టీఆర్ఎస్ లో పెరుగుతున్న అసంతృప్తి గొంతులు

టీఆర్ఎస్ లో పెరుగుతున్న అసంతృప్తి గొంతులు

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్​ఎస్​లో చేరిన నేతలు, తాజాగా వచ్చి చేరిన నాయకులు సైతం తమకు అందిన హామీలు నెరవేరక తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. రెండో దఫా అధికారం చేపట్టి ఏడాది కాకుండానే నిరసన గళాలు వెల్లువెత్తడంపై టీఆర్ఎస్​లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఎందుకీ పరిస్థితి?

టీఆర్‌‌ఎస్‌‌  ఆవిర్భవించిన నాటి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌‌  వెన్నంటి నడిచిన నాయకులు ఎందరో ఉన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటైన రాష్ట్రంలో టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చింది. దాంతో తమకు మంచి అవకాశాలు వస్తాయని చాలా మంది ఆశించారు. కొందరికి అవకాశాలు వచ్చాయి. మరికొందరికి రాలేదు. ఇంకొందరికి నాలుగు రోజుల ముచ్చటే అయ్యింది. టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక చాలా మంది వేరే పార్టీల లీడర్లు ఆ పార్టీలోకి వచ్చారు.  ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని, వ్యతిరేకంగా పనిచేసిన వారిని కూడా.. తెలంగాణ శక్తుల ఏకీకరణ పేరుతో టీఆర్ఎస్​ హైకమాండ్​ పార్టీలో చేర్చుకుంది. రెండోసారి గెలిచాక కూడా చాలా మంది నేతలను, ప్రజాప్రతినిధులను చేర్చుకుంది. ఈ క్రమంలో నేతలకు వివిధ రకాల హామీలు ఇచ్చారు. పదవులిస్తామని ఆశ చూపారు. కానీ అవి ఆచరణ రూపం దాల్చకపోవడంతో పార్టీలో నిరసన గళాలు పెరుగుతున్నాయి. మరోవైపు బయటి నుంచి వచ్చినవారికి అవకాశాలిస్తూ.. తొలి నుంచీ ఉన్నవారిపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గత ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రిగా పనిచేసిన నేత.. హైదరాబాద్​లోని ఓ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తనకు గానీ, తన అల్లుడికి గానీ టికెట్‌‌ ఇవ్వాలని కోరారు. కానీ ఆ విజ్ఞప్తి ఫలించలేదు. టికెట్‌‌ ఇవ్వడం కుదరదు గానీ కేబినెట్‌‌లోకి తీసుకుంటానని అధినేత హామీ ఇచ్చారని, తన అల్లుడికి ఏదో ఒక పదవి ఇస్తానని నమ్మకంగా చెప్పారని ఈ మధ్య ఆ నేత బహిరంగంగానే చెప్పారు. తనను మోసం చేశారని అధినేత మీదనే ఆరోపణ చేశారు. ఒక సీనియర్‌‌గా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై, తన రాజకీయ వారసుడికి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.

  • రాజకీయంగా చరమాంకంలో ఉన్నానని, మంత్రిగా ఉన్న సమయంలోనే కుమారులను సెటిల్‌‌ చేయాలని భావించిన ఉత్తర తెలంగాణ నేత ఒకరు తనకు అవకాశం లభించకపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. తన అసంతృప్తిని మీడియా ముందు చెప్పకనే చెప్పుకొని భోరుమన్నారు.
  • వరంగల్‌‌కు చెందిన మరో నేత మొదటి నుంచీ ఉద్యమంలో ఉన్నారు. సీఎంకు సన్నిహితుడిగా కూడా పేరుండేది. నమ్మకస్తుడిగా కూడా ముద్ర ఉంది. కానీ సీఎం తన కులానికి చెందిన వ్యక్తికి మంత్రిగా అవకాశం ఇవ్వడంతో సదరు నేత చాన్స్‌‌ మిస్సయ్యారు. తన సన్నిహితులు, మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
  •  నిజామాబాద్‌‌కు చెందిన ఒక సీనియర్‌‌ నేత సీఎం కేసీఆర్‌‌కు సమకాలీకులు. గత ప్రభుత్వ హయాం నుంచీ ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ నిరాశ ఎదురైంది. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడిని రంగంలోకి దింపాలని భావించిన ఆయన.. తనకు అవమానం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • గత ప్రభుత్వంలో మండలిలో కీలక స్థానంలో ఉన్న నేతకు నాడు సీఎంవో నుంచి ఫోన్ల మీద ఫోన్లు వెళ్లేవి. ఉద్యమ నేత, ఉద్యోగ సంఘ నేత అయిన ఆయన అసలు ఇపుడు ఉన్నారా, లేరా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పదవి సంగతి పక్కన బెడితే కనీసమైన పలకరింపు కూడా లేకపోవడంతో ఆయన పార్టీ నేతలతో జరిగే సంభాషణల్లో మండిపడుతున్నట్టు సమాచారం.
  •  హైదరాబాద్‌‌లో పార్టీకి బీజాలు వేసి, దాన్ని పెంచి.. పట్నంలో టీఆర్‌‌ఎస్‌‌ ఎక్కడుందని ప్రశ్నించిన వాళ్లకు గెలిచి చూపించిన నేత కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కినా ఈ దఫా ఆ అదృష్టం వరించలేదు. వేరే అవకాశం వచ్చినా ఆయనలో అసంతృప్తి పేరుకుపోయి ఉంది. ఉద్యమ సమయంలో తనను జైల్లో పెట్టించిన, వేరే పార్టీ నుంచి తాజాగా వచ్చిన వ్యక్తికి ఇపుడు మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన మండిపడుతున్నారు.
  • 1969 ఉద్యమంలో ఉద్యోగ సంఘ నేత ఆయన. గతంలో వేరే పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తర్వాత తనకు అవకాశం దక్కుతుందనుకున్నారు. అది లేకపోగా కనీసం పార్టీలో ఉన్నాడనే గుర్తింపు కూడా ఇవ్వకపోవడంతో ఆవేదనకు లోనయ్యారు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు.

ఈటలతో మొదలైంది..

మంత్రి ఈటల రాజేందర్‌‌ ఇటీవల మాట్లాడిన మాటలు టీఆర్​ఎస్​లో కొత్త పరిస్థితికి దారితీశాయి. ఒకరొకరుగా పార్టీ అధినేత వైఖరిపై నిరసన గళాలు విప్పడం మొదలుపెట్టారు. అసెంబ్లీ తొలి రోజునే కొందరు నేతలు మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈటల వ్యాఖ్యలే ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోశాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే తర్వాత పార్టీ  పెద్దలు బుజ్జగించడంతో సదరు నేతలు తమ మాటలను ఖండించారు. కానీ ఆ మాటల ప్రభావం పార్టీలోని అసంతృప్త నేతలపై బలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బోధన్‌‌ ఎమ్మెల్యే షకీల్‌‌  వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన బీజేపీ ఎంపీ అర్వింద్‌‌ను కలవడం, ఆ ఫొటో మీడియాలో హైలైట్​ కావడం దుమారం సృష్టించింది.

హైకమాండ్ దిగొచ్చింది..

ఈటల మాటలపై టీఆర్‌‌ఎస్‌‌ అధినేతలు అంతగా స్పందించినట్టు కనిపించకపోయినా తర్వాత మొదలైన ప్రకంపనలపై వెంటనే దృష్టి పెట్టారు. అసెంబ్లీలో మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలందరికీ వర్కింగ్  ప్రెసిడెంట్‌‌  కేటీఆర్‌‌  ఫోన్లు చేసి బుజ్జగించారు. సదరు నేతలు ప్రెస్‌‌ మీట్లు పెట్టి, ప్రెస్‌‌ నోట్లు విడుదల చేసి తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొన్నారు. పార్టీ పట్ల విధేయత ప్రకటించారు. అయినా ఎక్కడో ఓ చోట నిరసన స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. నోరు విప్పితే తప్ప తమ ఉనికి గుర్తించరన్న ఉద్దేశంతోనే ఒక్కొక్కరుగా ఇలా చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే దారిలో మరికొందరు ప్రయాణించే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇషారా దొరికింది..

హైకమాండ్​ దిగిరావడాన్ని గుర్తించిన నేతలంతా నోరెత్తితే తప్ప న్యాయం జరగదన్న అభిప్రాయానికి వచ్చారు. ఉద్యమంలో పాల్గొన్న కొందరు నేతలు ఇంతకాలం వేచి చూసినా పదవులు దక్కకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంతకన్నా వేచి చూడడం సాధ్యంకాదంటున్నారు. తాము పదవుల్లో ఉండగానే వారసులను రంగ ప్రవేశం చేయించాలని కొందరు భావిస్తున్నారు. అలాంటి వారంతా ఈ టైమ్​ను మిస్​ చేసుకోకూడదన్న ధోరణిలో ఉన్నారు.  నోరు తెరిస్తే ఏదో ఒకటి తేలిపోతుందని అనుకుంటున్నారు.