ఓయో రూంలో రైడ్.. పోలీసులకు దొరికిపోయారు

ఓయో రూంలో రైడ్.. పోలీసులకు దొరికిపోయారు

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ బెట్టింగ్ బాబులు చెలరేగిపోతున్నారు. ఎక్కడ సందు దొరికితే అక్కడ దుకాణం పెడుతున్నారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను శనివారం SOT సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. క్రికెట్‌లో  బెట్టింగులు పెట్టి అప్పులపాలై యువత ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. బెట్టింగ్ నిర్వహిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొందమంది బుద్ది మాత్రం మార్చుకోట్లేదు. హైదరాబాద్ లోని మాదాపూర్ SOT టీం, గచ్చిబౌలి పీఎస్ పోలీసులు కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దాడులు నిర్వహించారు. 

గచ్చిబౌలి పరిధిలోని సిల్వర్ కీ OYO లాడ్జ్ రూం నెంబర్ 401పై రైడ్ చేసి ఇద్దరు బూకీలను మరో ముగ్గురు పంటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారు BSFL666 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి దగ్గర నుంచి ఐదు స్మార్ట్ ఫోన్లు, నాలుగు బ్యాంక్ అకౌంట్లలో లక్షా 84వేల 398 నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న జీతు శర్మ, మాడిశెట్టి అజయ్ లు తప్పించుకున్నారు.- గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.