
77వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఉత్తమ నటిగా ఆమె అవార్డును గెలుచుకున్నారు. ‘ది షేమ్‌లెస్’ అనే చిత్రానికి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనతను ఆమె సాధించారు. ట్రాన్స్ జెండర్లు, ఇతర అణగారిన వర్గాలకు ఈ అవార్డును ఆమె అంకితం చేశారు. కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్ గుప్తా ముంబైలో పలు చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బొజనోవ్ దీనికి డైరెక్టర్. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అనసూయను ఆయన సెలక్ట్ చేశాడు. ఇందులో రేణుక అనే వేశ్య పాత్రను ఆమె పోషించారు. ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌస్‌లో సెక్స్ వర్కర్ అయిన రేణుక.. అక్కడ ఓ పోలీసును చంపి పారిపోతుంది. మరోచోట సెక్స్ వర్కర్స్ కమ్యూనిటిలో ఆశ్రయం పొందిన ఆమె.. అక్కడ దేవిక అనే 17 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.