భర్త ఉద్యోగానికి ఎసరు తెచ్చిన భార్యల ఎన్నికల పోరు

భర్త ఉద్యోగానికి ఎసరు తెచ్చిన భార్యల ఎన్నికల పోరు

మధ్యప్రదేశ్: ముగ్గురు భార్యల ‘పంచాయతీ’ పోరులో ఓ భర్త తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సింగ్రౌలి గ్రామానికి చెందిన సుఖ్రాం సింగ్ అనే వ్యక్తి ఘోగ్రా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు. కాగా... సింగ్రౌలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుఖ్రాం సింగ్ ఇద్దరు భార్యలు ఒకరిపై మరొకరు పోటీకి దిగారు. ఈ క్రమంలోనే సుఖ్రాం సింగ్ తమ భర్త అని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుఖ్రాం సింగ్ అధికారులకు తెలియజేశాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... మూడో పెళ్లాంతోనే అతడికి చిక్కులు వచ్చిపడ్డాయి. సుఖ్రాం సింగ్ మూడో భార్య గీతా సింగ్ జన్ పద్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా పోటీలో నిలిచింది. ఆమె కూడా తన నామినేషన్ లో సుఖ్రాం సింగ్ తన భర్త అనే విషయాన్ని పేర్కొంది.

అయితే ఈ విషయాన్ని సుఖ్రాం సింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులెవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వానికి కచ్చితంగా సమాచారం ఇవ్వాలి. కానీ సదరు భర్త ఈ విషయాన్ని దాచిపెట్టాడు. దీంతో ఇష్యూని తీవ్రంగా పరిగణించిన అధికారులు సుఖ్రాం సింగ్ ను సస్పెండ్ చేశారు. పెళ్లాల పంచాయతీ పోరు భర్త ఉద్యోగానికి ఎసరు పెట్టిందని గ్రామస్థులు అనుకుంటున్నారు.