సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా..సిద్ధమైన లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రి

సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా..సిద్ధమైన లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రి
  • ఈనెల 13న ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు 

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో 30 పడకలతో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి భవనం ప్రారంభానికి సిద్ధమైంది. కార్పొరేట్ హాస్పిటల్స్​కు దీటుగా అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఈనెల 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహతోపాటు మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానుండడంతో లక్సెట్టిపేటతోపాటు దండేపల్లి, జన్నారం, ఇతర మండలాల ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

 రూ.11.53 కోట్లతో నిర్మించిన ఆస్పత్రిలో రోగులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలతో పాటు సామగ్రిని సమకూర్చారు. 8 మంది డాక్టర్లను కేటాయించారు. వీరిలో నలుగురు స్పెషలిస్టులున్నారు. గైనిక్, పిల్లలు, జనరల్, వైద్యం కోసం ఇక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పుతుంది. హాస్పిటల్​లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్​ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆస్పత్రికి 55 మంది సిబ్బంది అవసరమని, ఇందుకోసం అధికారులకు నివేదికలు పంపించామని అన్నారు.