గ్రేటర్ హైదరాబాద్ ​సమీపంలో దారుణం.. ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం, హత్య

గ్రేటర్ హైదరాబాద్ ​సమీపంలో దారుణం.. ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం, హత్య

దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కఠినమైన.. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. మహిళలు, చిన్నారులపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట.. వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​ లో సమీపంలో ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత దారుణంగా చంపేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఓ ఐదేళ్ల బాలిక తల్లిదండ్రులు, తాతయ్యతో కలిసి సంగారెడ్డి జిల్లా భానూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్​ వద్ద నివాసం ఉంటోంది. ఈ మధ్యే బాలిక తల్లిదండ్రులు సొంతూరుకు వెళ్లారు. ఆమెను మాత్రం తాత వద్ద ఉంచి వదిలివెళ్లారు. చిన్నారి తాత సోమవారం రోజు (అక్టోబర్​ 16న) ఆమెను ఇంటి వద్దే వదిలి కూలీ పనులకు వెళ్లాడు.

అయితే.. బాలిక ఒంటరిగా ఉండడాన్ని బీహార్​ కు చెందిన  60 ఏళ్ల వలస కూలీ గమనించాడు. ఇంకేముంది... చిన్నారి వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పాడు. బాలికను ప్రలోభపెట్టాడు. కూల్​ డ్రీంక్ కొనిస్తానని చెప్పి... దగ్గరలోని పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఏడుపు స్టార్ట్​ చేయడంతో దారుణంగా హత్య చేశాడు. చిన్నారిని హత్య చేసిన తర్వాత ఆమె డెడ్​బాడీని పత్తి చేలోనే పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు నిందితుడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి తాత.. ఆమె కోసం అంతటా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వాళ్లను వాకబు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు దగ్గరలోని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. బాలిక తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు.

నిర్మాణ స్థలంలో ఉన్న వాచ్‌మెన్ ను పోలీసులు ప్రశ్నించారు. బీహార్ కు చెందిన 60 ఏళ్ల వ్యక్తితో చిన్నారి కనిపించిందని పోలీసులకు చెప్పడంతో వారికి క్లూ దొరికింది. ఈ క్రమంలోనే నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అప్పుడు అసలు విషయం చెప్పాడు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేశానని చెప్పేశాడు. పత్తి చేలో ఉన్న బాలిక డెడ్​ బాడీని పోస్టుమార్టం కోసం పోలీసులు మార్చురీకి తీసుకెళ్లారు. నిందితుడిని అరెస్ట్​ చేశారు. అతడిపై సెక్షన్ 376, 302, పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ,రక్షణ) చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.