దేశాలను నియంత్రిస్తున్న అప్పులు

దేశాలను నియంత్రిస్తున్న అప్పులు

ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ధనిక దేశమైన అమెరికా,  కమ్యూనిస్ట్  దేశంగా భావించే  చైనాతోపాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించే భారతదేశం వరకు అప్పులు చేస్తున్నాయి. అన్ని దేశాలకు ఎంతోకొంత అప్పులు ఉన్నాయి. అప్పులతో సతమతమవుతున్న పాకిస్తాన్ లాంటి దేశాలు ఉన్నాయి. 

ఒకప్పుడు ఒక దేశాన్ని నియంత్రించాలన్నా, ఆక్రమించాలన్నా సైన్యాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు అప్పులు ఆయుధాలు అయినాయి. ఆఫ్రికా ఖండంలో దాదాపు అన్ని దేశాలు అప్పులు బారిన పడ్డాయి. ఆఫ్రికా దేశాలకు అప్పులిస్తున్న దేశాలకు వాటి ఖనిజసంపదను దోచుకునేందుకు ఈ మార్గాన అవకాశం ఏర్పడింది. అప్పుల వెనుక రాజకీయం, కుట్ర, అవినీతి ఉంటుంది. అనుభవపూర్వకంగా ఈ నిజాలు తెలిసినా మన దేశం, మన దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు జేస్తున్నాయి. 

చేసిన అప్పుల మీద చర్చ లేదు. అప్పులు వల్ల పెరిగిన లేక పెంచిన పెట్టుబడుల మీద సమాచారం ఉండదు. అప్పులతో  కట్టిన ప్రాజెక్టు ప్రయోజనాల మీద చర్చ పెట్టరు.  అప్పుల ద్వారా చేసిన అభివృద్ధి గురించి జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ, వాటి మీద మాత్రం చర్చకు సిద్ధంగా లేరు. 

అప్పులు చేసి నిర్మించే ఆర్థిక వ్యవస్థ ఒక రకమైన మోసం. ఈ మోసం అర్థంకాకుండా ఉండడానికి రాజకీయనాయకులు, ఆర్థికవేత్తలు మోసపూరిత ప్రకటనలతో అభివృద్ధిని సంక్లిష్టం చేస్తున్నారు. సాంకేతిక విప్లవాలు అవసరం అని మాయమాటలు చెప్పి ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అందించే ప్రక్రియలలో అప్పులదే  కీలక పాత్ర.  అప్పుల ఊబిలో నుంచి ఉద్భవించిన ఆర్థికవ్యవస్థకు ఆధునిక అభివృద్ధి అని పేరుపెట్టి  ప్రజలను మోసం చేస్తున్నారు.

 -అప్పులతో కూడిన ఆర్థికవ్యవస్థ -ఆధునిక కాలంలో ఉద్భవించింది. అప్పులు పెట్టుబడులు అవుతాయి. కొందరికి సంపద అవుతుంది. తిరిగి అవి లాభాపేక్షతో కూడిన పెట్టుబడులుగా తిరిగి దేశంలో  ప్రవేశిస్తాయి. ధనం, సంపద అట్లా తిరుగుతూ కొందరి దగ్గరకే చేరుతుంది.  దేశాలు -ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు.. ప్రగతి, ఆధునీకరణ సాకుతో తరచుగా రుణాలు తీసుకుంటున్నాయి.

రుణాల వెనుక కండిషన్స్​

రుణాలను అందించే  సంస్థలు ఐఎంఎఫ్,  ప్రపంచబ్యాంకు వంటివి - శక్తిమంతమైన దేశాలకు భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడిన ఆర్థిక విధాన వ్యవస్థకు వాహకాలుగా పనిచేస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా రుణాల వెనుక ఈ సంస్థలు కొన్ని కండిషన్స్ పెడతాయి.  ప్రతి రుణం ఇచ్చేముందు, లేదా తరువాత, కట్టుబాటు చర్యలతో కూడినవి ఉంటాయి.

 కఠిన చర్యలు, ప్రజా వనరుల ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో జాతీయ సార్వభౌమత్వాన్ని అప్పగించడం.  బహుళజాతి కార్పొరేటు సంస్థల సహకారంతో,  ప్రభుత్వాలు  రుణాలను అభివృద్ధికి అవసరమైన వనరులుగా  ప్రజలకు చెబుతాయి. కానీ, మోసం ఇక్కడే ఉంది.  ఎవరు ఇచ్చినా, అప్పులు తీసుకుని కట్టే ప్రతి ప్రాజెక్టు ప్రయోజనాలు చాలా అరుదుగా ప్రజలకు చేరుతాయి. అవి ఉన్నతవర్గాన్ని సంపన్నం చేస్తాయి. ఈ రుణ బాధ్యతలను ప్రజలు తీర్చేవిధంగా ఆరోగ్యం, విద్య, సంక్షేమంలో  కోతలు విధిస్తారు. చివరికి ప్రాజెక్టుతో  సంబంధం లేని ప్రజలు ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు, వడ్డీ భారాన్ని మోస్తారు. 

బిలియన్లకొద్దీ రుణాలు

జాతీయ ప్రభుత్వం తీసుకునే రుణాన్ని సమర్థించడానికి జాతీయ అభివృద్ధి  పదం చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు.  జాతీయ  ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల - అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF),  ప్రపంచ బ్యాంకు లేదా సంపన్న దేశాల - నుంచి బిలియన్లకొద్దీ రుణాలు తీసుకుంటున్నాయి. ఇది మౌలిక సదుపాయాలను నిర్మించడం, వృద్ధిని ప్రేరేపించడం లేదా పేదరికం నుంచి జనాభాను బయటకు తీసుకురావడం కోసం అని ఆయా దేశాలు చెప్పుకుంటాయి.  

లేదా వారి నియంత్రణలో ఉండే రుణసంస్థలు, తమ వ్యాపారాన్ని, తమ వ్యాపార సంస్థల ఉత్పత్తులను, సేవలను ఈ ఋణంలో అంతర్గత భాగంగా చేస్తాయి.  విధిగా వాటిని తీసుకోవాల్సిందే. బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ ఏర్పాటుకు  జపాన్ రుణం ఇస్తుంది.  అది వారి ఉత్పత్తి కనుక.  చైనా ఒక రైల్వే లైనుకు రుణం ఇస్తుంది.  దాని వలన పాకిస్తాన్ నుంచి ఖనిజాల రవాణా తమ దేశానికి సులువుగా చేయడానికి.   తమ  కంపెనీలకు నిర్వహణ, శాస్త్రీయ అధ్యయనానికి, వ్యాపార వృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి అమెరికా భారతదేశంలో వ్యర్ధ జలాల కేంద్రానికి  రుణం ఇస్తుంది. 

 నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలు

‘సాప్’ (Structural Adjustment Programmes)లు  1980– 1990లలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో, ఆర్థిక సంక్షోభాల సమయంలో  రుణాల కోసం  IMF,  ప్రపంచబ్యాంకు వైపు మొగ్గు చూపాయి. వారి బలహీనతను సాకు చేసుకుని, ఈ  సంస్థలు ఆయా దేశాలు నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలను (SAPలు) అమలు చేయాలనే షరతుపై  రుణాలు అందించాయి. 

ఈ SAPలు ప్రభుత్వాలు ప్రజా వ్యయాన్ని తగ్గించాలని,  ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను ప్రైవేటీకరించాలని,  మార్కెట్లను సరళీకృతం చేయాలని,  ఆర్థికవ్యవస్థలలో  విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలని షరతులు ఉండేవి.  జాంబియా, ఘనా దేశాలు రుణదాతల ఒత్తిడితో SAPలను అమలుజేశాయి.  ఈ  సంస్కరణల వల్ల  కీలక
రంగాలపై  ప్రభుత్వాలు నియంత్రణ కోల్పోయాయి.   కొన్ని స్థూల ఆర్థిక సూచికలు మెరుగుపడినప్పటికీ, పేదరికం తీవ్రమైంది.  ఆ రుణాల కోసం ప్రకటించిన విధానాలు  రాజకీయేతరమైనవి కావు.  అవి నవ ఉదారవాదం  సైద్ధాంతిక లక్ష్యాలకు ఉపయోగపడ్డాయి.  బహుళజాతి సంస్థలకు మార్కెట్లను తెరిచాయి. 

ఉజ్వల భవిష్యత్తు పేరిట రుణాలు

 వర్తమాన కష్టాలను భరిస్తూ ఉజ్వల భవిష్యత్తు పేరిట రుణాలను తీసుకుని ప్రజలను తప్పుదారి పట్టించడం పాలకులకు అలవాటుగా మారింది.  ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బహుళజాతి సంస్థలు, కార్పొరేటు సంస్థల మధ్య ఉండే ఏకాభిప్రాయానికి, తాము కోరుకున్న అభివృద్ధికి బాట ఈ రుణం ఏర్పరుస్తుంది.  ప్రజల సమ్మతి అవసరం.  ప్రజలతో సంప్రదింపులు ఉండాలి. 

అప్పు అనేది అసమానతను పెంపొందించడానికి, నవ ఉదారవాద సంప్రదాయాన్ని అమలు చేయడానికి లేదా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ఒక యంత్రాంగంగా మారినప్పుడు దానిని వృద్ధికి సాధనం అని భావించరాదు. ఇది దోపిడీకి ముసుగు.  దేశాలు తమ భవిష్యత్తును సొంతంగా రూపొందించుకునే శక్తిని తిరిగి పొందేవరకు,  అప్పుల భారం తీరేవరకు  అభివృద్ధి ఒక విరిగిన వాగ్దానంగానే ఉంటుంది.  అభివృద్ధి  నిజమైనదైతే  అది ప్రజలను శక్తిమంతం చేయాలి. ఆధారపడటాన్ని పెంచకూడదు లేదా ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేయకూడదు. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో. అది ఎవరికి సేవ చేయాలో అలోచించడానికి ప్రభుత్వాల రుణం చుట్టూ అల్లుకున్న అందమైన ప్యాకేజీని విప్పడం చాలా అవసరం.

 చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ 

 చైనా దేశం చేపట్టిన  చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (BRI)  అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య  సహకారానికి కొత్త నమూనాగా ప్రశంసించారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో చైనా మౌలిక సదుపాయాలను  నిర్మించడం ఇందులో భాగం.  ఈ చైనా  రుణాలు ఉచ్చులుగా  మారతాయని  విమర్శ అప్పటికే ఉన్నది. 

 పాకిస్తాన్,  శ్రీలంక,  కంబోడియా,  కొన్ని ఆఫ్రికన్ దేశాల విషయంలో ఇది నిజమైంది. 2017లో,  హంబన్‌టోటాలో ఓడరేవును నిర్మించడానికి ఉపయోగించిన చైనా రుణాలను తిరిగి చెల్లించలేని శ్రీలంక, ఆ ఓడరేవును చైనాకు 99 సంవత్సరాలు లీజుకు ఇవ్వవలసి వచ్చింది. ఈ ప్రాజెక్టును మొదట్లో దేశ అభివృద్ధికి కీలకంగా చెప్పినప్పటికీ, అది శ్రీలంకను  భారీ అప్పులతో ముంచెత్తింది. చివరికి ఒక వ్యూహాత్మక భూభాగాన్ని విదేశీ శక్తికి అప్పగించాల్సి వచ్చింది.  ప్రాదేశిక లేదా ఆర్థిక నియంత్రణ కోసం దేశాల ఆర్థిక బలహీనతను ఉపయోగించుకునే వలస రాజ్యాల యుగంలో చేపట్టిన వ్యూహాన్ని ఈ ఉదాహరణ ప్రతిధ్వనిస్తుంది.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​-