సోష‌ల్ డిస్టెన్సింగ్ తో న‌లుగురికి సీటింగ్: ఆటోవాలా ఐడియా సూప‌ర్..

సోష‌ల్ డిస్టెన్సింగ్ తో న‌లుగురికి సీటింగ్: ఆటోవాలా ఐడియా సూప‌ర్..
  • అడ్వైజ‌ర్ గా పెట్టుకుంటాన‌న్న ఆనంద్ మ‌హింద్రా

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. నాలుగు నెల‌ల్లోపే 27 ల‌క్ష‌ల 60 వేల మందికిపైగా ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ల‌క్షా 93 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారికి ఎటువంటి మందు గానీ, వ్యాక్సిన్ గానీ లేదు. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా వ్యాపిస్తుండ‌డంతో ఈ వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు అనేక దేశాలు లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. సామాజికంగా ఒక‌రి నుంచి ఒక‌రు దూరంగా ఉండ‌డ‌మే క‌రోనాను అడ్డుకునే మంత్ర‌మ‌ని అన్ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.

రూల్ ప్ర‌కారం ఆటోలో ఒక్క‌రే.. న‌లుగురు వెళ్లేలా..

ఈ వైర‌స్ కొన్నాళ్ల‌కు కంట్రోల్ లోకి వ‌చ్చినా.. ఆ త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడు ఒక‌రికొక‌రు సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. ప్ర‌యాణ‌లు మొద‌లు ఆఫీసులు, స‌మావేశాల‌లోనూ మ‌నిషికీ మ‌నిషికి క‌నీసం మూడు నుంచి ఆరు అడుగుల దూరం త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టెన్స్ తో ప్ర‌యాణాలు చేసేలా కొత్త కొత్త ఐడియాలతో ప్ర‌పంచాన్ని ఆకర్షిస్తున్నారు కొంద‌రు. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా లాక్ డౌన్ లో ప్ర‌భుత్వ రూల్స్ ప్ర‌కారం ఆటోలో డ్రైవ‌ర్ కాకుండా వెనుక సీటులో ఒక‌రు మాత్ర‌మే ప్ర‌యాణించాలి. అయితే ఓ ఆటో వాలా త‌న క్రియేటివిటీతో సోష‌ల్ డిస్టెన్స్ ప‌క్కాగా పాటిస్తూ ఆటోలో న‌లుగురు వెళ్ల‌డానికి వీలుండేలా మార్చేశాడు. అట్ట‌ల‌తో ఆటోను నాలుగు భాగాలుగా చేసేసి ఒకరికొక‌రు ట‌చ్ కాకుండా లోప‌లి భాగాన్ని రూపొందించాడు.

ఆనంద్ మ‌హింద్రా ఫిదా

క్రియేటివ్ గా ఆటో సీటింగ్ ను కొత్త‌గా మార్చిన ఆటోవాలా ఐడియాకు మ‌హింద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హింద్రా ఫిదా అయ్యారు. ఆ ఆటోకు సంబంధించిన వీడియోను త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారాయ‌న‌. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మ‌న ప్ర‌జ‌లు వేగంగా సృజ‌నాత్మ‌క‌త‌తో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే తీరు సూప‌ర్ అని అన్నారు. మ‌హింద్రా ఆటో అండ్ ఫామ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ రాజేశ్ జేజురిక‌ర్ ను ట్యాగ్ చేసి.. ఈ ఆటోవాలాను త‌మ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ విభాగంలో అడ్వైజ‌ర్ గా పెట్టాల‌ని సూచించారు. ఆనంద్ మ‌హింద్రా ఈ వీడియోను శుక్ర‌వారం ఉద‌యం ట్వీట్ చేయ‌గా.. సాయంత్రానికే మూడున్న‌ర వేల మంది రీట్వీట్ చేశారు. మ‌రో 17 వేల మంది లైక్ చేశారు. క‌రోనా ఇన్నోవేష‌న్ అంటూ నెటిజ‌న్లు ఆటో డ్రైవ‌ర్ ను ప్ర‌శంసిస్తూ కామెంట్లు చేశారు నెటిజ‌న్లు.