ములుగు, వెలుగు: ములుగు శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ గిరిజన యూనివర్సిటీలో ప్రహరీ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన రాళ్లు బయటపడడంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.900 కోట్లు కేటాయించింది. గతేడాది కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క కలిసి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల క్రితం లోకం చెరువు సమీపంలో జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా పురాతన రాళ్లు బయటపడ్డాయి.
వాటి కింద నుంచి మూడు నాగుపాములు బయటకు రావడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక పాము చనిపోయినట్లు చెప్పారు. దీంతో జేసీబీ డ్రైవర్ పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తవ్వకాల్లో బయటపడ్డ రాళ్లు పురాతన ఆలయానికి సంబంధించినవని ప్రచారం జరుగుతోంది. కొన్ని రాళ్లపై చిత్రాలు కూడా కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. యూనివర్సిటీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
