
హైదరాబాద్, వెలుగు : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, కవి, డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి రాసిన ‘యాన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’ పుస్తకాన్ని మంగళవారం ఐక్యరాజ్యసమితి దినోత్సవం రోజున ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, సామరస్యంపై దైవం, దైవస్వరూపులైన మానవాళిని ప్రార్థిస్తూ ఇంగ్లిష్లో ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయిత శ్రీనాథా చారి తెలిపారు.
దీని రేటు రూ.5 కోట్లు అని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం ఇదే అని అన్నారు . ఈ పుస్తకాన్ని అమ్మగా వచ్చే డబ్బును సమాజ సేవలకు ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఐక్యరాజ్యసమితికి 50 శాతం, భారత ప్రభుత్వానికి 25 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 25శాతం ఇస్తామన్నారు.
పుస్తకావిష్కరణలో శ్రీనాథాచారి తల్లిదండ్రులు నీలావతమ్మ, రామానుజాచారి, డీఐజీ సుమతి, గుంతా లక్ష్మణ్, ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం, కవి ఎస్కే నిజాముద్దీన్, ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు జేకే భారవి తదితరులు పాల్గొన్నారు.