వెంకటాపురం/భద్రాచలం, వెలుగు: తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టుల కంచుకోట కర్రెగుటల్లో తొలిసారి మువ్వెన్నల జెండా ఎగిరింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుటల్లోని పామూనూరు గ్రామంలో సీఆర్పీఎఫ్–39 బెటాలియన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల్లో రిపబ్లిక్ డే, పంద్రాగస్టును బ్లాక్ డేగా నిర్వహించేవారు. గత ఏడాది కర్రెగుట్టల్లోని పామూనూరు గ్రామంలో బేస్ క్యాంప్(ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్) ఏర్పాటు చేశారు.
సోమవారం ఈ బేస్ క్యాంపులో బెటాలియన్ కమాండర్ ప్రశాంత్ కుమార్ శ్రీవాత్సవ జాతీయ జెండా ఎగరవేశాడు. అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సెకండ్ ఇన్ కమాండర్ పంచమ్లాల్, ఏస్ఎంవో డాక్టర్ తారకేశ్వరి, అసిస్టెంట్ కమాండెంట్లు అనీశ్, శ్రీనివాస్, డీఎస్పీ ప్రశస్త్ పాల్గొన్నారు.
భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని కర్రెగుట్టల్లో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆదివాసీ పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. సముద్రమట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ కర్రెగుట్టలు మొన్నటిదాకా మావోయిస్టులకు కంచుకోటగా ఉండేవి. ఆపరేషన్ కగార్ పేరుతో వారి బంకర్లను భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి.
