ఐదు కోట్ల ఆస్తి ఇచ్చా.. కొడుకులు తిండి పెట్టడం లేదు.. ప్రజావాణిలో ఓ తండ్రి ఆవేదన

ఐదు కోట్ల ఆస్తి ఇచ్చా.. కొడుకులు తిండి పెట్టడం లేదు.. ప్రజావాణిలో ఓ తండ్రి ఆవేదన

తన ఇద్దరు కుమారులు తనకు తిండి పెట్టడం లేదంటూ ఓ వృద్ధుడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తన భూమిని కుమారుల వద్ద నుంచి తనకు ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను వేడుకున్న ఘటన అందర్నీ కలిచివేస్తోంది.

అసలేం జరిగింది..? 

ఐదు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి.. ఇస్తే తన కొడుకులు తిండి కూడా పెట్టడం లేదని కరీంగజిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు నోముల రాజయ్య అనే వృద్ధుడు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన రాజయ్య బోధకాలుతో కుంటుతూనే జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వచ్చాడు. అక్కడ కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారును చూసి బోరున విలపించాడు. తన ఇద్దరు కొడుకులు తిండి పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. 

తాను రెక్కలు ముక్కలు చేసుకుని.. కష్టపడి సంపాదించిన భూమిని పంచుకున్న ఇద్దరు కొడుకులు .. ఇప్పుడు తనకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఇన్నాళ్లు చిన్న కొడుకు, -కోడలు తిండిపెట్టారని, అయితే.. చిన్న కొడుకు తిండి పెడుతుంటే పెద్ద కోడలు వాళ్లను తిడుతోందని చెప్పాడు. దీంతో చిన్న కొడుకు వాళ్లు కూడా తనకు తిండిపెట్టడం లేదని వాపోయాడు. 

ALSO READ :ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ

తన నుంచి కొడుకులు పంచుకున్న భూమిని తిరిగి తన పేరు మీదకు మార్చాలని జిల్లా కలెక్టర్ కు రాజయ్య విజ్ఞప్తి చేశాడు. తన భూమిని తనకు అప్పగిస్తే చాలని, అవసరమైతే ఎవరికైనా దానం చేసుకుంటానని దండం పెట్టి వేడుకున్నాడు. అయితే.. వృద్ధుడి ఆవేదనను విన్న జిల్లా కలెక్టర్  కొడుకులను పిలిపించి మాట్లాడుతానని రాజయ్యకు హామీ ఇచ్చారు. 

మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం 

ఈ మధ్యే మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రుల పోషణ, పిల్లలకు ఆస్తుల పంపకాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పిల్లలకు ఆస్తుల పంపకాలపై తలెత్తిన కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తమ పోషణను సరిగ్గా పట్టించుకోకుంటే పిల్లలకు కేటాయించిన ఆస్తులను వెనక్కు తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని ఆ తీర్పులో తేల్చి చెప్పింది.