హైడ్రా పరిహారం బాధితులకు టీడీఆర్ లేదంటే డబుల్ బెడ్రూమ్

హైడ్రా పరిహారం బాధితులకు టీడీఆర్ లేదంటే డబుల్ బెడ్రూమ్
  • ఎఫ్టీఎల్ పరిధిలో చట్టబద్ధంగా  ఆస్తులు కోల్పోయిన వారికి భరోసా
  • ప్రభుత్వం ఆదేశించడంతో నిర్ణయం
  • బాధితులు ఒప్పుకున్న విధంగా పరిహారం
  • జీహెచ్ఎంసీకి లెటర్​రాయనున్న కమిషనర్​ 

 హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపులో భాగంగా ఎఫ్టీఎల్​లో ఆస్తులు కోల్పోయిన అసలైన బాధితులకు టీడీఆర్ (ట్రాన్స్ ఫర్ డెవలప్మెంట్ రైట్స్) రూపంలో హైడ్రా పరిహారం అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బతుకమ్మ కుంట, బుమృక్ ఉద్ధౌలా చెరువు, కూకట్ పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తమ్మిడికుంట చెరువు, ఉప్పల్ పెద్ద చెరువుల ఎఫ్ టీఎల్ లను గుర్తించి, అక్కడి ఆక్రమణలను తొలగించింది. 

హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో తక్కువ ధరకు భూములు కొన్న పేదలకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో స్పందించిన హైడ్రా ఎఫ్టీఎల్​లో ఆస్తులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడా స్థలం గానీ, ఇండ్లు గానీ లేకపోతే  టీడీఆర్ ఇప్పించాలని భావిస్తోంది. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే డబుల్​బెడ్​రూమ్ ఇచ్చే అంశాన్ని కూడా ఆలోచిస్తోంది. 

చట్టబద్ధంగా పట్టాలు కలిగి ఉన్నవారు ఆస్తులను కోల్పోతే తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇండ్లు, జాగలు కోల్పోతున్న వారికి రెండింతల పరిహారం ఇవ్వాల్సి ఉండగా, నాలుగింతలు చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ అంశంపై  ప్రభుత్వం  నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

 జీహెచ్ఎంసీ ద్వారానే..

చెరువుల పరిరక్షణ చర్యల వల్ల నష్టపోయిన వారికి సమగ్రంగా గుర్తించేందుకు హైడ్రా ప్రత్యేక ప్రక్రియను చేపట్టింది. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు బాధితులు వద్ద ఉన్న డాక్యుమెంట్లపై సమగ్ర విచారణ జరపనున్నది. ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, నష్టపోయిన భూమి విలువకు అనుగుణంగా టీడీఆర్ జారీ చేయాలని జీహెచ్‌‌ఎంసీకి హైడ్రా లెటర్​రాయనున్నది. టీడీఆర్ ఇచ్చే అధికారం హైడ్రాకు లేకపోవడంతో జీహెచ్ఎంసీ ద్వారా ఇప్పించనున్నారు. ఎఫ్‌‌టీఎల్ పరిధిలో ఇండ్లు లేదా ప్లాట్లు కోల్పోయిన వారికి టీడీఆర్ ద్వారా ఆర్థికంగా 
భరోసా లభిస్తుంది.  

ముష్కిన్ చెరువు.. ఒక మోడల్ అవ్వాలి

 సీఎస్ఆర్ నిధులతో చేసే చెరువుల అభివృద్ధికి నార్సింగిలోని ముష్కిన్ చెరువు ఒక నమూనా కావాలని తత్వ డెవలపర్స్​కు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. దాదాపు 60 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు పరిసర కాలనీల నివాసితులు, దేవాలయ కమిటీ సభ్యులు, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, చెరువు అభివృద్ధిని చేప‌‌ట్టిన త‌‌త్వ డెవ‌‌ల‌‌ప‌‌ర్స్ ప్రతినిధులతో కమిషనర్ గురువారం స‌‌మావేశం ఏర్పాటు చేశారు.  చ‌‌ర్చించారు. ఎఫ్‌‌టీఎల్ ప‌‌రిధిలోకి వ‌‌చ్చేవారికి టీడీఆర్ (ట్రాన్సఫ‌‌ర్ బుల్ డెవ‌‌ల‌‌ప్​మెంట్ రైట్స్‌‌) కింద న‌‌ష్టప‌‌రిహారం అందేలా చూస్తామ‌‌న్నారు.

టీడీఆర్ అంటే? 

టీడీఆర్ అనేది భూమి కోల్పోయిన యజమానికి ప్రభుత్వం ఇచ్చే ఒక హక్కు పత్రం. దీని ద్వారా కోల్పోయిన భూమి స్థానంలో వేరే చోట అదనపు నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. టీడీఆర్ పొందిన వారికి నిర్మించుకునే స్థోమత లేకపోతే టీడీఆర్ సర్టిఫికెట్​ను బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకోవచ్చు. ఇది భూమికి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టీడీఆర్ కి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్​లో టీడీఆర్ విలువ కంటే 50 శాతానికిపైగా అదనంగా ఉంది.