రంగాయపల్లిలో బతుకమ్మ వేడుకలకు భూమి దానం..దాతను సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రంగాయపల్లిలో బతుకమ్మ వేడుకలకు భూమి దానం..దాతను సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగాయపల్లి పంచాయతీ పరిధిలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు రూ.40 లక్షలు విలువైన 33 గుంటల భూమిని విరాళంగా అందించిన లక్కిరెడ్డి తిరుపతి రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఘనంగా సన్మానించారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తిరుపతి రెడ్డి సొంత భూమిని గ్రామ ప్రయోజనాలకు దానంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు.

హుస్నాబాద్ సెగ్మెంట్ లోని172 గ్రామాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాజాగా ఎన్నికైన సర్పంచుల నుంచి అభివృద్ధి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. .మండలస్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. 

హనుమకొండ జిల్లా పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్ట్ కాల్వల భూసేకరణకు రూ. 50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు.  భూసేకరణ పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్ట్​ను పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నేతలు  పాల్గొన్నారు.