కోఠి, వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. శ్రీ నవ దుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో 81 అడుగుల భారీ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సమితి వ్యవస్థాపకుడు గులాబ్ శ్రీనివాస్ సభ్యులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని 2000 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో ఏటా భారీ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నట్లు గులాబ్ శ్రీనివాస్ తెలిపారు. ఏటా విగ్రహం ఎత్తును పెంచుతూ, అవసరాన్ని బట్టి తగ్గిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మట్టి, గడ్డితో పర్యావరణహిత దుర్గామాత విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సమ్మక్క సారక్క రూపాలతో..
తెలంగాణను ప్రతిబింబించేలా సమ్మక్క-సారక్క రూపాలతో పాటు పూరీ జగన్నాథుడి రూపాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు గులాబ్ శ్రీనివాస్ వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. చివరి రోజు అమ్మవారికి అలంకరించిన చీరలను వేలం వేయనున్నట్లు చెప్పారు.
ఈ నెల 18న మహిళలతో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గులాబ్ శ్రీనివాస్ తెలిపారు. 23న ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక విక్టోరియా గ్రౌండ్స్‌లోనే నీటితో తడిపి నిమజ్జనం చేయనున్నట్లు వెల్లడించారు.
