడాదంతా ప్రతి ఉదయం, సాయంత్రం రకరకాల  ఆకుకూరలను జగిత్యాల మార్కెట్ కు తీసుకెళ్లి విక్రయించి వస్తుంటారు.  ఇలా 40  ఏళ్లుగా ఆకుకూరలు సాగు చేస్తున్న తీరును కొడుకుల కూడా గర్వంగా చెప్పుకుంటారు. తమ చిన్నతనంలో తండ్రి చనిపోయినా..అన్నీ తానై తమను పెంచి పెద్ద చేసిన తల్లి స్ఫూర్తితోనే వ్యవసాయంలో తాము కూడా రాణిస్తున్నామని కొడుకు నరేశ్ చెబుతున్నాడు.