కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. మమత సర్కార్కు కోల్కత్తా హైకోర్టు చీవాట్లు

కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. మమత సర్కార్కు కోల్కత్తా హైకోర్టు చీవాట్లు

కోల్కత్తా: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కోల్కతా ట్రైయినీ డాక్టర్ అత్యాచార ఘటన, తదనంతర పరిణామాలపై కోల్కత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమత సర్కార్కు చీవాట్లు పెట్టింది. హాస్పిటల్లో జరిగిన విధ్వంసం ప్రభుత్వ వైఫల్యమేనని కోర్టు మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఆ హాస్పిటల్ను అంత అర్జెంట్గా ఆధునీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వంపై కోర్టు రుసరుసలాడింది.

ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ను మూసివేయడం మంచిదని కోర్టు అభిప్రాయపడింది. ఆ హాస్పిటల్ లోని పేషంట్లను తక్షణమే తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 7 వేల మందికి పైగా గుంపుగా హాస్పిటల్పై దాడికి యత్నించే ప్లాన్లో ఉంటే పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం లేకపోవడం ఏంటని కోల్కత్తా హైకోర్టు నిలదీసింది. హాస్పిటల్లో అంత విధ్వంసం జరిగితే వైద్యులు తమ విధులను ప్రశాంతంగా ఎలా చేయగలరని ప్రశ్నించింది. హాస్పిటల్లో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ దాడిపై రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అత్యాచారానికి గురైన ఆ యువతి ఫొటోలను గానీ, పేరును గానీ ప్రచారం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్  అత్యాచారం, హత్యకు గురైన ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై కొంతమంది దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. నిరసనకారుల ముసుగులో వచ్చి ఆస్పత్రిలో విధ్వంసం సృష్టించారు. డాక్టర్పై రేప్ అండ్ మర్డర్కు నిరసనగా గత బుధవారం అర్ధరాత్రి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. ఆ టైంలో కొంతమంది దుండగులు నిరసనకారుల ముసుగులో అక్కడికి వచ్చారు. 

అర్ధరాత్రి ఆందోళన ప్రారంభం కాగా.. 40 మంది దుండగులు ఆస్పత్రిలోకి దూసుకెళ్లారు. వెహికల్స్, వార్డులు, రూమ్స్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పోలీస్ ఔట్ పోస్టుపైనా దాడి చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. గుంపును కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దుండగుల దాడిలో 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, ఆస్పత్రిపై దాడికి పాల్పడినోళ్ల ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజలు ఇచ్చిన సమాచారంతో 9 మందిని అరెస్టు చేశారు.