మన ఊరు - మనబడి పనులెక్కడ..? : మేకిరి దామోదర్

మన ఊరు - మనబడి పనులెక్కడ..? :  మేకిరి దామోదర్

—మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీ గోడల నిర్మాణ పనులు ఎక్కువ చోట్ల మొదలే కాలేదు. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల స్థానంలో కొత్తవి వస్తాయని ఆశించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవస్థలు తీరకపోవడంతో నిరాశ తప్పడం లేదు. ఏ ఒక్కచోట పెద్ద తరహా పనులు ప్రారంభం కాలేదని తెలుస్తున్నది. ‘మన ఊరు--మనబడి’ ‘ మనబస్తీ--మనబడి’ అంచనా వ్యయం రూ. 30 లక్షల లోపు ఉన్న పాఠశాలల్లో  ఎక్కువ చోట్ల ఏదో ఒక పని మొదలుకావడమో  లేదా ఆ ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పనులను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు లేదా కమిటీ తీర్మానించిన వారికి అప్పగించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రం పాఠశాల విద్యలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు- మనబడి’ ‘మన బస్తీ -మనబడి’  కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా దీనిని ప్రకటించింది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు -మనబడి గాను, పట్టణ ప్రాంతాల్లో మనబస్తీ -మనబడి గాను రూపొందించబడింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  మౌలిక వసతులను కల్పిస్తూ పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందనేలా ప్రాచుర్యం కల్పించారు.అలా సర్వతోముఖాభివృద్ధితో పాఠశాలల్లో మంచి వాతావరణం కల్పిస్తే విద్యార్థులను బడివైపు రప్పించుకోవడానికి తోడ్పడతాయి.

మొదటి విడుతనే కాలేదు

ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మూడు దశల్లో చేపట్టి, మూడు సంవత్సరాలకు గాను రూ. 7,289.62 కోట్ల ఖర్చుతో ఆధునికీకరించడానికి నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలా మొదటి విడతలో 2021--22 సంవత్సరంలో ప్రతి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుండి అధిక విద్యార్థుల నమోదు కలిగిన 9,123 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 3,497.62 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మిగిలిన పాఠశాలల్లో  రెండు, మూడవ విడతలలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలనుకుంది. 

ఈ పథకం కింద చేయాల్సిన పనులు 12 రకాలు ఉన్నాయి.  అవి ఏమిటంటే, ప్రధానంగా నిరంతర నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ,  విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నీచర్, రంగులు వేయడం, పెద్ద చిన్న తరహా మరమ్మత్తులు చేయడం, గ్రీన్ బోర్డులు, ప్రహారీ గోడలు, వంటగదుల నిర్మాణం, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాలలు (ఉన్నత పాఠశాలల్లో మాత్రమే). డిజిటల్ సౌకర్యాలు. ఈ కార్యక్రమ లక్ష్యం 26,065 ప్రభుత్వ బడుల్లో వసతులు మెరుగుపరచడం. తొలివిడతలో ఎంపిక చేసిన పాఠశాలలు 9,123 (ప్రతి మండలంలో మూడో వంతు) . 

అందులో కలెక్టర్లు పరిపాలన అనుమతులు 8,823 పాఠశాలలకు ఇచ్చారు.  7,211 పనులు ప్రారంభమైనాయి. 1,200 మాత్రమే పనులు పూర్తి అయ్యాయి.  వీటిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖలు..పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, టి ఎస్ ఈ డబ్ల్యూ ఐ డి ఎస్, మున్సిపాలిటీ, సాగునీటి పారుదల శాఖలు. తాజా పరిస్థితులు చూస్తే పనులన్నీ నత్తనడకే సాగుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రకటించిన మార్చిలో ఆ వేసవి సెలవుల్లో  పనులు పూర్తిచేసి, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరలేదు. అంతే కాకుండా వచ్చే ఏడాది కూడా సంపూర్ణంగా పనులు పూర్తి చేసే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. 

వేసవి వరకు కూడా పూర్తయ్యేట్లు లేవు

మార్చి 9న వనపర్తిలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ప్రచార ప్రకటనల తీరు చూస్తే వేసవి సెలవుల్లో పనులు పూర్తిచేసి జూన్ లో పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి అందిస్తారని అందరూ భావించారు. కానీ ఈ విద్యా సంవత్సరం 2022-–23 ఏప్రిల్  ముగిసే నాటికి కూడా ఈ పథకంలోని పనులు పూర్తి అయ్యే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని కొన్నిచోట్ల పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు మొదలు కాకపోవడంతో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు.  మరుగుదొడ్లు లేక ముఖ్యంగా బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇదిలా ఉంటే ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ కృత్యాధార బోధన గుణాత్మక విద్య కోసం తరగతి గదుల అవసరం తప్పనిసరి అయినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో ఎస్ఎంసీ చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయులచే బ్యాంకులో రెండు ఖాతాలను తీయించారు. ఒకటి ప్రభుత్వ నిధుల నిర్వహణకు, రెండవది ప్రజల భాగస్వామ్యం కల్పించడం కోసం దాతలు ఇచ్చే నిధుల కోసం తెరిపించినారు. 

కానీ ఎక్కడ కూడా దాతలు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా బడులకు తమ పూర్వీకుల, తల్లిదండ్రుల పేరు పెట్టుకోవడానికి అవసరమైన విరాళాలు లేదా స్థలాలను ఇచ్చే జీవో కు స్పందన కరువైంది. కేవలం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10 దరఖాస్తులు మాత్రమే విద్యాశాఖకు అందినాయి. ఇందుకోసం పాత జీవో ప్రకారం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలుగా ఉన్న దానిని సవరించిన జీవో 2 మేరకు రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెంచడంతో పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే సత్సంకల్పానికి, దాతల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లు అయింది.

 ప్రచారం ఎక్కువ – పని చాలా తక్కువ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ బడుల రూపురేఖలు మార్చాలనుకున్న గొప్ప ఆశయం అభినందనీయమే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో పనులు మందకొడిగా సాగుతున్నాయి.ఈ పథకానికి ప్రభుత్వం కల్పించిన ప్రచార స్థాయిలో పనులు జరగకపోవడంతో విద్యార్థుల విలువైన బోధన కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఆటంకంగా మారింది. వేసవి సెలవుల్లో పనిచేయక పోవడం భావ్యమా! కనీసం ఇప్పటికైనా ఆ బృహత్తర పథకం నత్తనడకన సాగడానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా ప్రభుత్వం సమీక్షలు జరిపి నిధులను విడుదల చేయాలి. 

సంబంధిత అన్ని శాఖలను అప్రమత్త పరచాలి. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పనుల్లో నాణ్యతను పాటిస్తూ సకాలంలో పూర్తిచేసే బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ వచ్చి 9 ఏండ్లు కావస్తున్నా.. మన పాఠశాలలు ఇప్పటికీ బాగుపడక పోవడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా విద్యార్థుల వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గమనించాలి.

- మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్