
న్యూఢిల్లీ: అమూల్ బ్రాండ్ పేరుతో డెయిరీ ప్రొడక్టులను అమ్మే గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నెయ్యి, బటర్, ఐస్ క్రీం, చీజ్, పనీర్, చాక్లెట్లు, బేకరీ వస్తువులు, ఫ్రోజెన్ స్నాక్స్ లాంటి 700కు పైగా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి.
కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. బటర్ (100 గ్రాములు) ధర రూ. 62 నుంచి రూ. 58కి తగ్గింది. నెయ్యి లీటర్ ధర రూ. 40 తగ్గి రూ. 610కి చేరింది. ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ (1 కేజీ) ధర రూ. 30 తగ్గి రూ. 545కి చేరింది. ఫ్రోజెన్ పనీర్ (200 గ్రాములు) ధర రూ. 99 నుంచి రూ. 95కి తగ్గింది. ధరల తగ్గింపుతో దేశంలో పాల ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని అమూల్ భావిస్తోంది. దీనివల్ల కంపెనీ టర్నోవర్ కూడా పెరుగుతుందని పేర్కొంది.
2025 ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్ ఆదాయం 11 శాతం పెరిగి రూ. 65,911 కోట్లకు చేరింది. అమూల్ బ్రాండ్ మొత్తం ఆదాయం 2023-–24లో రూ. 80 వేల కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 90 వేల కోట్లకు పెరిగింది. మరో ప్రభుత్వ సంస్థ మదర్ డెయిరీ కూడా సెప్టెంబర్ 22 నుంచి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.