IND vs ENG: మహింద్ర థార్.. సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్రా గిఫ్ట్

IND vs ENG: మహింద్ర థార్.. సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్రా గిఫ్ట్

దాదాపు రెండేళ్ల తరువాత భారత సెలెక్టర్లు.. సర్ఫరాజ్ ఖాన్ పట్ల కరుణించిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో అతడు టన్నుల కొద్దీ పరుగులు చేసిన పట్టించుకోని సెలెక్టర్లు.. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయపడగానే అతని పట్ల జాలి చూపారు. దీంతో రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా అతను భారత జట్టు తరుపున అరంగ్రేటం చేశాడు. అలా రాక రాక వచ్చిన అవకాశాన్ని అతను చేజేతులా ఒడిసి పట్టుకున్నాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాది తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న సర్ఫరాజ్‌.. 62 పరుగుల వద్ద జడేజా తప్పిదంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. 

అంతకుముందు సర్ఫరాజ్ ఖాన్.. భారత మాజీ దిగ్గజం టెస్ట్ క్యాప్ అందుకోగానే అతని తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. కొడుకును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తన కుమారులిద్దరికీ తానే కోచ్ అయ్యి.. ఇద్దరూ భారత జట్టుకు ఆడేలా చేసిన అతని పట్టుదలపై ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా తన తనయుడికి అండగా నిలబడి అతనిలో స్ఫూర్తి నింపిన నౌషాద్ ఖాన్ పై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకూడా స్పందించారు. ఆయన అంగీకరిస్తే తాను థార్ కారు గిఫ్టుగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అదొక గౌరవంగా భావిస్తానని తెలిపారు.

స్ఫూర్తిదాయక తండ్రి

"కష్టం, ధైర్యం, సహనం. ఓ కొడుకులో స్ఫూర్తి నింపడానికి ఓ తండ్రికి ఇంతకు మించిన మంచి లక్షణాలు ఇంకేం ఉంటాయి? ఒక స్ఫూర్తిదాయక తండ్రిగా నిలిచినందుకు నౌషాద్ ఖాన్ కు థార్ గిఫ్ట్ గా ఇవ్వడం నాకు దక్కే గౌరవంగా భావిస్తాను.." అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు.

కాగా, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ భారత అండర్-19 జట్టులో సభ్యుడు. ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన అండర్-19 ప్రపంచ కప్‌లో అతను పర్వాలేదనిపించాడు.