రుణమాఫీ ఎక్కడ?ఉద్యోగాలు ఏవీ?

రుణమాఫీ ఎక్కడ?ఉద్యోగాలు ఏవీ?

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2019-–20 బడ్జెట్ మరోసారి ప్రజలను మోసం చేసేదిలా ఉంది.  వాస్తవిక బడ్జెట్ అంటూ పదేపదే చెప్పినా ఒక అబద్ధపు అవాస్తవ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించకుండా ప్రజలను మోసం చేశారు. ఎన్నికల ప్రధాన హామీలలో ఒకటైన 3,016 రూపాయల నిరుద్యోగ భృతి సంగతి చెప్పలేదు. రుణమాఫీపైన స్పష్టత లేదు. ఉద్యోగాల సంగతి చెప్పలేదు. ఆర్టీసీ విలీనం మాట్లాడలేదు, రైతు బంధుపైన సరైన ప్రకటన లేదు. గత ఫిబ్రవరిలో లక్షా 82 వేల 17 రూపాయల ప్రతిపాదికగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్  ప్రవేశపెట్టిన కేసీఆర్ ఈసారి వాస్తవికం పేరుతో లక్షా 46 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే దాదాపు 36,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్ ప్రతిపాదించారు. దీనికి తోడు మరో 24,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుకూడా చూపించారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు 60 వేల కోట్లు తక్కువ బడ్జెట్ చూపారు. మొత్తంగా రెవెన్యూ లోటు, గత బడ్జెట్ తగ్గింపు రెండూ కలిపి దాదాపు 60,000 కోట్ల రూపాయలు తక్కువగా వచ్చిందన్న మాట.

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలు అని స్పష్టంగా అర్థం అవుతోంది.  ఇకపోతే మూలధన వ్యయం 17,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు.  ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలున్న ఈ బడ్జెట్లోనే 17,000 కోట్ల రూపాయలు మూల ధనం ఉంటే… ఇక అభివృద్ధి పనులు ఏమీ ఉండవని కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారు. బకాయిలు 30,000 కోట్లు చెల్లిస్తానని అంటున్నారు. ఇక అభివృద్ధి పనులకు ఏ రకంగా డబ్బులుంటాయో ముఖ్యమంత్రే చెప్పాలి. ఇదిలాఉంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల రూపాయల అప్పులకు కట్టాల్సిన వడ్డీలు ఇంకా అలాగే ఉన్నాయి.  అవి ఇవి కూడితే బకాయిలు మూడింతలు అవుతాయి. అలాంటప్పుడు రాబోయే కాలంలో అభివృద్ధి పనులు ఎలా చేస్తారు?

ఇప్పటికే పాఠశాలల్లో ‘జెండా పండుగలనాడు చాక్లెట్లకు డబ్బులు లేవు’ అని ఎమ్మెల్సీ సతీష్ ఆగస్టు 15న బహిరంగంగానే చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పాలు ఇవ్వడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో గుడ్లు, పాలు బందయ్యాయి. 108 ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోవడంతో వైద్య సేవలు బంద్ చేశారు. దవాఖానాల్లో మందులు లేవు. తెలంగాణ అంతా రోగాలతో పడకేసినా ముఖ్య మంత్రి స్పందించరు. మొత్తంగా తెలంగాణలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడింది.

వ్యవసాయ అభివృద్ధి రేటు 6.5 శాతం ఉందని కేసీఆర్ అన్నారు. రైతుల ఆదాయం ఆ మేరకు ఎందుకు పెరగలేదు? వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఎందుకు పెరగలేదనేదికూడా కేసీఆర్ చెప్పాలి. రుణమాఫీకి ఈ బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రుణమాఫీ బకాయిలు 38,000 కోట్లు. ఎలాంటి విధానం లేకుండా ఇలాంటి ప్రకటనలు ఇంకా ఎన్ని ఏళ్ళు చేస్తారు?

రైతు బంధు పథకంలో స్పష్టత లేదు. యధావిధిగా కొనసాగుతుంది అన్నారు. ఒకపక్క ఖరీఫ్ అయిపోతోంది. ఇప్పటివరకు 50 శాతమే అందింది. ఎన్నికల ముందు ఒక్కసారే పంటసాయం సొమ్ములు వేసిన కేసీఆర్ ఇప్పుడు దశలవారీగా ఎందుకు వేస్తున్నారు? కొత్త ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్, వేతనాల పెంపు ఇలాంటివి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కేసీఆర్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎలాంటి ఆశలు లేకపోగా… మరిన్ని వాతలు ఖాయమని తేలిపోయింది.

తెచ్చిన అప్పులు అన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో పోశారు. మన బడ్జెట్తో పాటు, అప్పుగా తెచ్చిన వేల కోట్ల రూపాయలు పోసినా కాళేశ్వరం ఫెయిలైంది. ఆ విఫల ప్రాజెక్ట్ని గొప్ప ప్రాజెక్ట్గా చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ ప్రధాన సెంటిమెంట్లయిన సాగునీరు, విద్యుత్ అంశాలను కేసీఆర్ చాలా బాగా వాడుకుంటున్నారు.  24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రజలను, సాగునీరు పేరుతో రైతులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజా అవసరాలను మాత్రం తీర్చడం లేదు.

రూ.24 వేల కోట్ల మేర పన్నులు పెరుగుతాయ్!

ఇకపోతే ఇది వాస్తవిక బడ్జెట్ అని చెబుతున్న కేసీఆర్ గత అయిదేళ్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ అవాస్తవిక బడ్జెట్లే అని చెప్తున్నట్టే కదా! ప్రతిపక్షాలు చెబుతున్న మాటలు కేసీఆర్ ఒప్పుకున్నారా? 24,000 కోట్ల లోటు బడ్జెట్ చూపిస్తున్న కేసీఆర్… ఆ లోటును ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పలేదు. ఏదైనా అప్పు చేయాలి లేదా పన్నులు వేయాలి. కాదంటే కోత పెట్టాలి. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల మీద  మరో 24,000 కోట్ల రూపాయల పన్నులు పడే అవకాశం ఉందని కేసీఆర్ ముందుగానే చెబుతున్నారు.

స్వయంగా ముఖ్యమంత్రే ప్రభుత్వ భూములను అమ్మి ఆయా శాఖలకు డబ్బు కేటాయిస్తాం అంటున్నారు.  కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసి ప్రభుత్వ భూములు కాపాడితే, వాటిని భవిష్యత్ తరాలకు లేకుండా తెగనమ్మి అప్పులు తీరుస్తానని కేసీఆర్ అంటున్నారు. అంటే, పాలనలోనూ, ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలోనూ ఆయన విఫలం అయినట్టే కదా? ప్రభుత్వ భూములు అమ్మడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచాలని డిమాండ్ చేస్తోంది.

కప్పర హరి ప్రసాద్ రావు, చీఫ్ పీఆర్వో, తెలంగాణ పీసీసీ