భవ్య, వైష్ణవి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

భవ్య,  వైష్ణవి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
  •     హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్​ను అరెస్ట్​చేయాలి
  •     ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: ఈ నెల రెండో తేదీన భువనగిరి ఎస్సీ గర్ల్స్​ హాస్టల్​లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భవ్య, వైష్ణవి ఘటనపై సిట్టింగ్​జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రజాసంఘాల నాయకులు, బాధిత తల్లిదండ్రులు డిమాండ్​చేశారు. బాలికలపై లైంగిక దాడి చేసి చంపేశారని, తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

ఆదివారం హైదరాబాద్​సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ‘భవ్య, వైష్ణవి న్యాయ పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో రౌండ్​టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ బీసీ జనసభ నాయకుడు రాజారామ్​యాదవ్, మధుయాదవ్, బహుజన సేన నాయకుడు వాసు.కె.యాదవ్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప పాల్గొని మాట్లాడారు. 

సోషల్​వెల్ఫేర్​హాస్టల్​లో పదో తరగతి చదువుతున్న స్టూడెంట్లు అనుమానాస్పద స్థితిలో చనిపోతే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే హాస్టల్​వార్డెన్ శైలజారెడ్డి, ఆటో డ్రైవర్​ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపించాలని కోరారు. అప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. భవ్య, వైష్ణవిని వార్డెన్ మూడు గంటల పాటు బయటికి ఎందుకు తీసుకెళ్లిందని ప్రశ్నించారు. తిరిగి ఎప్పుడు తీసుకొచ్చిందనే విషయంలో క్లారిటీ లేదన్నారు. 

బాలికల ఒంటిపై గాయాలున్నాయని, గోళ్లతో గిచ్చి, సిగరెట్ తో కాల్చిన ఆనవాళ్లు కనిపించాయని ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు స్పందించిన తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇద్దరు బాలికలు చనిపోతే తమకేమీ పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. చిన్నారుల మృతి వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందని, అందుకే కేసు విచారణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ప్రభుత్వం స్పందించి, ఈ కేసును సిట్టింగ్​జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు జ్యోతి, ఓపీడీఆర్​నుంచి లక్ష్మీదేవి, పీఓడబ్ల్యూ నుంచి వరలక్ష్మి, భవ్య తల్లితండ్రులు లలిత, కృష్ణ, వైష్ణవి తండ్రి నాగరాజు, మహిళా నాయకురాలు రాములమ్మ పాల్గొన్నారు.