జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ వ్యక్తిపై యువకుల దాడి

జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ వ్యక్తిపై యువకుల దాడి

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ లో ఓ వ్యక్తిపై ఐదుగురు వ్యక్తుల దాడి కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని గొడ్డును బాదినట్లు బాదారు కొందరు యువకులు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న జూబ్లీహిల్స్​ పోలీసులు.. సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగింది..?

జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్​ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..

కృష్ణా నగర్ లోని లక్ష్మీ నరసింహ నగర్ లో శనివారం (అక్టోబర్7వ తేదీన) అర్ధరాత్రి చందు అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు అతడిని కొట్టారు. ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఐదు మందిపై ఐపీసీ 307 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు భాస్కర్, లలిత్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

బాధితుడు చందు అర్ధరాత్రి ఒక మహిళతో ఉండడంతో అదే సమయంలో అటుగా వచ్చిన లలిత్ అనే వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉన్నావని చందును ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అలా మొదలైన గొడవతో చందుపై దాడికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చందు ఆసుపత్రిలో ట్రీట్​ మెంట్​ తీసుకుని గుంటూరు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుడు తన స్వగ్రామం వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. అతడిని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు. 

Also Read : తెలంగాణను అప్పులపాలు చేసిన్రు: హుస్సేన్​ నాయక్​

అయితే.. చందుపై దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరైన భాస్కర్.. జూబ్లీహిల్స్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ పీఏ అని 15, 20 రోజులుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలుస్తోంది. పోలీసులు మాత్రం మరో వెర్షన్​ చెబుతున్నారు. భాస్కర్ ఎమ్మెల్యే పీఏ కాదని, కేవలం బీఆర్ఎస్ కార్యకర్త మాత్రమే అని చెబుతున్నారు. బాధితుడు చందుకు, నిందితులకు మధ్య ఎలాంటి పరిచయం లేదని పోలీసులు చెబుతున్నారు. 

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ పీఏగా పని చేస్తున్న సుబ్బరాజు అనే వ్యక్తిని 20 రోజుల క్రితం తొలగించారు. డబ్బులు విషయంలో సుబ్బరాజుపై ఆరోపణలు రావడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. ఇక అప్పటి నుంచి తాను ఎమ్మెల్యే పీఏ అని భాస్కర్ చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు విషయంలో కొత్త కొత్త ట్విస్టులు బయటికొస్తున్నాయి.