కథ : అనంతం

కథ : అనంతం

తను నడుస్తూ బాట చుట్టూ పరచుకున్న ముళ్ల కంచెల్ని చూసి తనలో తనే నవ్వుకున్నడు చందు. అడుగడుగునూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు అడుగులేస్తుండు.  కంచె ఆవల పనిలో మునిగిన జనం... అతని అడుగుల సవ్వడి విని వంచిన తలలను ఇటువైపు తిప్పి అతడినే కన్నార్పకుండా చూస్తున్నరు. వాళ్లంతా ఆ ఊరి వాళ్లే. అలసిన, గుంతలు పడిన కళ్లతో అతడినే తదేకంగా చూస్తున్నరు.

మందగిస్తున్న చూపును పెద్దదిగా చేసుకొని... నొసలు రిక్కించి వాళ్ల అనుభవంతో మనిషిని పోల్చుకుంటున్నరు. వాళ్ల యాదిలో అతనిది చిన్న విషయం. ఆ యాది గుర్తుకు రాకుండా మిణుగురులా మిణుకుమిణుకుమంటూ కారుచీకట్లో కనుమరుగైనట్టు మాయమవ్వసాగింది. వాళ్లు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఆకాశంలో ఎదురెక్కుతున్న సూర్యుడ్ని చూస్తూ సూర్యకాంతిని తట్టుకోలేక కళ్లు మూస్తున్నరు. 

అతనికి సంబంధించిన విషయాలు మాటలతో వాక్యాలుగా, కథలుగా అల్లుకొని వారి నాలుకలపై నాట్యమాడసాగాయి. ఒకరి నోటినుంచి మరొక చెవికి అలా అందరికీ పాకుతున్నాయి. ప్రవాహమైన వాళ్ల మాటలు అతడ్ని నీడలా వెన్నంటి నడుస్తున్నాయి. అతను చుట్టూ పరచుకున్న కొండకోనలను చూస్తూ, దారెంట పరవశించే పంటచేలను చూస్తూ ఆ తోవలో నడుస్తున్నడు. అలా నడుస్తూ వాళ్లందరి వైపు లీలగా చూస్తూ... వాళ్లని దాటి ఎత్తయిన ఏనెగడ్డపై నుండి నడుచుకుంటూ ఊరిని చూస్తూ నడుస్తున్నడు.

పంటచేలో కూలీలు అతనిగూర్చి ‘‘గీడేనమ్మా మారెమ్మ కొడుకు. పెండ్లయిన ఏడాదిన్నరకు కడుపుతో ఉన్న పెండ్లాన్ని, తల్లిని, చెల్లెల్ని, పాలు సీకే పోరడ్ని ఇడిసి బొంబాయి పోయిండట! మల్ల ఇన్నాళ్ళకు ఊళ్లకు ఊడిపడుతున్నడు’’ అంటూ వాళ్లంతా తమలోతామే తిన్నగా మాట్లాడుతున్నరు.

‘‘ఔనే! ఇతని చెల్లె ఎవడినో ఏస్కోని పోయిందటగా’’ ఒకామె దెప్పిపొడిసినట్టు పలికింది. 

‘‘ఔనే పోకేంజేస్తది ఈడుకొచ్చింది. తోడు జూస్కోదా ఏంది?’’ అంటూ మరొకామె. 

‘‘అండవుండి కొండపాకాల్నట. అండలేని ఆడది తావిడిసిన గాడిది ఒకటేనట. అది దారి తప్పి ఎటుపోయిందో? ఏడ బతుకుతుందో... పాపం’’ అన్నరు ఇంకొందరు. వాళ్ల మాటలేవి అతనికి తాకడంలే. అతను వాళ్లకి దూరమై ఊరును సమీపిస్తున్నడు. 

అతను ఊరువిడిచి చాలాకాలమైంది. తండ్రి అవసానదశలో ఉన్నాడు. తండ్రి అకాల మరణం తర్వాత ఇల్లు, అయిన వాళ్లందరినీ ఇడిసి... ఊరు విడిచిండు. మళ్లీ ఇన్నాళ్లకు ఊరికొచ్చిండు. ఇన్నిరోజులు ఏమైండు? ఎక్కడుండు? ఎలా వుండు? ఏం చేసిండు? అనే విషయాలు ఆ ఊరి వాళ్లకి ఏ కోశాన అర్ధం కావు. ఇన్నిరోజులకు ఇల్లు చేరిండు. ఇంటివాకిట్లో కట్టెల పొయ్యిముందు కూర్చొని వంట వండుతున్న అతని భార్య భాగ్య అతడ్ని చూడంగనే చెమ్మగిల్లిన కళ్ళను పైటతో తుడుచుకొంటూ ఒక్క ఉదుటున అతన్ని చేరింది. అతను ఆమెనే చూస్తూ గుండెలకు ఆన్చుకొని తలపై చేత్తో నిమురుతూ ‘‘ఎలా ఉన్నావు భాగ్యా? పిల్లలేరి? మా అమ్మ ఎలావుంది? ఊళ్లో పని కరువైందని ఇల్లు పిల్లల ఇడిసి బొంబాయి పోతి ఇన్నిరోజులు. మీరు ఎలా వున్నరు? నేను లేక ఆ దిగులుతో ఎంత దిగాలు పడి కూనరిల్లితివో గదా’’ అని పొంగుకొచ్చిన దుఃఖాన్ని  అదిమిపట్టుకుండు అనంతు.

ఇంట్లో పోట్లాడుతున్న పిల్లలు ఇద్దరు బైటికెల్లంగనే తండ్రి కనిపించేసరికి ‘‘డాడీ.. డాడీ..’’ అని పరుగున వచ్చి అతడిని చుట్టుకున్నరు. ‘‘డాడీ! మమ్ముల విడిచి మళ్ళీ ఎల్లవుగా?’’ అని బేలగా అడుగుతూ బిర్రుగా మల్లెతీగ లెక్క అల్లుకుపోయారు. పిల్లల వాలకం చూడగానే కళ్ళు చెమ్మగిల్లాయి.

‘‘భాగ్యా... అమ్మ ఏది? ఎక్కడ?’’అని అనంతు అడగంగనే ‘‘మీయమ్మ పత్తిచేల పనికెళ్ళింది’’ అతని వైపు దిగులుగా చూస్తూ చెప్పింది. 

‘‘మా అమ్మ అసలే చేతకానిదాయె. ఎందుకు పోనిచ్చినవే? కండ్లు తిరిగి చేల అడ్డంపడితే నాగతేంకాను? ఒక్క కొడుకని గారంగ సాదుకునే గదేందోగని కష్టాలు ఎంటబడ్డాన్నే తరుముతయ్. నారాత గిట్టుంది. ఏలిన్నాటిశని ఎంటనే వుండే. కొందరికి పుట్కతోనొచ్చింది పుడకతో పోవాల్సిందేనట. అవును మా చెల్లె ఏంజేస్తుంది’’ అని అడిగాడు. 

‘‘ఇంకెక్కడి చెల్లె? ఒక్క ఆడబిడ్డ నాతోడనుకుంటే ప్రేమ పేరుతో ఎవడితోనో ఎగిరిపాయె. ‘అద్దుపద్దులేనిద’ని అమ్మలక్కలన్నా. దాని రాత అంతే అని సరిపెట్టుకుంది మీయమ్మ. మన పరువుతీసినా అదన్న నిమ్మలంగ వుంటే అదే సాలు’’ రుసరుసలాడుతూ చెప్పింది.

‘‘సరేగాని అమ్మకు నేనొచ్చిన్నని కబురంపు. నేనొచ్చిన్నంటే అమ్మకు పోయిన పాణం తిరిగొస్తది. అయినా బుక్కెడు తిని ఆయంకల్ల కూలవడక. ఏం ముల్లెలు మూటగడ్తని వుర్కింది పనికి’’ అని కోపంగ అన్నడు.

“నేను చెప్తే ఇంటెనా? ఒక్కతాన కుదురుగా ఉంటెనా? ఒరోకు మీయమ్మతోని, ఇంకోరోకు పిల్లలతోని ఏగలేక సస్తున్న. నీకేమెర్క ఇన్నొద్దుల నాశర. ఆరమ్మ గోస దీస్తున్నా. దీనికంటే సావే నయం అనిపించేది. పిల్లల జూసి పాణం తర్కపాయి ఆగిపోతున్నా’’ అంటూ కండ్లపొంట ఉబికివచ్చె కన్నీరు రాలుస్తూ కొంగుతో తుడుస్తూ దీనంగా బదులు పలికింది.

“ఎందుకే అంతబాధ పడ్తవ్? నేనులేనా! సచ్చిన్ననుకున్నవా? మనగాశారం బాలేక మనకీ శరలు. అయినా గియ్యి ఎల్లకాలముంటయా.. మనకూ ఓరోజొస్తుంది దిగులుపడకు. మనసు కుదార్తం చేసుకో’’ ఆమెనే చూస్తూ నాలుగు ధైర్యం మాటలు పలికిండు అనంతం.

అంతలో కర్రెనర్సిరెడ్డి అతని వద్దకు వచ్చి ‘‘ఏం పిలగా.. అనంతు బాగున్నవా’’

‘‘ఆ.. ఏంది గిట్లొచ్చిర్రు పటేలా’’

‘‘అరే పిలగా నీకుతెల్వంది ఏముంది. మీ అయ్య అప్పట్ల నాతాన జీతముండే దాని బాపతు ఐదువేల రూపాయలు అప్పు అట్లనే వుండే. మరి మీ అయ్యబాకి నువు తీర్చవా? నువ్వొచ్చినవని తెల్సి అడుగుదామని వొచ్చిన ఏమంటావ్?’’

‘‘అనేదేముంది పటేలా.. మా అయ్య నీతాన జీతముండది నిజం. అప్పు తీర్చిండో.. లేదో నాకెర్కలే. నేను మానాయిన కొడ్కునే తీరుస్త. తీర్చనంటే అప్పుమచ్చ అట్లనే వుంటది. మంది సొమ్ము మాకెందుకు పటేలా? రేపు వచ్చి అప్పు తీర్సి కాయితం తీస్కుంట’’
“ఏమో అనుకున్న మాటమీద నిలవడ్డవ్. తండ్రికితగ్గ కొడుకనిపించుకున్నవ్. శబాష్ బిడ్డా” అంటూ అటునుంచి కదిలిండు పటేలు. అంతలోనే అతని తల్లి వచ్చింది. ఆమెకు కొడుకును చూస్తాల్కి పోయిన పాణం తిరిగొచ్చినట్లనిపించింది. మంచీచెడ్డా ఇశారించింది. ఇంటి ఇషయాలు పూసగుచ్చినట్టు వివరించె. అతను ‘ఊ’ కొడుతూ వినసాగిండు. పొద్దు మునిగింది చీకటి పరుచుకుంది.

ఆ రాత్రి తను.. తన భార్య, పిల్లలు అమ్మతో కలిగినంతల కుదార్తంగా విందారగించారు. పిల్లలను నానమ్మ దగ్గర పడుకోబెట్టి.. భార్యాభర్తలు పక్కగదిలోకి నిద్రకు ఉపక్రమించారు. ఆ రాత్రి పడకపై ఆమె తన పెనిమిటి కళ్ళవైపు చూసింది. అతని అందమైన కోల మొఖం చూస్తూ అతని నుదుటిపై ముద్దుపెట్టింది. చేతితో తల నిమురుతు మరో చేతితో అతని ఛాతిని తాకింది.

అతని దేహాన్ని దీపపుకాంతి వెలుగులో నఖశిఖపర్యంతం చూసింది. అలసి సొలసి అతను హాయిగా గాఢనిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే ఆమె అతని పక్కవాలి తొలినాటి జ్ఞాపకాలను నెమరేస్తుంది. నిద్రలో అతనికి తెలియకుండానే ఆమెపై చెయ్యి వేసాడు. ఆమె అతని పక్కలో ఒదిగిపోయి  గుసగుస లాడి లేపాలనుకుంది. అతని నిద్ర భంగం చేయడం ఇష్టంలేక... అలాగే చూస్తూ తను యాదుల్ని నెమరేస్తూ నిద్రకు ఉపక్రమించింది. గాఢనిద్రలో ఉన్న అనంతు ఉలిక్కిపడి తటాలున లేచి కూర్చున్నాడు. ఆ ఉలికిపాటుకు ఆమె కూడా లేచింది.

అతని మనసులో కంగారు మొదలైంది. గుర్తు తెలియని మొఖాలు చుట్టుముట్టి తరుముతున్నట్టు,  గోసదీస్తున్నట్టు కలగన్నాడు. ఆ మొఖాలు కొన్ని పరిచయమైనవి. మరికొన్ని పరిచయం లేనివి. ఇంకిన్ని దయ, జాలి, కరుణ, ఏ కోశాన లేని కర్కశమైనవి. అక్కడ తనొక్కడే మిగిలిపోయాడు ఎడారిలో ఎండ మావిలా. తనేమిటో వాళ్లందరికి తెలుసు. కానీ వాళ్లు మృగాలకంటే క్రూరంగా అతని పట్ల ప్రవర్తించసాగారు. అతడి మనసు వేదనాభారంతో కుంగిపోసాగింది. గుండె వేగం పెరిగింది. రక్తపోటు హెచ్చుతగ్గులను సూచిస్తుంది. నిలకడ లేని తనంతో అతను గిలగిలా తన్నుకుంటున్నాడు.

“ఏవండీ... ఏమైంది?’’ కంగారుగా అడిగింది భాగ్య.

‘‘గుండె దగ్గర నొప్పి... నొప్పి.. అక్కడెవరో గుమ్మం ముందు సాగిలవడి నవ్వుతూ కూర్చున్నారు చూడు’’

‘‘ఎవరూ లేరండి’’

 ‘అబ్బా నొప్పి’’ 
‘‘ఆగండి దుకాణంకు బోయి నొప్పిగోలి పట్కొస్త’’ అంటూ వెళ్లింది భాగ్య. మాత్రవేసుకున్నంక కాస్త కునుకు తీసిండు. తెల్లగ తెల్లారింది, పొద్దువిచ్చుకుంది. పొయ్యికాడ కూర్చున్న భార్యతో ‘‘రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు మనవి. ఈడ వున్నమాటంటే ఊరికి, నాకు అచ్చిరాదంటరు. గిదే ఈలోకం తీరు. ఎంతసేపు ఉన్నోనికి ఊడిగంచేసుడు. వానికి వత్తాసు పల్కుడు. అందుకే మన జాతి మారదు. మన బతుకులు మారవు ’’ అనుకుంట పటేలు దగ్గరకెల్లి వచ్చిండు. నింపాదిగా తల్లి వొచ్చింది.

భార్య కలుగజేసుకుంటూ ‘‘ఏమయ్యా... ఏమన్నడు ఆసామి?’’

ఏముంది ఎప్పటాటే. ఈసారి అతని చెలక కౌలుకు తీసుకొని అయ్య అప్పు, కౌలు బాపతు పైసలు మొదటిపంట చేతికి రాంగనే తీరుస్తా అంటి’’ 

అందుకు ఆయనేమన్నడు’’ అడిగింది భార్య.

సరే అన్నడు” అంటూ బదులు పలికిండు.

సుతిమతి తప్పక మతిబెట్టి ఎవుసం చెయ్యి. మన బాధలు ఈ యేడుతో గట్టెక్కాలె’’ అన్నదామె.

ఐదెకరాలు పత్తిగింజలు జల్లిండు. చేనుకు సరిపడ మందులు పెట్టిండు. వానలు ఎనుకవాటైనయ్. రోజులు గడుస్తున్నయ్, రుతువులు గతులు తప్పినయ్. ఆసరా అయితదనుకున్న పంట చేతికి సరిగ రాలేదు. చేతికొచ్చిన పంట పెట్టుబడులకు సాలలేదు. కౌలు బాపతు అప్పు అతని పాలిట ముప్పయి కూచుంది. పటేలుతో ఏమని బొంకాల్నో అతనికి అర్ధం అయితలేదు. భూమి పట్టేదారుకు రైతుబంధు అక్కరకొచ్చె. కౌలు డబ్బులు మిగులు. కౌలుకుతీసుకున్న రైతుకు ఓరోకు కౌలు, ఇంకోరోకు పెట్టుబడులతో అప్పు ముప్పై కూసుంది. ఎటూ పాలుపోని అనంతు అనంత దుఃఖంలో మునిగిండు. గుండె ధైర్నం చేసుకొని పటేలుకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపాయె.
‘‘ఏంరా అనంతు... కాలమై పంట ఎక్కువ పండితే నా ఇంటికి కొలుస్తవారా? దేని లెక్క దానిదే. కూడు లేకుంటే ఓ ముద్ద అడుగు పెడ్త.. గని వాన రాలే. పంట పండలే. శేను ఎండింది.. అంటూ కథలు పలకొద్దురా. ఆయల్ల కౌలుకు కాయితం రాస్కొన్నది గుర్తు లేదా? మల్ల అప్పుజేస్తవో. అప్పుకింద రాస్కుంటవో నీ ఇష్టం’’ అని తువ్వాలు దులుపుకుంటు ఇంట్లకు లేచిపోయిండు పటేలు.

ఏమి చేయాలో పాలుపోక ఇంటి వైపు నడ్చిండు అనంతు. నడుస్తూనే ‘‘బలహీనులం, పేదలం. ఎట్టయ్యేదుందో సూడాలె. ఏదన్న దారి దొర్కపోదా” అని తనలోతాను అనుకుంటూ ఇల్లు చేరిండు.

“ఇంత కూడు తిందువు’’ అని ఆమె అనగానే ‘‘నాకు ఆకలిగా లేదే’’ అని చింతజేస్తూనే సుట్ట తీసి దమ్ము గుంజపట్టిండు. అతని వైపు అదోలా చూస్తూ వాళ్ల మాటలు వినసాగింది బిడ్డ.

అనంతు చుట్టదమ్ము గుంజుతున్నడు. వేరును పురుగు తొల్సినట్టు... తన మతిని ఆసామి అప్పు తొలుస్తుంది. నిలకడ లేకుండ ముందుకు సాగిండు. బెల్టు షాపుకెళ్ళి ఒక పావు మందు మింగిండు. అతనికి తర్వాత వచ్చి ఇస్త రాస్కోమని చెప్పి చెలకవైపు బాట పట్టిండు. చేనంతా జీవంలేక సచ్చుబడి చిన్నబోయింది. బోరును నమ్మి ఏసిన వరి చేను వట్టి పోయింది. సారం సచ్చి సచ్చుబడి పొట్టపోసుకోకుండానే ఎండిపోయింది.

అటు చూశాడు ఖాళీగున్న దొడ్డి కూలడానికి సిద్ధంగుంది. తన ఈడున రెండు జతల ఎడ్లతోని కళకళలాడిన దొడ్డి కళతప్పింది. గిప్పుడు ఇరవై నాలుగ్గంటల కరెంటు ఉన్న.. ఎండిన బోరులో సుక్క జారకుంటే బోరెందుకు? తాతలనాటి చింతబాయి ఎండి మొండిదైంది. ఆ రోజుల్ల చినుకు రాలిందంటే వాగులు పొంగేవి. చెర్లు, కుంటలు నిండేవి. బావులు నిండి అలుగు పారేవి.

నాడు ఏడుగంటలైనా వచ్చిరాని కరెంటైనా నీటి జలతో తొణికిసలాడినయ్. నేడు దుక్కి ధూపకై అస్కులాట. మొగిచ్చిన విత్తులు పత్తిమందుల గత్తువాసనకు పురిటిలోనే నేల రాల్తున్నయ్. కాలం గతి తప్పింది. మనిషి మతి తప్పుతుండు. తన చేను చెలక ఒకపారి కడుపార తేరజూసిండు. ఎటు చూసినా చింతాకంత ఆశలేదు. వొస్తదన్కున్న కాల్వ సర్వేలకే సరిపోయింది. చెర్ల పూడికలు దీసినా వొచ్చిన చినుకు నెర్రెదెర్సిన చెరువు పీల్చుకుంది. బోరుబొక్కలు పాతాళానికి దింపినా జాలు జాడ లేదు. ఆసామి అప్పు అతని పాణానికి ముప్పయి కూసుంది. అప్పుల ఊబిలో నుంచి బైట పడే దారి కనపడ్తలేదు. 

అనంతు మతి గతి తప్పి తను నమ్మిన నేలంతా ఒకపరి తిరుగాడిండు. చింతబాయిని ముద్దాడిండు. పత్తి చేనుకు తెచ్చిన పురుగుల డబ్బా తనను పిలుస్తున్నట్టు అనిపించింది. అటు కొట్టం వైపు చూసిండు. డబ్బా కండ్లల్ల కదలాడింది. మరోపెట్టు ఆలోచించకుండ  దాన్ని చేతులకు తీసుకొని మూతతీసి గబగబా రెండు గుట్కలేసిండు. మూడోబుక్క మింగుతూ తూలుతూ అది కడుపుల పెడుతున్న మంటకు గట్టిగా కేకలేస్కుంట నేల కొరిగిండు.

పక్కచేల పనులు చేసుకుంటున్న తోటి రైతులు అతని అరుపును గమనించి ఒక్క ఉదుటున ఉర్కచ్చిండ్రు. విషయం ఊరుచేరింది. లబోదిబో మంటూ తల్లి, భార్యాపిల్లలు వచ్చిండ్రు. అంతలనే అంబులెన్సు వొచ్చి, గొల్లగూడెం ఏస్కుపోయింది. అనంతు సుడులు తిరుగుతున్నడు. నురగలు కక్కుతున్నడు. మంటకు తాళలేక గిలగిలా తన్నుకులాడుతున్నడు.
అయ్యో దేవుడా ఏమి చేసేది? ఒరేయ్ జయా! మీ నాన్న... నాన్న...’’ రొమ్ము బాదుకుంటూ ఏడుస్తుంది భాగ్య. మరోవైపు అతనితల్లి గుండెలవిసేలా ఏడుస్తుంది.

ఏమైందమ్మా నాన్నకు?’’ నిద్రమత్తు వదిలిన పిల్లలు తల్లిని అడుగుతున్నారు. అతను మృత్యులోగిలిలోకి జారిపోతున్నాడు. చూపుమందగించింది. నాడి ఉనికి కోల్పోతోంది. అతని వెచ్చని శరీరం.. కాంతులీనే శరీరం కళతప్పి కళావిహీనంగా మారుతోంది. అనంతు బేలగా చూస్తూ రెప్పల్ని మూస్తున్నాడు. ఆమెకు కాళ్ళ కింది నేల కదిలిపోయినట్లయ్యింది.
ఓరి దేవుడా... నా కొంపకు నిప్పుపెట్టావా? నా ఇంటికి ఎసరు దెచ్చావా? అయ్యో దేవుడా ఏమి చేసేది? ఒరే జే మీ నాన్న...’’ అక్కడ కూలవడిపోయింది. 

డాక్టర్లు వచ్చి లోనికి తీసుకెళ్లారు. తాగిన మందు కక్కపోయించి...  చేతనైన వైద్యం చేశారు. ‘రెండురోజులు గడిస్తేగాని ఏంచెప్పలేం’ అని అక్కడినుండి వెళ్ళిపోయారు. వాళ్లు అనంతుని కనిపెట్టుకొని అక్కడే చెట్లకింద... అతను బాగై రావాలని మదిలో తలుస్తూ నిరీక్షిస్తున్నారు.

ఇన్నిరోజులు ఏమైండు? ఎక్కడుండు? ఎలా వుండు? ఏం చేసిండు? అనే విషయాలు ఆ ఊరి వాళ్లకి అర్ధం కావు. ఇన్నిరోజులకు ఇల్లు చేరిండు. వాకిట్లో కట్టెల పొయ్యిముందు కూర్చొని వంట చేస్తున్న అతని భార్య అతన్ని చూడంగనే చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ ఒక్క ఉదుటున అతన్ని చేరింది.

ఏమైందమ్మా నాన్నకు?’’ నిద్రమత్తు వదిలిన పిల్లలు తల్లిని అడుగుతున్నారు. అతను మృత్యులోగిలిలోకి జారిపోతున్నాడు. చూపుమందగించింది. నాడి ఉనికి కోల్పోతుంది. అతని వెచ్చని శరీరం.. కాంతులీనే శరీరం కళతప్పి కళావిహీనంగా మారుతోంది. అనంతు బేలగా చూస్తూ రెప్పల్ని మూస్తున్నాడు. ఆమెకు కాళ్ళ కింది నేల కదలిపోయినట్లయ్యింది.

ఓరి దేవుడా... నా కొంపకు నిప్పుపెట్టావా? నా ఇంటికి ఎసరు దెచ్చావా? అయ్యో దేవుడా ఏమి చేసేది? ఒరే జే మీ నాన్న...’’ అక్కడ కూలవడిపోయింది. 

ఫోన్ : 9490437978