
కేరళలో 11 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కరిచి చంపాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలుడు.. ఆ తర్వాత నిర్మానుష్య మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు.
ముజప్పిలంగాడ్ లో ఆటిజంతో బాధపడుతున్న 11ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆ బాలుడికి చిన్నప్పటి నుంచి మాటలు రావు. ఇంటికి సమీపంలోని 300 మీటర్ల దూరంలో ఒక మైదానం ఉంది. ఆదివారం (జూన్ 11న) నిహాన్ ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడకు వచ్చిన వీధి కుక్కల గుంపు.. బాలుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
అయితే.. సాయంత్రం బాలుడి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల గాలించినా కనిపించకోవడంతో విషయం స్థానికులకు తెలిపారు. దీంతో స్థానికులంతా బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిహాన్ తీవ్ర గాయాలతో మైదానంలో పడి ఉన్నాడు. వారంతా బాలుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ.. అప్పటికే బాలుడి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆటిజంతో బాధపడుతున్న బాలుడి శరీరంపై కాటు గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే కేరళలో ఇలా కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. కేరళలోని కోజికోడ్ లో సెప్టెంబర్ 13న జరిగిన మరో ఘటనలో అరకినార్ గ్రామంలో 12 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు కిరాతకంగా దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గ్రామంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది.