
ఉప్మా.. సేమియా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా.. ఇలా చాలా రకాల ఉప్మాలు ఉన్నాయి. చాలా మందికి నచ్చని బ్రేక్ ఫాస్ట్ ఐటెం ఏదైనా ఉందంటే అది ఉప్మా నే అని చెప్పాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఉప్మా అంటే ఆమడ దూరం ఉండేవారు చాలామంది ఉంటారు. నిజానికి.. వండటానికి తక్కువ సమయం, ఈజీగా డైజెస్ట్ అయ్యే వంటకాల్లో ఉప్మా ముందుంటుంది.
ఉప్మా చేద్దామని తెచ్చిన గోధుమ రవ్వ అలా కిచెన్ షెల్ఫ్ లోనే ఉండిపోయి పాడైపోతోందని చాలామంది మహిళలు కంప్లైంట్ చేస్తుంటారు.అయితే.. గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా చాలా వెరైటీ, టేస్టీ ఐటమ్స్ చేసుకోవచ్చు. గోధుమ రవ్వతో ఈజీగా ఉప్మా కంటే టేస్టీగా చేసుకునే ఐటెం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమరవ్వ టిక్కీ
కావలసినవి
- గోధుమరవ్వ: అరకప్పు
- ఆలుగడ్డలు : రెండు
- పచ్చిమిర్చి: రెండు
- వేరుశనగలు : రెండు చెంచాలు
- తరుగు పుదీనా : పావుకప్పు
- ఆమూర్ పౌడర్ : ఒక చెంచా
- అల్లం ముక్క: చిన్నది
- ఉప్పు : తగినంత
- నూనె : మూడు చెంచాలు
తయారీ
ఆలుగడ్డల్ని ఉడికించి, తొక్క తీసి, మెత్తగా చేసి పక్కన పెట్టాలి. గోధుమరవ్వలో మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత దీనితోపాటు పుదీనా, ఉప్పు, పచ్చిమిర్చి, ఆమ్చూర్, అల్లం, వేరుశనగలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. మరీ పేస్ట్ చేయకుండా కాస్త పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. దీనిని, బంగాళాదుంప ముద్దని ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గుండ్రంగా (ఫొటోలు చూపినట్టు) ఒత్తుకోవాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి వీటిని ఎరుపు రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. పెరుగు చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ తింటే ఇవి బాగుంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా.