- మొదటి బహుమతి కింద రెస్టారెంట్
- రెండో బహుమతి తులం బంగారం, థర్డ్ ప్రైజ్ కింద అరకిలో వెండి
అమీన్‌పూర్, వెలుగు : తన రెస్టారెంట్‌ను అమ్మేందుకు ఓ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. రూ. 500తో కూపన్ కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొని రెస్టారెంట్‌ను సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం చేశాడు. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో టీకేఆర్ బిర్యాని హౌస్‌ను అమ్మేందుకు యజమాని గోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం వినూత్నంగా ఆలోచించి డ్రా సిస్టమ్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా రూ. 500లతో కూపన్ కొనుగోలు చేసిన వారి పేర్లతో జనవరి 14న రాత్రి 7 గంటలకు డ్రా తీయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు. ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన వారికి సైతం కూపన్లు వాట్సప్‌లో పంపనున్నట్లు ప్రకటించారు.
డ్రాలో ఎంపికైన వారికి మొదటి బహుమతి కింద టీకేఆర్ రెస్టారెంట్‌ను అప్పగిస్తానని, రెండో బహుమతి కింద 10 గ్రాముల బంగారం, మూడో బహుమతిగా అర కిలో వెండి ఇస్తానని ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు కూపన్లు అందుబాటులో ఉంటాయని రెస్టారెంట్ యజమాని గోపాల్‌రెడ్డి ప్రకటించారు.
