ఖాట్మాండ్లో భూకంపం.. రిక్టార్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత

ఖాట్మాండ్లో భూకంపం.. రిక్టార్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత

నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఆదివారం (అక్టోబర్​ 22న) ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధాడింగ్‌ జిల్లా జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7.39 గంటలకు ప్రకంపనలు మొదలయ్యాయి. బాగ్‌మతి, గండకి ప్రావిన్సుల్లోని ఇతర జిల్లాల్లోనూ కుదుపులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు.

టిబెటన్‌, ఇండియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్లు కలిసే శిఖరంపై ఉన్న నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రతి శతాబ్ద కాలానికి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండు మీటర్ల మేర దగ్గరకు జరుగుతున్నాయి. దీంతో లోపల ఒత్తిడి ఏర్పడి భూకంపాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లో నేపాల్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టార్‌ స్కేల్‌పై 7.8 తీవ్రత నమోదు కావడంతో దాదాపు 9 వేల మంది మృత్యువాతపడ్డారు. ‘పోస్ట్‌ డిజాస్టర్‌ నీడ్స్‌ అసెస్‌మెంట్‌’ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో నేపాల్ 11వ స్థానంలో ఉంది.