రాహుల్​లో పరిపక్వత ఇంకా రాలేదా?

రాహుల్​లో పరిపక్వత ఇంకా రాలేదా?

పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలి సమావేశంలో  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా.. ప్రతిపక్ష నేత హోదా పొందిన రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఒకింత వివాదాస్పదంగా అనిపించింది. గతంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కన్ను కొట్టడం నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం బాల్య చేష్టలుగా చాలామంది అభివర్ణించారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 సీట్లు సాధించడంతో ప్రతిపక్ష హోదా దక్కింది.  అధికారపక్షంపై  ఒంటి కాలుపై లేవడం బాగాలేదని   విశ్లేషకుల భావన. ఇండియా అలయన్స్ లో  కాంగ్రెస్ పార్టీది పెద్దన్న పాత్రనే కానీ అంతకుమించి లేదు.  బెంగాల్లో మమతా బెనర్జీ, అధిర్​ రంజన్ చౌదరికి కుదరడం లేదు. కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్​లు ఒకరంటే ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. సిద్ధాంతంపైన యుద్ధం నిర్మాణాత్మకంగా ఉండాలి.

మొన్నటి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కేరళ వెళ్లి కమ్యూనిస్టులకు,  కేరళ సీఎం పినరయి విజయన్​కి వ్యతిరేకంగా మాట్లాడి వచ్చారు. మా పార్టీ హైకమాండ్​ఆదేశాలను పాటించానని, ఇందులో నా ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఆ వెంటనే ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఓదార్చి వచ్చారు. అలాగే ఉత్తరప్రదేశ్​లో ప్రత్యేక పరిస్థితుల వల్ల సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసింది. తమిళనాడులో డీఎంకే పార్టీ  బీజేపీని సనాతన ధర్మాన్ని, హిందూత్వాన్ని వ్యతిరేకిస్తేనే మన కలుగుతుంది కాబట్టి కాంగ్రెస్ తో ఉంది. అంతేగానీ వాళ్లకు కాంగ్రెస్ పై ప్రత్యేకమైన ప్రేమ ఏం లేదు. గతంలో యూపీఏ  ప్రభుత్వాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కింది అరవింద్ కేజ్రివాల్.  ఈ ఈక్వేషన్స్ అన్నీ అర్థం చేసుకోకుండా రాహుల్ గాంధీ తనకు తానే పెద్ద నాయకుడిగా ఊహించుకోవడం తొందరపాటవుతుంది. సిద్ధాంతంపైన యుద్ధం నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ అవహేళనగా, సెల్ఫ్ గోల్​గా ఉండకూడదు.

దుష్ప్రచారమే ఎజెండానా?

ఎన్నికల్లో యోగేంద్ర యాదవ్ మార్గదర్శకత్వంలో  లాభం పొందుతాం అనుకొని రాహుల్ గాంధీ   లేవనెత్తిన రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల తొలగింపు అంశాలు తాత్కాలికంగా పనిచేశాయి. నిజానికి రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని ఎక్కువసార్లు ఉపయోగించింది కాంగ్రెస్ పార్టీ.   నందలాల్ బోస్ చేత చిత్రింపజేసి రాజ్యాంగంలో పొందుపరిచిన సుమారు 24 చిత్రాలు ప్రాచీన భారత సాంస్కృతిక తత్వాన్ని తెలియజేస్తాయి. అవి రాజ్యాంగ సభ్యులంతా ఆమోదించిన తర్వాత అందులో చేర్చారు. రాజ్యాంగాన్ని సుమారు 110 సార్లకు పైగా మార్పులు చేర్పులు చేసింది ఎవరి ఆధ్వర్యంలో అన్న విషయం రాహుల్ గాంధీకి  కాంగ్రెస్​పెద్దలు చెప్పాలి. రాజ్యాంగం మూల భావన మార్చడానికి వీలులేదని కేశవానంద భారతి, గోలకనాథ్ కేసులలో  సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియపరిచింది. ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలియక కాదు. 

పరమశివుడు సంహారకుడు

రాహుల్ గాంధీ పార్లమెంట్లో శివుడి చిత్రాన్ని ప్రదర్శిస్తూ శివుడి చేతిలో ఉన్న త్రిశూలం శాంతికి ప్రతీక అన్నట్టుగా  హింసకు తావు లేదని చెప్పాడు. నిజానికి బోళా శంకరుడని శివుడికి పేరు ఉన్నప్పటికీ ఆయన సంహారక బాధ్యతను తీసుకున్నాడు.  బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు పోషిస్తే,  శివుడు లయకారుడిగా తన కర్తవ్య బాధ్యతను నిర్వర్తిస్తాడు.  లయం అంటే ఇక్కడ చంపడం కాదు.  జీవులను తనలో చేర్చుకుంటాడు. అందుకే ఆయన శ్మశాన వాసి. ఎందరో రాక్షసులకు వరం ఇచ్చాడు.  భస్మాసురుడు శివుడు చేత వరంపొంది శివుడు తలపై చేయి పెట్టాలనుకుంటాడు. శివుడు ఇచ్చిన వరాలను రావణాసురుడు లాంటి వాళ్ళు దుర్వినియోగం కూడా చేశారు. కానీ, వాళ్లను నిలువరించేశక్తి  విష్ణువు ద్వారా నియోగింపబడింది. అట్లాగని శివుడు శాంతమూర్తే కాదు రుద్రుడు కూడా.  ఆయన స్వరూపమే రుద్రం.  త్రిపురాసురుడిని సంహరించి త్రిపురారిగా పిలువబడ్డాడు. రాహుల్ గాంధీకి స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్లు ఇదంతా పరిశోధన చేసినట్లు లేదు.

మోదీ ప్రభుత్వం కూడా స్పందించాలి

2019 డిసెంబర్ లో  సీఏఏ చట్టం తేవడంతో  ఢిల్లీలో షాహిన్బాగ్ లో జరిగిన ధర్నా ఇండియా ప్రభుత్వం ముందర కాళ్లకు బంధం అయింది. ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల హిందువులకు జరిగిన లాభం చాలా తక్కువ. కానీ, మిగతా సమాజంలో ముఖ్యంగా ముస్లిం సమాజంలో చాలా ఆందోళన మొదలైంది.  ముస్లిం గ్రూప్స్ అన్ని మోదీకి వ్యతిరేకంగా తయారయ్యాయి. దేశ విదేశాల్లో మన దేశంలో మత సహనం లేదంటూ మానవ హక్కుల సంఘాలు మొదలుకొని ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీస్ వరకు ఎత్తి చూపడం మొదలుపెట్టారు.

 ప్రభుత్వం ఈ విషయంలో సమాజంలోకి సరైన చర్చను  తీసుకెళ్లాల్సింది. అలాగే మణిపూర్ అల్లర్ల  విషయంలో ప్రభుత్వం చాలా  అపఖ్యాతి మూటగట్టుకుంది.  1999లో ఇంకా అనేకసార్లు మణిపూర్, ఇతర  రాష్ట్రాల్లో ఎన్నో ఘర్షణలు జరిగాయి.  తీవ్రవాద దాడులు జరిగాయి.  ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగాయి. అయితే వీటిపై సమాజంలోని వ్యవస్థలు చర్చ చేయకపోవడం వల్ల,  ఉద్దేశపూర్వక విస్మరణ సూత్రం పాటించడం వల్ల ప్రభుత్వం చాలా తప్పు చేసినట్లుగా భావించే ప్రమాదం ఉంది. అలాగే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ విమానాల కుంభకోణం అంటూ చేసిన ప్రచారం సుప్రీంకోర్టు రూలింగ్​తో మూతబడింది.  అదానీ, అంబానీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇతర సంస్థలు చేస్తున్న దుష్ప్రచారం ఎదుర్కోవడంలో  కేంద్ర ప్రభుత్వం మౌనం పాటించడం వ్యూహం అనుకోవడం తప్పు. మోదీ ఎంత నిజాయితీపరుడైనా మీద పడ్డ బురదను కడుక్కోవాల్సిందే. 

హిందూ మతంపై విమర్శలా..

రాహుల్ గాంధీ మాట్లాడుతూ నిజమైన హిందువులు ఎవరూ హింసకు పాల్పడరు అని చెప్పాలనుకున్నాడు.  ఆ క్రమంలో హిందువులు హింసావాదులు అని అర్థం వచ్చేటట్టుగా చెప్పాడు. ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే గతంలో మణిశంకర్ అయ్యర్,  దిగ్విజయ సింగ్,  సుశీల్ కుమార్ షిండే వంటి ఎందరో కాంగ్రెస్ నేతలు హిందూ తీవ్రవాదం అనే మాట ముందుకు తెచ్చారు.  ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమన్న అపప్రథ మూట కట్టుకుంటూ వస్తున్నది.  దీన్నే బీజేపీ వారు సూడో సెక్యులరిజం అని పిలుస్తూ ఉంటారు.  ముస్లిం ముస్లింలాగా,  క్రైస్తవుడు క్రైస్తవుడులాగ జీవించాలి.  కానీ,  హిందువు మాత్రం సెక్యులరిస్ట్​గా ఉండాలి అని హితబోధ చేస్తే ఏ హిందువు ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్ని  సోకాల్డ్​  సెక్యులర్​ పార్టీలు గ్రహించలేకపోతున్నాయి.

రాహుల్​ను నాయకుడిగా తీర్చిదిద్దుకోవాలి

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి రాజకీయ ఓనమాలు నేర్పిస్తుంది.  కానీ,  సిలబస్ కరెక్ట్ గా లేదు.  మనదేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్నా అవగాహన మాత్రం ఉంది అని ఎన్నో రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయం.. శాశ్వతంగా అతన్ని నాయకుడిగా మార్చే మార్గంలో నడవడం లేదు.  చాలాసార్లు కొందరు నచ్చక ఇంకొకరికి గెలిపిస్తూ ఉంటారు. వాళ్ల ప్రతిభతో ప్రజలకు అవసరం లేదు. అలా మోదీ మీద విరక్తి కలిగినప్పుడు రాహుల్ గాంధీకి అవకాశం దొరకవచ్చు. స్వీయ రాజకీయ ప్రతిభ మాత్రమే రాహుల్ ని నాయకుడిగా నిలబెడుతుంది.

 ఇది గ్రహించకుండా వంధిమాగదుల స్తోత్ర పాఠాలు, డైలాగులు, స్క్రిప్టులు నాయకుడిగా నిలబెట్టలేవు. భారత్ జూడో యాత్ర ద్వారా తెలుసుకున్నది కేవలం దేశం యొక్క అడ్డం పొడుగు మాత్రమే. ఇప్పుడు 10 ఏండ్లలో  మోదీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు.  ఒకవేళ అధికారం వచ్చి అక్కడ కూర్చోవాలంటే అవగాహన లేమి అనారోగ్యకరంగా మారుతుంది. రాహుల్ ఇప్పుడు తొందర పడాల్సిన అవసరం లేదు. రాజకీయ దృక్పథాన్ని ఇందిరలా అధ్యయనం చేయాలి. అదే శ్రీరామరక్ష. అంతేగాని హిందూత్వాన్ని తిడుతూ రాజకీయం చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తిరగబడుతుంది.

- డాక్టర్
పి. భాస్కర యోగి,
పొలిటికల్​ ఎనలిస్ట్