
ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు మార్లిన్ మన్రో. నటిగా, మోడల్‌గా, గాయనిగా హాలీవుడ్‌లో ఆమె అందుకున్న స్టార్‌డమ్‌ని ఇంతవరకు మరెవరూ అందుకొని ఉండకపోవచ్చు. ఒకానొక టైమ్‌లో ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్వింది.. ఏడ్చితే ఏడ్చింది. అంతలా ఆమె హాలీవుడ్‌ను శాసించింది. ‘వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ’ అని అర్థం వచ్చేలా తన పేరును తనే పెట్టుకుంది. ఎంతగా వెలిగిందో అంతే చీకటి, ఒంటరితనం ఆమె జీవితంలో ఉన్నాయి. తన మరణం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీనే. పోలీసులు దాన్ని ఆత్మహత్యగా డిక్లేర్ చేసినా, అది హత్యే అనే అనుమానాలున్నాయి.
ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే.. ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. ‘బ్లాండ్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పానిష్ నటి ఆనా డి అర్మాస్ మార్లిన్‌గా నటిస్తోంది. జాయిస్ క్యారల్ ఓట్స్ రాసిన నవల ఆధారంగా ఆండ్రూ డొమినిక్ దీన్ని తీస్తున్నాడు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. మన్రో గ్లామర్‌నే కాకుండా ఆమె జీవితంలోని సంఘర్షణను కూడా ఎలివేట్ చేసేలా ఉన్నాయి విజువల్స్. తన లైఫ్ గురించి ఇందులో ఏం చూపించబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 28న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.