దీపావళి తర్వాతే పత్తి కొనుగోళ్లు..ఏర్పాట్లు చేస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు

దీపావళి తర్వాతే పత్తి కొనుగోళ్లు..ఏర్పాట్లు చేస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు
  •     వర్షాలతో పత్తి తీత ఆలస్యం 
  •      దిగుబడిపైనా తీవ్ర ప్రభావం
  •     ఈఏడాది 4.28 లక్షల ఎకరాల్లో సాగు

ఆదిలాబాద్, వెలుగు: ఈ ఏడాది వర్షాకాలం పంటలను వాతావరణం దెబ్బకొట్టింది. ముఖ్యంగా పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి ఏటా ఈ సమయానికి జిల్లాలో పత్తి పంట ఇప్పటికే ఒక దఫా తీయడం పూర్తయ్యేది. కానీ ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో మొదట వచ్చిన పత్తి కాయలు మురిగిపోయాయి. మిగిలిన కాయలు కొంత మేర పగలడంతో పత్తిని ఏరేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలించి ఎండలు కొడితేనే పత్తి ఏరేందుకు వీలుంటుంది. పత్తి తీత ఆలస్యం కావడంతో కొనుగోళ్లు సైతం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత అన్ని మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది. 

దిగుబడిపై ప్రభావం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 8.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయగా అత్యధికంగా 4.28 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే భారీ వర్షాలతో ఈ ఏడాది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అందులో పత్తి పంట 14 వేల ఎకరాల్లో నష్టపో యారు. వరదల కారణంగా పంటలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేయడంతోపాటు రాళ్లు తేలాయి. రెండో సారి పంట వేసుకునే వీలులేకండా పోయింది. నష్టపోయిన పంటకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

మరోపక్క పంట ఎదిగే దశలో వర్షాలు పడటంతో పత్తి కాయలు మురిగిపోయి, పూత రాలిపోయింది. ఇలా పత్తి పంట దిగుబడులపై ప్రభావం పడింది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయలు మురిగిపోవడంతో ఎకరానికి 4 క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు మద్దతు ధరపైనే ఆశలు పెట్టుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఈ ఏడాది 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఈసారి కొత్త నిబంధనలు

ఈ సారి కొత్తగా తీసుకొస్తున్న కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంతో రైతులకు మేలు జరుగనుంది. ఈ యాప్ ద్వారా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడనుంది. ఈ యాప్ ద్వారా నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ రాజర్షి షా ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంపై వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ యార్డులో కల్పించాల్సిన సదుపాయాలపై దిశానిర్దేశం చేశారు. 

గతంలో కొంత మంది వ్యాపారులు, దళారులు అధికారులతో కుమ్మక్కై ఇతర రైతుల పేరుతో సీసీఐకి పత్తి విక్రయించారు. దీంతో కొంత మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. రైతుల స్లాట్​ బుకింగ్​ ద్వారా ఇప్పుడు ఆ పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో పత్తి తీత ఆలస్యమవుతోందని, ఈనెల 20 తర్వాతే పత్తి కొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్ తెలిపారు.