విశ్లేషణ: సీనియర్​ సిటిజన్లకు రైల్వేలో రాయితీ ఇయ్యాలె

విశ్లేషణ: సీనియర్​ సిటిజన్లకు రైల్వేలో రాయితీ ఇయ్యాలె

గతంలో రైలు ప్రయాణంలో అమలైన సీనియర్ సిటిజన్స్ రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది.  దీంతో వయేవృద్ధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. .దూరాన్ని, ప్రయాణానుభూతి చౌకగా లభించే సౌకర్యం చేజారటం నివ్వెర పరచింది. సమాజంలోని రకరకాల వర్గాలకు ఎన్నెన్నో మార్గాల్లో రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం... సీనియర్​ సిటిజన్లకు ఉపయుక్తమైన చర్యలను నిలిపివేయడం బాధాకరం. రైళ్ళలో గతంలో సాధారణ ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని 58 ఏళ్ళు నిండిన మహిళలకు 50 శాతం, 60ఏళ్ళు నిండిన పురుషులకు 40 శాతం రాయితీలు ఇస్తున్నారు. ఈ సౌకర్యం ఎన్నో ఏళ్ళనుంచి అమలౌతోంది. కరోనా పుణ్యమాని సీనియర్ సిటిజన్స్ రాయితీలను నిలిపివేశారు. ఆ పిమ్మట అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నా రాయితీల పునరుద్ధరణ జరగలేదు. ప్రతి మనిషీ ఏదో ఒక రోజున సీనియర్ సిటిజన్ కావడం తప్పదు. ప్రయాణికుల సేవల కోసం ప్రభుత్వం గత ఏడాది. రూ. 59వేల కోట్లు రాయితీ ఇచ్చిందని కేంద్రం చెబుతోంది.

 అంతులేని, హద్దుల్లేని...కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చే ఉచిత పథకాల కన్నా ... ప్రజా బాహుళ్యాన్ని ఆకట్టుకునే, ఆదరించే రాయితీ కల్పన మేలు. దీన్ని మేధావులు, మీడియా తులనాత్మకంగా ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. ఇటీవలే వందే భారత్ రైళ్ళను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన మార్గాల్లో ప్రవేశ పెట్టింది. రైల్వేలు సాంకేతిక పరంగా గొప్ప ప్రగతినే చాటాయి. సమయం కుదింపు... టెక్నాలజీ సమ్మిళితమైన ఎన్నో ఆకర్షణలు భాగమయ్యాయి. కాస్త ఖరీదైన రైలు ప్రయాణం కావడంతో సాధారణ జనానికి అవి అందుబాటులో ఉండటం కష్టం. సువిశాల భారతంలో ఒక వైపు నుంచి మరోవైపునకు పయనించడానికి రైలు ప్రయాణమే ఆధార మన్నది తెలిసిందే. రోజూ నడిచే వందలాది రైళ్ళలో లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. అందుకే వారికి దక్కే రాయితీలకోసం ఎదురుచూస్తున్నారు.  ఏతావాతా పలువురికి ఉపకరించే సీనియర్ సిటిజన్స్ రాయితీల పునరుద్ధరణ పై కేంద్రం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి అనుభూతులను పరిగణించాలని సకల జనుల ఆకాంక్ష.
- చెన్నుపాటి రామారావు,
విజయవాడ