డంపింగ్ యార్డులో పేలుడు

డంపింగ్ యార్డులో పేలుడు

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని లోయర్ ట్యాంక్ బండ్​లో పేలుడు కలకలం సృష్టించింది. చెత్త డంపింగ్ యార్డులో కెమికల్ డబ్బా పేలి తండ్రీకొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చంద్రన్న, ఆయన కొడుకు సురేష్ ‘‘స్వచ్ఛ ఆటో’’ నడుపుతూ చెత్త సేకరిస్తున్నారు. రోజూ చెత్త సేకరించి లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న డంపింగ్ యార్డులో పోస్తుంటారు. ఈ క్రమంలో గురువారం కూడా చెత్త తీసుకొచ్చి యార్డులో పోశారు. అందులో రీసైక్లింగ్ కు ఉపయోగపడే వస్తువులను సేకరిస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చంద్రన్న కోలుకుంటుండగా.. సురేష్ తలకు తీవ్ర గాయమైందని, కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు.

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో మాట్లాడి బాధితులకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలన్నారు. రీసైక్లింగ్ కు ఉపయోగపడే వస్తువులను ఏరుకుంటున్న క్రమంలో బాధితులు కెమికల్ డబ్బాను ఓపెన్ చేయడంతో పేలుడు సంభవించిందని గాంధీనగర్ సీఐ మోహన్ రావు తెలిపారు. వాడిన పెయింటింగ్ డబ్బాను మూత పెట్టి బయటపడేశారని, దాన్ని ఓపెన్ చేయగా ఒక్కసారిగా పేలిందని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి పరిశీలించారు.