వెయ్యి.. 2 వేల రూపాయలు పోతేనే ఆందోళన పడతాం.. 50 కోట్ల స్కాం అంటేనే పార్టీలను చూసి మరీ వెయ్యి రోజులు స్క్రీన్ ప్లేలతో స్టోరీలు దడదడలాడిస్తారు.. అలాంటిది వెయ్యి కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఇది ఎక్కడో కాదు.. మన ఇండియాలో.. అవును.. 2025, అక్టోబర్ 25వ తేదీ రాత్రి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో 400 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు.. రెండు పెద్ద కంటైనర్లలో వెళుతున్న డబ్బు దోపిడీ జరిగితే.. ఎందుకింత రహస్యం.. ఎందుకు ఇన్నాళ్లు మీడియాలో హల్ చల్ చేయలేదు.. ఈ డబ్బు ఎవరిది.. గుజరాత్ వాళ్లదా.. ముంబై వాళ్లదా.. డబ్బు సొంతందారుడు రియల్ ఎస్టేట్ బిల్డర్ కిషోర్ సావ్లా సేథ్ ఎవరు.. ఇప్పుడు ఇదే ఇండియాలో బర్నింగ్ టాపిక్.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీస్ కంప్లయింట్ ఏంటీ ? :
మహారాష్ట్ర నాసిక్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి రెండు భారీ కంటైనర్లలో 400 నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉన్న డబ్బు కట్టలు.. బెంగళూరుకు బయలుదేరాయి. ఈ రెండు కంటైనర్లు మహారాష్ట్ర.. కర్నాటక, గోవా రాష్ట్రాల సరిహద్దులోని చోర్లా ఘాట్ అటవీ ప్రాంతం నుంచి వెళుతున్నాయి. డబ్బు కట్టలతో వెళుతున్న ఈ రెండు కంటైనర్లు.. చోర్లా ఘాట్ అటవీ ప్రాంతం నుంచి దారి మళ్లాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ఘటన 2025, అక్టోబర్ 25వ తేదీ అర్థరాత్రి జరిగిందని ముంబైకి చెందిన వ్యాపారవేత్త దత్తా పాటిల్.. నాసిక్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు. ఈ డబ్బు ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ బిల్డర్ కిషోర్ సావ్లా సేథ్ కు చెందిందని కంప్లయింట్ లో చెప్పుకొచ్చాడు.
కర్నాటక, మహారాష్ట్ర పోలీసుల జాయింట్ ఎంక్వయిరీ :
రెండు కంటైనర్ల డబ్బు దోపిడీ జరిగిన ప్రాంతం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దు కావటంతో.. ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. మూడు నెలలుగా డబ్బు విషయంపై స్పష్టత రాకపోవటంతో.. ఈ కేసులో కర్నాటక బెళగావి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 400 కోట్ల డబ్బు దోపిడీపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు అధికారులకు సహకరించాలంటూ.. కర్నాటక ప్రభుత్వానికి లేఖ రాయటంతో.. ఇది రెండు రాష్ట్రాల మధ్య హాట్ డిస్కషన్ అయ్యింది.
ఐదుగురు హవాలాదారులు అరెస్ట్ :
ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ఐదుగురు హవాలాదారులను అరెస్ట్ చేశారు పోలీసులు. జయేష్ కదమ్, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్, విరాట్ గాంధీ, జనార్థన్ దైగైడే. అనుమానం ఉన్న మరో ఇద్దరు ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు మహారాష్ట్ర సిట్ అధికారులు. ఇప్పటి వరకు అత్యంత రహస్యంగా ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. కర్నాటక పోలీసులకు రాసిన లేఖతో ఇది బర్నింగ్ ఇష్యూ అయిపోయింది.
ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎవరి కోసం.. :
మహారాష్ట్ర నుంచి రెండు కంటైనర్లలో బయలుదేరిన 400 నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ డబ్బు.. ఎక్కడికి వెళుతుంది.. ఎవరి కోసం తరలిస్తున్నారు.. దేని కోసం తరలిస్తున్నారు.. దీనికి లెక్కలు ఉన్నాయా లేవా.. ఈ డబ్బు బ్లాక్ మనీనా అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. 400 కోట్ల రూపాయలల్లో చాలా వరకు రద్దు అయిన పెద్ద నోట్లు అనే చెబుతుంటే.. అసలు రద్దయిన నోట్లను ఎందుకు తరలించాల్సి వస్తుంది.. ఇంత పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లను ఇన్నాళ్లు ఎందుకు దాచారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
చోర్లా ఘాట్ నుంచి మాయం అయిన కంటైనర్లు ఎక్కడ ఉన్నాయి.. ఆ డబ్బు ఎక్కడ దాచారు.. దీని వెనక ఎవరు ఉన్నారు.. ఇంత పక్కా ప్లాన్ వేశారు అంటే.. ఇది చాలా రోజుల క్రితం నుంచి జరుగుతున్న వ్యవహారంగా అనుమానిస్తున్నారు పోలీసులు. మొత్తానికి ఈ 400 కోట్ల రూపాయల డబ్బు మాయం వ్యవహారంలో.. కర్నాటక, మహారాష్ట్ర మధ్య పొలిటికల్ డైలాగ్స్ పేలుతున్నాయి. ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయటానికి.. జనానికి పంచటానికి తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
