కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లన్న గుట్టల వద్ద గుండ్రటి ఆంత్రోపోమార్ఫిక్ రాయి(పురాతన అమ్మ దేవత శిల్పం)ని గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు, కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
గుండ్రని రాయి పైభాగంలో చుట్టు చెక్కిన గంటుగీత ఉందని, గీత పైభాగం తల భాగంగా కింది వైపు శరీర భాగంగా భావించి గీయబడినట్లు చెప్పారు. ఇది తొలినాటి ఒక అమ్మదేవత శిల్పంమని, ప్రాచీన కాలంలో స్థానిక తెగల ప్రజలు తమను రక్షించే మాతృదేవత(అమ్మదేవత)గా భావించి ఇటువంటి శిలలను పూజించేవారని తెలిపారు.
ఇలాంటి గంటు గీతలు ఉన్న అడుగు ఎత్తు ఉన్న దీర్ఘ చతురస్రాకారపు రాతి కడ్డీ పుల్లూరు మెగాలిథిక్ సమాధుల తవ్వకాలలో పురావస్తుశాఖకు లభించిందని చెప్పారు. అది తెలంగాణలో మొదటిసారి దొరికిన అమ్మదేవత రూపమని తెలిపారు. కొమురవెల్లిలో దొరికిన ఈ శిల బృహత్ శిలాయుగానికి చెందిందని చెప్పవచ్చన్నారు. చాలా అరుదుగా దొరికే ఇలాంటి వాటిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
