గిదేం పద్దతి.. రాజన్న ఆలయంపై రాజకీయాలు!

గిదేం పద్దతి.. రాజన్న ఆలయంపై రాజకీయాలు!
  • వేములవాడలో రూ.150 కోట్లతో ప్రధాన రోడ్డు, ఆలయ విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వరాలయంలో దర్శనాలు
  • ప్రధానాలయం తెరిచి ఉంచే పనులు చేయాలని బీజేపీ ఆందోళన
  • రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపారంటూ బీఆర్ఎస్ విమర్శలు
  • పదేండ్లలో రాజన్న ఆలయ అభివృద్ధి పట్టని గులాబీ పార్టీ
  • ప్రతిపక్షాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పాలాభిషేకం

వేములవాడ, వెలుగు:  వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై రాజకీయం రాజుకుంది. పనులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అధికార పార్టీ మండిపడుతున్నది. యాదగిరిగుట్ట లెక్కనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయాన్ని, రోడ్లను విస్తరించాలని ఎప్పటి నుంచో డిమాండ్​ ఉన్నది.  కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రూ.150 కోట్లు  కేటాయించి విస్తరణ పనులు ప్రారంభించింది. 

ఈ క్రమంలో పనుల వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రధాన ఆలయాన్ని మూసివేసి.. సమీపంలోని భీమన్న టెంపుల్‌లో  దర్శనాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కానీ దీనిపై ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు నిరసన చేపట్టారు. భక్తుల దర్శనార్థం ప్రధాన ఆలయాన్ని తెరిచే పనులు చేయాలని డిమాండ్​చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్​పార్టీ తప్పు పడుతున్నది. తెలంగాణ వచ్చాక పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు గానీ.. ఏనాడు రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని,  తాము నిధులు కేటాయించి పనులు చేస్తుంటే కావాలనే అడ్డుకుంటున్నారని మండిపడింది. 

రూ.150 కోట్లతో అభివృద్ధి 

రాజన్న దర్శనానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు.  ప్రతి సోమవారంతోపాటు శివరాత్రి, శ్రీరామ నవమి తదితర పండుగల సమయంలో  ఇసుక వేస్తే రాలనంత భక్తజనంతో ఆలయం కిక్కిరిసిపోతుంది. కానీ దీనికి తగ్గట్టు బస్టాండ్​నుంచి ఆలయానికి వెళ్లే రోడ్లు విశాలంగా లేకపోవడం, ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూలైన్లు ఇరుగ్గా ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత 8 మంది మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు వచ్చి రూ. 150 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపనలు చేసి వెళ్లారు. పట్టణంలో రోడ్ల వెడల్పు కోసం రూ.47 కోట్లు మంజూరు చేసి, పనులు మొదలుపెట్టారు. రూ.76 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అన్నదాన సత్రం బిల్డింగ్​ నిర్మాణం కొనసాగుతున్నది. ఆలయం 28 గుంటలు మాత్రమే ఉండడంతో 4 ఎకరాలకు విస్తరించి పనులు చేస్తున్నారు.  

పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాల కోసం రూ. 3  కోట్ల 40 లక్షలతో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాజన్న ఆలయంలోని ఆలయ కళాభవన్, ఆలయ ఈవో అఫీస్, ఎన్టీఆర్​ గెస్ట్‌హౌస్‌ను కూల్చివేశారు. ఆలయంలో పనులు జరుగుతున్నందున భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో  కోడె మొక్కులు చెల్లించడం, కల్యాణాలు, అర్జిత సేవలు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీహోమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కల్యాణ ఉత్సవ మూర్తులను పల్లకీ సేవ ద్వారా శ్రీ భీమేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. 

ప్రతిపక్షాల ఆందోళన

రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి భీమేశ్వరాలయంలో నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజన్న ఆలయాన్ని బంద్​చేశారంటూ ఆందోళనకు దిగాయి. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి వికాస్ రావు అధ్వర్యంలో  రాజన్న ఆలయం ముందు ధర్నా చేసి..  ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో ఇతర దేవాలయాల్లో విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని, రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయొద్దని డిమాండ్​చేశారు. 

ఈవోకు వినతిపత్రం అందజేశారు. దర్శనాలు నిలిపివేస్తే ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. అయితే, ఈ ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మరికొంత మంది పట్టణ బీజేపీ లీడర్లు పాల్గొనలేదు. మరోవైపు  ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ దహనం చేస్తే.. కౌంటర్‌‌గా రాష్ట్ర ప్రభుత్వ చిత్రపటానికి కాంగ్రెస్​ నేతలు పాలాభిషేకం చేశారు.  మరోవైపు రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపారని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారు. 

 సమ్మక్క– సారక్క, మహాశివరాత్రి జాతర తర్వాతే అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్​చేస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు పూర్తికాకముందే దర్శనాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో వసతుల ఏర్పాటు తర్వాతే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పించాలని కోరుతున్నారు.  కాగా, ఆగమశాస్త్రం, శృంగేరి పీఠాధిపతుల సూచన ప్రకారమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వేములవాడ ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. 

బీఆర్ఎస్, బీజేపీ పట్టించుకున్నాయా? 

ఉమ్మడి రాష్ట్ర పాలన నుంచి రాజన్న గుడికి వస్తున్న భక్తులు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఈ ఆలయం అభివృద్ధి గురించి ఏ సర్కారూ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో  కేసీఆర్​2015 జూన్​18న సీఎం హోదాలో వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.400 కోట్లతో ఆలయాన్ని డెవలప్​చేస్తామని ప్రకటించారు. 

కానీ యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసిన కేసీఆర్..​ వేములవాడ ఆలయానికి ప్రకటించిన రూ.400 కోట్లలో ఒక్క రూపాయి మంజూరు చేయలేదని కాంగ్రెస్​ లీడర్లు మండిపడుతున్నారు. రాజన్న గుడి చెరువును పూడ్చారని కాంగ్రెస్​లీడర్లు ఆరోపిస్తున్నారు. అలాగే, ప్రసాద్​ స్కీమ్ ద్వారా ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశమున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు​పట్టించుకోలేదని ఫైర్​ అయ్యారు. 

ఎన్నికల టైంలో ప్రధాని మోదీ వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారని, అప్పట్లోనే కాశీ గుడి అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించి.. వేములవాడకు మొండి చెయ్యి చూపారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేనితనంతో బీజేపీ, బీఆర్ఎస్​లీడర్లు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు.