ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌ విమానం జాడ…కనిపెట్టింది ఇతడే

ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌ విమానం జాడ…కనిపెట్టింది ఇతడే
  • 18 రోజుల ఆపరేషన్ లో ఎన్నో కష్టా లు
  • తిండి లేక బిస్కెట్లు తిని బతికిన ట్రెక్కింగ్ టీమ్
  • వాలంటరీగా ట్రెక్కింగ్ కు వెళ్లిన ఎవరెస్ట్  క్లైంబర్ టకా టముక్‌

సరిగ్గా నెల రోజుల క్రితం రష్యన్ మేడ్ ఆంటోనోవ్–32 రవాణా విమానం పైలట్లతో సహా 13 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) ఆఫీసర్లతో అస్సాంలోని జోర్హాట్ నుంచి అరుణాచల్ కు బయల్దేరి దారిలో కనుమరుగైంది. ఈ వార్త వినగానే కోట్లాది భారతీయులు వారి కోసం దేవుడిని ప్రార్థించారు. ఆర్మీ, నేవీ సాయంతో ఐఏఎఫ్ వెంటనే సెర్చ్ ఆపరేషన్లు మొదలుపెట్టింది. రెండ్రోజులైనా జాడ తెలియలేదు. విమానం ఆచూకీ లేకుండా పోయిన ప్రాంతం అరుణాచల్ కారడవిలో ఉంది.

దీంతో మిస్సైన ప్రాంతం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అడవిని జల్లెడ పట్టాలనే నిర్ణయానికి ఐఏఎఫ్ వచ్చింది. అడవి నడి మధ్యలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడానికి స్థానికులతో కూడిన 13 మంది టీమ్ ను రెడీ చేసింది. ఇంతలో ఈ ఆపరేషన్ లో తానూ పాల్గొంటానని ఓ వ్యక్తి అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ నుంచి సియాంగ్ లో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకు ఫోన్ చేశారు. తన ప్లాన్ ను వివరించారు. ఆయనే టకా టముక్. అతనేం సాధారణ వ్యక్తి కాదు. గతేడాది ఒంటరిగా ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించారు. తాను, తన స్నేహితుడితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ లో వాలంటరీగా పాల్గొంటామని అడిగారు. కమిషనర్ వాళ్లకు సాయంగా ఐదుగురు పోర్టర్లను కూడా పంపారు. కమిషనర్ ట్రెక్కింగ్ కు అనుమతివ్వకముందే అందుకు కావాల్సిన బూట్లు, రెయిన్ కోట్, టెంట్లు, తాళ్లు తదితర సామగ్రిని తన సొంత ఖర్చుతో కొనుక్కొని వెళ్లారు టకా.

‘పాయుం’ వెళ్లాలా వద్దా?

విమానం ‘టాటో’ ప్రాంతంలో కూలిందని, అటువైపు వెళ్లాలని ఐఏఎఫ్, ట్రెక్కింగ్ టీమ్ తో చెప్పింది. దీనిపై టకాకు డౌటొచ్చింది. గిరిజన తెగలు ఇచ్చిన ఇన్ పుట్స్ ను ఆయన క్రాస్ చెక్ చేశారు. పాయుం వైపే ఫ్లైట్ కూలివుండొచ్చని అంచనా వేశారు. ఇదే ఆఫీసర్లతో చెప్పారు. దీంతో వాళ్లూ గ్రీన్ సిగ్నలిచ్చారు. పాయుం గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడి వాళ్లు తాము కొద్ది రోజుల క్రితం ఓ విమానాన్ని చూశామని చెప్పారు. దాంతో గషెంగ్ గ్రామం దిశగా టీమ్ అడుగులు వేసింది. జూన్ 10వ తేదీన దాదాపు 10 గంటలు చాలా కష్టపడితే గానీ గషెంగ్ ను చేరుకోలేకపోయారు. ఎడతెరిపి లేని వర్షమే ఇందుకు కారణం. ఈ టైంలో తమ ఆలోచనంతా విమానంలో మిస్సైన వారి కుటుంబాలపైనే ఉందని టకా తెలిపారు.

ఎయిర్ లిఫ్ట్ కు సహకరించని వాతావరణం

ఇక టీమ్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి వెనక్కు తేవాలని ఐఏఎఫ్ భావించింది. కానీ మళ్లీ వాతావరణం మారిపోయింది. ఐఏఎఫ్ ఎయిర్ డ్రాప్ చేసిన ఫుడ్ అయిపోయింది. మంచినీళ్లు, బిస్కెట్లు మాత్రమే మిగిలాయి. వాటినే తీసుకుంటూ కొన్ని రోజులు గడిపామని టకా తెలిపారు. టీమ్ లో సభ్యులు ఎక్కువగానూ, టెంట్లు తక్కువగానూ ఉండటంతో రాత్రుళ్లు చాలా కష్టమైందని వివరించారు. జూన్ 29 వరకూ ఎడతెరిపి లేని వర్షం వల్ల ఎయిర్ లిఫ్ట్ కుదరలేదు. ఆ తర్వాత ఐఏఎఫ్, ట్రెక్కింగ్ టీమ్ ను చాపర్లో వెనక్కు తీసుకొచ్చింది.

గింగిరాలు తిరిగిన విమానం!

గషెంగ్ గ్రామానికి చెందిన ఓ మహిళ ట్రెక్కింగ్ టీమ్ తో తాను గింగిరాలు తిరుగుతూ వెళ్లిన విమానాన్ని చూశానని చెప్పింది. కొంచెం ఎత్తైన ప్రాంతానికి వెళ్లి గమనిస్తే అది గటే గ్రామం దిశగా ప్రయాణించిందని అర్థమైందని వివరించింది. గటే గ్రామానికి చేరుకున్న టీమ్ కు స్థానిక వేటగాడు ఒకరు తాను ఏదో పేలినట్లు పెద్ద శబ్దాన్ని విన్నానని చెప్పాడు. ఈ సమాచారాన్నంతా జిల్లా ఆఫీసర్లకు టీమ్ ఎప్పటికప్పుడు చేరవేసింది. స్థానికులు ఇచ్చిన ఇన్ పుట్స్ ప్రకారం పరి అది, పహు దినో అనే రెండు పర్వతాల మధ్య విమాన శకలాలు దొరకొచ్చని అంచనా వేశారు. దీంతో పోర్టర్లను ఐఏఎఫ్ చాపర్ కోసం గటే నుంచి వెనక్కు పంపారు.

గుండె పగిలే దృశ్యాలు

జూన్ 11న చాపర్ గషెంగ్ గ్రామానికి వచ్చింది. టకా ఐఏఎఫ్ ఆఫీసర్లతో పాటు ఎంఐ–17 చాపర్లో ఎక్కారు. ఆ రోజు చీకటి పడుతుండగా ఏఎన్–32 శకలాలను గుర్తించారు. దీంతో మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మళ్లీ అక్కడికి వెళ్లారు. టకాతో పాటు రెస్క్యూ టీమ్ తాడుతో కిందకి దిగింది. అక్కడి నుంచి ఆరు గంటలు ట్రెక్ చేసి శకలాలు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ విమానం శకలాలు దొరికాయి. 13 మంది ఆఫీసర్ల శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. అది చూసి తమ గుండె పగిలిందని టకా చెప్పారు. ప్రమాద ప్రాంతానికి గంటన్నరలో చేరుకునేలా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాత్రంతా అక్కడే గడిపారు. ఈలోగా అమరులైన ఆఫీసర్ల శవాలను ఎలా తరలించాలనే దానిపై ఐఏఎఫ్ వ్యూహాలు గీసింది. జూన్ 13న శవాలను మోసుకుంటూ టీమ్ ముందుకు కదిలింది.అందులో ఉన్న ఐఏఎఫ్ కు చెందిన జవాన్ల వయసు పెద్దది. దీంతో శవాలను మోసుకెళ్లే భారమంతా తమపైనా, ఆర్మీ ఆఫీసర్లపైనే పడిందని టకా వెల్లడించారు. ఎయిర్ లిఫ్ట్ కు వాతావరణం సహకరించకపోవడంతో శవాలను పంపేందుకు జూన్ 19 వరకూ వేచి చూశామని చెప్పారు.