ఉద్యమ ఆకాంక్షలు సమాధి.. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనయ్​? ఎటుపోయినయ్​?

ఉద్యమ ఆకాంక్షలు సమాధి.. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనయ్​? ఎటుపోయినయ్​?

బడి నుంచి గుడి దాకా..పల్లె నుంచి పట్నం దాకా..గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఊరూవాడా ఎలుగెత్తి పాడిన పాట ఆయనది! సకల జనుల సమ్మెలో, మిలియన్​ మార్చ్​లో, వంటావార్పులో, ధర్నాల్లో, ర్యాలీల్లో..ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన గీతం ఆయనది. ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ అంటూ కైగట్టి మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన లోక కవి అందెశ్రీ. స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దిలోకి అడుగుపెట్టిన వేళ..ఈ తొమ్మిదేండ్లలో ఏం జరిగింది? ఆరు దశాబ్దాల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినయా?  పాలకులు చెప్తున్నట్లు ‘పదేండ్లకే శతాబ్ది అభివృద్ధి’ జరిగిందా? అమరుల త్యాగాలకు దక్కిన గౌరవమెంత? లాభపడ్డదెవరు? గోసపడుతున్నదెవరు? రాజకీయాలు ఎట్లున్నయ్​?.. వీటిపై అందెశ్రీని ‘వెలుగు’ పలుకరించింది. అప్పటి పోరాటాన్ని యాదికి తెచ్చుకుంటూ.. నడుస్తున్న చరిత్రపై ఆయన తనదైన మాటలు, పాటల తూటాలు పేల్చారు. 

 

అందెశ్రీ: కేసీఆర్​ కుటుంబానికి, ఆయన చుట్టాలకు, ఆయన కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఇయ్యాల తెలంగాణ వచ్చినట్టున్నది. తొమ్మిదేండ్లలో అన్నిట్లా దోపిడే. ఇది ప్రజల తెలంగాణ కాదు. ఇలాంటి తెలంగాణను ఉద్యమ టైమ్​లో ఎవరూ కోరుకోలేదు. ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్​ మారిండు, ఆయన​కుటుంబం మారింది తప్ప రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రజల బతుకులు మారలేదు. ‘గొర్రో, బర్రో ఉన్నోడు అమ్ముకోన్రి.. నేను ఏనుగులను సప్లయ్​చేస్తా.. మనం రాజులం.. మన ఇంటి ముందు ఏనుగులు ఉండాలి’ అని పాలకుడు అన్నప్పుడు పేదోడి బతుకు ఏనుగుల మేతకు సరిపోదు. ఏనుగులు కోతకొస్తయ్​.. పేదోడి బతుకు పాతర కొస్తది. అట్లున్నది తొమ్మిదేండ్ల పాలనలో ప్రజల పరిస్థితి. కొత్త జిల్లాలంటిరి, కలెక్టరేట్లు కడ్తిరి.. చుట్టుముట్టూ భూములు కొల్లగొడ్తిరి. సెక్రటేరియెట్​ను ఎవరు కట్టుమన్నరు? పెద్ద పెద్ద ప్రాజెక్టుల చుట్టూ ఉన్న భూములెవరివి? కేసీఆర్, ఆయన బిడ్డలు, ఆయన చుట్టాలవే కదా!  

ఉద్యమప్పుడు, ఇప్పుడు కేసీఆర్​​ను ఎట్ల చూస్తరు? 

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్​ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోకపోతే.. ఉద్యమానికి అంత ఊపు వచ్చేది కాదు. తెలంగాణ సాధించే వరకు జరిగిన ప్రస్థానంలో కేసీఆర్​ను నేను ఏ కోశాన తప్పుపట్టను. కానీ, ఆయన ప్రతి అడుగు వెనుక అధికార దాహం దాగి ఉన్నదని నాకు తెలుసు. అందుకే కేసీఆర్​ నీడలోకి నేను వెళ్లలేదు. అధికారమనే ప్రణాళికే లేకపోతే.. ఆయన పార్టీ ఎందుకు పెట్టుకుంటడు? అన్ని నొప్పులు ఎందుకుపడ్తడు? ఉద్యమకాలంలో ఉత్తమ నేతగా ఉండి.. అధికారంలోకి రాగానే ఉద్దెర నేతగా ఎందుకు మారిండు? ప్రజలను చూసి మొఖం ఎందుకు దాసుకుంటున్నడు? త్యాగధనులంటే ఆయనకు ఎందుకంత బుగులు?నాలుగు కోట్ల మంది ఉద్యమంలో భాగస్వామ్యమై, 1400 మంది బలిదానాలు చేసుకున్నది.. ఆయన ఒక్క కుటుంబం కోసమా? ఆకాంక్షలు ఎటుపోయినయ్​? అంతా ఆయన చుట్టూ, ఆయన చుట్టాల చుట్టే పాలన. ఉద్యమ ఆకాంక్షలకు సమాధికట్టిండు. 

మీరు రాష్ట్రమంతా తిరుగుతుంటరు కదా..పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నరు?

తొమ్మిదేండ్ల పాలనలో జనం దగా పడ్డరు. ఎక్కడికి వెళ్లినా సమస్యలతో అరిగోసపడ్తున్నరు. ప్రభుత్వంపై ప్రజల్లో పెత్త ఎత్తున వ్యతిరేకత ఉంది. ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్​ సమాధి కట్టిండనే భావన వాళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నది. నీళ్ల పేరు చెప్పి కాళేశ్వరాన్ని కట్టి లక్ష కోట్ల అప్పులు మోపిండు. దాంతో కొత్తగా ఒక్క ఎరానికైనా నీళ్లిచ్చిండా? అని జనం అనుకుంటున్నరు. నిధులు ఎటుపోతున్నయో అందరికీ తెలిసిందే. నియామకాల ముచ్చటకొస్తే.. పిల్లగాళ్లు నిత్యం కొట్లాడ్తనే ఉన్నరు. ఇదా తెలంగాణ? తనకు తాను ఆత్మ వంచన చేసుకొని.. సీఎం సీటులో కూర్చున్నప్పటి నుంచి కేసీఆర్​ కొత్త అవతారం ఎత్తిండనే విషయం ప్రజలకు తెలుసు. రాష్ట్రం రాగానే ‘మాది ఉద్యమ పార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ’ అనుడు కంటే దారుణం ఇంకేముంటది? ఇప్పుడు పార్టీ పేరు కూడా మార్చుకున్నడు. ఓకే.. ​సారూ.. మరి, దానికి పూసిన రంగును ఎందుకు మార్చలేదు? తొమ్మిదేండ్లుగా తెలంగాణను దోచుకొని.. ఇప్పుడు బీఆర్​ఎస్​ పేరిట  తెలంగాణ ప్రజల త్యాగాల పునాదుల మీద యాగాలా? ! తెలంగాణ ప్రజలు దయగల్ల వాళ్లు. కానీ,  ‘తెలంగాణ అంటేనే నేను.. నేనే తెలంగాణ..’ అని విర్రవీగితే ఆ ప్రజలే తిరగబడ్తరు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం.  

భూ సమస్యలకు సర్వరోగ నివారణిగా ధరణిని తెచ్చినమంటున్నరు.. మీరేమంటరు?

భూములను మింగేసే భేతాళ భూతం.. కేసీఆర్. అప్పట్ల ఆంధ్ర పాలకులు తెలంగాణ భూములను, సంపదను కొల్లగొడితే.. ‘ఎక్కడి నుంచో వచ్చిన ఆంధ్రోళ్లు అంత దోసుకుంటే.. నేను ఇంత దోసుకోవద్దా’ అనుకున్న కేసీఆర్​ ఆలోచన నుంచే ధరణి పుట్టినట్లున్నది. దాని పేరు మీద ఎన్ని లక్షల ఎకరాలు కాజేశారో? అంతులేదు. ధరణి తెచ్చి పేదల భూములు పెద్దల పాలుజేసిండు. దళితుల భూములను గుంజుకున్నడు. హైదరాబాద్​చుట్టూ ఉన్న భూములను కుటుంబసభ్యులు, బినామీల పేరిట చేసిండు. 111 జీవోను ఎందుకు ఎత్తేసిండు? ఇయ్యాల అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల చుట్టూ ఉన్న భూములెవరివి? యాదగిరి గుట్టనే మనకు కనబడ్తున్నది కానీ.. దాని చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములెవరివి? సొంత ఫామ్​హౌస్​ కోసం కొండపోచమ్మ సాగర్​ కట్టుకున్నడు. ఇవి సాలనట్టు.. ఇప్పుడు కోకాపేటలో కోట్ల విలువైన11 ఎకరాల భూమిని భారత్ ​భవన్​ కోసం తీసుకున్నడట. ధరణి వల్ల జనం ఎంత తిప్పలు పడ్తున్నరో మన కండ్ల ముందే కనిపిస్తున్నది కదా! 

దేశంలనే లేని స్కీమ్​లను రాష్ట్రంలో ఇస్తున్నమంటున్నరు.. నిజమేనా? 

పావురాలను పట్టే వేటగాడు.. పిడికెడు విత్తులు చల్లుతడు.. పాపం పావురాలు ఆకలి తీర్చుకోవడానికే వస్తయ్​.. వలలో చిక్కుతయని వాటికేం తెలుసు. పథకాల వెంటపోతే.. ప్రజల ప్రాణ ప్రతిష్ట పాలకుడికి బానిసవుతుంది. పాము పడగకింద కోడిపిల్లలు సేదతిరితే.. వాటికి భవిష్యత్​ఉంటదా? వేటగాడి విత్తులకు ఆశపడ్డ పక్షులకు జీవనం ఉంటదా? కేసీఆర్.. ​నువ్వు కూడా వినాలి ఈ మాట. ‘వాళ్లకు ఇవ్వి ఇచ్చినా, అవ్వి ఇచ్చినా’ అంటున్నవ్​.. అసలు పెద్ద బిచ్చగాడివే నువ్వు కదా. బిచ్చగాడే బిచ్చమేస్తే ఎట్లుంటదయా? నీ అవసరానికి పథకాలు ఇస్తున్నవ్​తప్ప, ప్రజలను ఉద్ధరించే ప్రగతి పథకాలు కావవి. పాప్​కార్న్​ ప్రగతి నీది. శారెడు మక్క గింజలు నేలమీద వేస్తే.. పది బండ్ల కంకులైతయ్​. నువ్వు విత్తనాన్ని విధ్వంసం చేసి, ‘నేను మిషిన్లు కొనిస్త.. పాప్​కార్న్​చేసుకొన్రి.. కానీ, పంటలు పండించకున్రి’ అనవడితివి. నీ పథకాలన్నీ పాప్​కార్న్ ప్యాకిట్లే. పాప్​కార్న్​సిద్ధాంతం ప్రజలకు అక్కెరకొచ్చేది కాదు. ప్రజలను ఓట్లు అడుక్కునేటప్పుడు కడుపులో తలపెట్టి, కాళ్లకు దండం పెట్టిన కేసీఆర్​.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల మొఖం ఎందుకు చూస్తలేడు? స్కీములు ఎవరైనా ఇస్తరు.. కానీ, ఆ స్కీములతో ఇక్కడ మాయ చేయాలనుకుంటున్నడు. తొమ్మిదేండ్లల్ల ఒక్కరినైనా కేసీఆర్​ కలిసిండా? ఉద్యమంలో ఎట్లుండె.. ఎప్పుడెట్ల తయారైండో అందరికీ తెలుసు. 

బీఆర్​ఎస్​కు ఎదురేలేదట.. మీరేమంటరు?

‘‘90 నుంచి నూరు సీట్లు వస్తయ్​..మాకు ఎదురే లేదు” అని అంటున్నరు. అంటే తెలంగాణ ప్రజలు వాళ్ల ఇంటికాడ పనిచేసే కైకిలోళ్లా? మీకు ఎదురేలేకపోతే.. మీ ఇంటికి వాకిలైన దుబ్బాకలో మీరు దుమ్మెందుకు కొట్టుకపోయిన్రు? హైదరాబాద్​ నగరంలో తిష్ట వేసుకొని కూసున్న మీకు.. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అంతు చిక్కని ఎదురుదెబ్బ ఎట్ల తగిలింది? నీ(కేసీఆర్​) బిడ్డ ఓడిపోయిన్నాడు.. నీ 
ప్రియమైన వినోద్​కుమార్​ ఓడిపోయిన్నాడు.. నీ వెన్నుపూసలు పల.. పల..ఇర్గలేదా? ఒక్క హుజూరాబాద్​ఉప ఎన్నికలో పెట్టిన ఖర్చు ప్రపంచంలో 40 ప్రజాస్వామ్య దేశాల ఎన్నికల్లో కూడా పెట్టలేదట. మీకు ఓటమే లేదంటిరి కదా?  మీ జీవితకాలం వెన్నంటి తరుముతున్న ఓటమి ఏదన్న ఉంటే.. అది హుజూరాబాద్​ఉప ఎన్నికనే.  అక్కడి ఓటర్లు షూటర్లయిన్రు.. సుక్కలు సూపెట్టిన్రు. హుజూరాబాద్​పరిస్థితే.. రేపు రాష్ట్రంలో పునరావృతం కాదనీ ఎందుకనుకుంటం?  కేసీఆర్​కు ఓటమి భయం నీడలా వెన్నంటి తరుముతూనే ఉంది. 

స్వరాష్ట్రంలో మారాల్సింది ఎవరు?

ప్రజలు కండ్లు తెరవకపోతే.. అటు దేశం, ఇటు రాష్ట్రం అథోగతిపాలవుతయ్​. ప్రధానంగా తెలంగాణ అయితే నిలువు దోపిడీకి గురవుతున్నది. ‘ఇది మా రాష్ట్రం, రేపటి మా పిల్లల భవిష్యత్తు కదా..’ అని ప్రజలు ఆలోచించాలి. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తుంటే.. మీకు అడిగే హక్కు ఎక్కడున్నదని నాయకుడు అంటున్నడు. రాజకీయ నాయకుడు వాడికి వాడే అమ్మకానికి పెట్టుకొని.. ప్రజలే అట్ల అమ్మకానికి ఉన్నరని బద్నాం చేస్తున్నడు. తెలంగాణ ఎవడి జాగీరు కాదు ఎల్లకాలం ఏలడానికి. ఇయ్యాల కాకుంటే.. రేపు. రేపు కాకుంటే ఎల్లుండి.. దిగిపోవాల్సిందే! పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందే. పాలకుల తప్పులను గమనించకపోవడంలో ప్రజలదీ తప్పు ఉంది. పాలకుల దోపిడీని చూసి కిమ్మనకపోవడం ప్రతిపక్ష పార్టీలదీ తప్పే.

తెలంగాణ కోసం గొంతెత్తిన కవులు,కళాకారుల ప్రస్తుత పరిస్థితి ఎట్టుంది? 

తెలంగాణ ఉద్యమానికి ‘తెలంగాణ ధూంధాం’ ఊపిరి పోయ్యడమే కాకుండా అనేక మంది పేద కళాకారులకు జీవనోపాధినిచ్చింది. కానీ, కొందరికి మాత్రం అది దుకాణం కూడా అయింది. కళాకారులను, కవులను మోసం చేయడంలో మొదటి పాత్ర కేసీఆర్​ది అయితే.. రెండో పాత్ర రసమయి బాలకిషన్​దే.  తెలంగాణ ఉద్యమంలో ‘ధూంధాం’ ఒక సైనిక చర్య చేసింది. కవులు, కళాకారులకు ఉద్యోగం ఇచ్చినట్లు కేసీఆర్​ చెప్పుకుంటే సరిపోదు. ఎందరో ఉద్యమంలో భాగస్వాములై, పాటే ప్రాణమని బతికిన వందల మందికి ఉద్యోగాలు రాలేదు. ఉపాధి లేదు.  గోసపడుతున్నరు. వాళ్లను ఆదుకునే దిక్కు లేదు. కేసీఆర్​కు తెలంగాణ భవన్​​ఉన్నది. అది కాకుండా ఇప్పుడు భారత్​భవన్ ​కూడా కావాలంటున్నడు. కేసీఆర్​లో నిజాయితీ ఉంటే..  ఫస్ట్​ కట్టాల్సింది.. తెలంగాణ సాంస్కృతిక రక్షణ కోసం దేశం గర్వించదగ్గ ఒక భవనం.. ఒక ఆడిటోరియం. కవుల వల్ల, కవుల పాటల వల్ల, కళాకారుల వల్ల ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఉద్యమ కీర్తిని, సాంస్కృతికోద్యమాన్ని  కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 

దళితుల బతుకుల్లో మార్పు వచ్చిందా?

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా దళితులు ఇంకా వెలివాడల్లోనే ఉన్నరు. ఈ దుస్థితికి కారణం పాలకులు, పాలననేనా? మన వల్ల ఏ తప్పిదం లేదా? అనేది  దళిత జాతులకు ప్రశ్న. ఎందుకంటున్నానంటే.. ‘మేం ఇంత జనం, మేం అంత జనం.. మా కులం బలమైనది’ అని చెప్పుకుంటున్న మీరు.. ఇవాళ వెలివాడల్లో ఎందుకు ఉన్నట్టు? ‘నేను మీకు ఓటు అనే వజ్రాయుధం ఇస్తున్న’ అని అంబేద్కర్ ​చెప్పిండు. దాంతోటి ఆత్మగౌరవాన్ని, ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పిండు. కానీ, స్వరాష్ట్రంలో కూడా అది ఎక్కడా కనిపిస్తలేదు.  మీ కులాలను అరకులపోడు వెంట్రుకకు కట్టి నేలకు కొడుతుంటే.. మీ కుల సముదాయాలు, మీ కుల సమీకరణలు ఏం చేస్తున్నయ్​? మోసం చేసేవాడిదే తప్పుకాదు.. మోసపోతున్నవాళ్లదీ తప్పే. దళితులంతా ఒక్కటై.. 125 అడుగుల అంబేద్కర్ ​విగ్రహం మీద ప్రమాణం చేసి.. దళిత ముఖ్యమంతి అని దగా చేసిన వాళ్లకు సచ్చినా ఓటేయబోమని సవాల్​ చేయాలి. మన రాజ్యం మనకు కావాలని కొట్లాడాలి. అప్పుడు కానీ, మార్పు రాదు. 

మేధావులు, కవులు ఎందుకు మాట్లాడ్తలేరు?

తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తలెత్తుకున్నరో.. ఇవాళ వాళ్లే తలదించుకున్నరు. స్వరాష్ట్రం కోసం కొట్లాడిన తెలంగాణ మేధావులు, కవులకు ఇప్పుడు నోరులేకుండా పోయింది. నిన్నటిదాకా తెలంగాణను వ్యతిరేకించినవాళ్లు.. క్యాబినెట్​లో ఉన్నరు. పదవులను ఏలుతున్నరు. ఇది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్​ చెప్పి.. దోపిడీకి తెగబడుతుంటే.. ఆయనకు కొందరు మేధావులు, ఇంకొందరు కవులు, కళాకారులు భజన చేయడం ఆత్మవంచనే. ఫక్తు రాజకీయ పార్టీ అన్ననాడే.. ‘మేం తెలంగాణ బిడ్డలం, మాలో తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది’ అని వాళ్లంతా తిరిగివచ్చేవాళ్లు. కానీ, వాళ్లంతా నెలవారీ జీతాల కోసం బతుకుతున్నట్లున్నది. ఈ పరిణామాలన్నింటినీ  చూసి.. అసలైన మేధావులు, కవులు, కళాకారులు మౌనం వహిస్తున్నరు. ఏ ఆకాంక్షల కోసం తెచ్చుకున్నమో ఆ రాష్ట్రంలో నేడు ఆంక్షలు అమలైతున్నయ్​. మేధావులు, కవుల మౌనం మంచిది కాదు. 

తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడిన విద్యార్థిలోకం పరిస్థితి ఎట్లున్నది?

అందరికంటే ఈ తెలంగాణలో ఎక్కువ మోసపోయింది విద్యార్థిలోకమే. వాళ్లు ఊహించనంత మోసపోయారు. కేసీఆర్ ఏమో ఇస్తడన్న ఎదురుచూపులు వాళ్లను ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నది. నియామకాలు లేక నిరుద్యోగులు ఆగమైతున్నరు. ఉస్మానియా, కాకతీయ వంటి వర్సిటీలు తెలంగాణ ఉద్యమానికి వేదికగా పనిచేసినయ్​. ఇప్పుడు వాటిని పాలకులు పట్టించుకుంటలేరు. అక్కడ నిర్బంధాలు అమలైతున్నయ్​. ఇక ఊర్లల చూస్తే.. గల్లీ గల్లీకి ఉన్న బెల్టుషాపుల వల్ల పడుచు పోరగాళ్లు కూడా తాగి తాగి సచ్చిపోతున్నరు. ఈ విషయం తలుచుకుంటే నాకు బాధైతున్నది. వాళ్ల ఉసురు ఊరికే పోదు. 

ప్రతిపక్ష పార్టీలు పవర్​లోకి వచ్చే చాన్స్​ ఉందా?

‘కుక్కలు దొడ్లెకు రావు.. కప్పలు తక్కెట్ల తూగవు’​ అన్న చందంగా..  ఈ పార్టీల నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి దుంకుడు... వీడు, వాడు కలిసి కొత్త పార్టీలు పెట్టుడు బలహీనత కిందే లెక్క. నాయకుల అనైఖ్యతే కేసీఆర్​కు బలం. కాంగ్రెస్​ అయినా, బీజేపీ అయినా.. తెలంగాణ కోసం చేసిన కాంట్రిబ్యూషన్​ పెద్దది. తెలంగాణ ఎప్పుడూ మరిచిపోదు. కానీ, వాళ్లలో వాళ్లు పీకులాడుకుంటే మళ్లీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క. సొంత పార్టీల్లోనే కోవర్టులను గమనిస్తలేరు. అవన్నీ సెట్​ చేసుకోకుంటే వాళ్లకు కష్టమే. ప్రతిపక్షాల బలహీనతే  కేసీఆర్​కు బలమైతున్నది. 

ప్రజాప్రతినిధుల తీరు ఎట్లున్నది? 

‘బాంఛన్​ కాల్మొక్తా ’ అని కేసీఆర్​కు పాదాక్రాంతమైతే చాలు బీఫామ్​లొస్తయ్​.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎన్నికైతరు. ప్రజల తరఫున మీరు మీ నాయకుడి ముందు మాట్లాడే ధైర్యం ఈ తొమ్మిదేండ్లల్ల ఎప్పుడైనా వచ్చిందా? అట్ల రానప్పుడు.. ఆ పదవి ఎందుకు? ఆ బానిస బతుకులు ఎందుకు? బానిస బతుకుల బదులు.. మీ సారు కట్టిచ్చిన కాళేశ్వరం నీళ్లల్లో దూకి సావండి. ఇట్ల చెప్తున్నందుకు కోపం రావొచ్చు. కానీ, వాస్తవమిది. బతుకంటే నెలవారీ జీతమో, కారో, పెట్రోలో కాదు. ప్రజల నాయకుడనుకునే వారెవరైనా సరే బానిసత్వానికి పునర్జీవనం చేయొద్దు. ప్రజల కోసం బతకాలి. తెలంగాణ తెచ్చుకున్నదే బానిస సంకెళ్లను తెంచుకోడానికి అనే విషయం యాదికుంచుకోవాలి. అందరూ ఒక్కరోజు మందు మానేసి చూడండి  

వెలుగు: మీకు పల్లెల్లో కనిపించేప్రధాన సమస్యలు ఏమిటి?

అందెశ్రీ: తెలంగాణ పల్లెలకు పోయి తిరిగి చూస్తే.. వైన్సు, బెల్టు షాపుల వల్ల కుటుంబాలకు కుటుంబాలు కుప్పకూలిపోతున్నయ్​. తాగి తాగి యువత మెదళ్లు మొద్దుబారిపోతున్నయ్​. తిండి తినక, నిద్దురపోక బతుకులు తెల్లారిపోతున్నయ్​. తెలంగాణలో వితంతువులు పెరుగుతున్నరు. దేశంలో ఎక్కడా లేని పింఛన్​ ఇక్కడే ఇస్తున్నమని పాలకులు బీరాలకు పోతున్నరు.. కానీ, ఒక దిక్కు మగబిడ్డలను మందులో ముంచి ప్రాణాలు తీస్తూ.. ఆడబిడ్డలను వితంతువులను చేస్తూ.. పింఛన్​ ఇస్తున్నమని చెప్పుడేంది?  వైన్సు, బెల్టుషాపులతో  ప్రభుత్వ ఖజానా నిండుతదేమో.. కానీ, జనం ప్రాణాలు పోతున్నయ్. ‘వెలుగు’ పత్రిక ద్వారా.. నా మాటగా ప్రజలకు చెప్తున్న. నాకు తాగుడు తెల్వదు.. ఎవడికీ అమ్ముడు పోవుడు అసలే తెల్వదు. ఎవడి దగ్గర తలదించుకోకుండా నా బతుకేందో నేను బతుకుతున్న. తెలంగాణ ప్రజలు చేయాల్సిన పనేమిటంటే.. ‘‘మీ పిల్లలు చల్లగుండాలంటే.. మీ ఆడబిడ్డలు, మీ కోడళ్లు వితంతువులు కావొద్దంటే.. తెలంగాణ ప్రజానీకం ఒక్కరోజు మందు తాగొద్దని నినాదం అందుకోవాలి. అప్పుడు అధికారం చావుదెబ్బతింటది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం పడిపోతది. 24 గంటలు మందు ముట్టుకోకుంటే మీరేం చావరు.. కానీ విర్రవీగుతున్న అధికారం మాత్రం సచ్చిశల్యమైతది. ఇది మాటకారితనంగా చెప్పడం లేదు. మనుసంతా ముక్కలై చెప్తున్న. నా మాట ఎవరో వినాలని సందేశం ఇస్తలేను. మీ ఆత్మఘోషను నా అక్షర రూపాన మీకు నివేదించుకుంటున్న. తాగుడు మానండి.. బతుకులు మార్చుకోండి.

నా పాటలో ఏలు పెట్టాలనుకున్నడు

వెలుగు: ‘జయజయహే తెలంగాణ’ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాలేకపోయింది?

అందెశ్రీ:  ‘నా ఊరు తెలంగాణ.. నా పేరు తెలంగాణ/ నా తల్లి తెలంగాణ.. తనువెల్ల తెలంగాణ/ నా మాట తెలంగాణ.. నా పాట తెలంగాణ/ సయ్యాట తెలంగాణ.. సాధించు తెలంగాణ’ అని కేసీఆర్​పార్టీ పెట్టకముందే.. తెలంగాణ కోసం కొత్త కారిడార్​గీసిన నేను. తెలంగాణను సాధించుకోబోతున్నమని ఆనాడే చెప్పిన. నినాదాలే కాదు.. దేశ పునాదులే కదులుతాయని రాసిన. కదిలినయ్​.  2002 సెప్టెంబర్​30..  కామారెడ్డిలో ‘తెలంగాణ ధూంధాం’కు పురుడు పోసినం.  70 వేల మంది ఏడుగంటల పాటు కూర్చున్న సభ అది. కేసీఆర్​కు దాంతో సంబంధం లేదు. ఒక సాంస్కృతిక సేనానిగా ఏ పాట పాడాలి? ఎవ్వరు పాడాలి అన్నప్పుడు వచ్చిన ఆలోచననే  ‘జయ జయహే తెలంగాణ..’ పాట పుట్టుకకు కారణమైంది. జయ జయహే తెలంగాణ గీతానికి అంత బలం వచ్చిందంటే.. అది నేను రాసినందుకు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలు ఈ పాటను తమదీ అని శిరస్సుల మీద ఇరుముడులు కట్టుకొని మోసినట్లు మోసినందుకు వచ్చింది. స్కూళ్లలో ప్రభాత గీతమై ఆ పాట వర్ధిల్లింది. దాని కీర్తి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, టీచర్లకు, స్కూళ్లకు దక్కాలి. కేసీఆర్​కు ఆ పాట మీద ఎందుకు కోపం వచ్చిందంటే.. ఆయనకు కీర్తి ఖండూతి అనే ఒక జబ్జు ఉంది. దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి, మోసం చేసి తెచ్చుకున్న ముఖ్యమంత్రి పదవి కంటే కోటి రెట్లు కీర్తి ‘జయ జయహే తెలంగాణ జననీ’ గీతానికి వచ్చింది. ఆ కీర్తిలో తనకు భాగస్వామ్యం ఉండాలనుకొని ఏలుపెట్టాలని కేసీఆర్​ చూసిండు. అందుకే.. ఆ పాటలో తాను ఏలుపెట్టినని అసెంబ్లీలో చెప్పుకొని పరువు తీసుకున్నడు. ఇదే క్రమంలో పాటను దూరం పెట్టాలనుకున్నడు. అధికారం శాసిస్తే.. ఏదైనా ఆగిపోతదంటరు కదా.. మరి ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ప్రజల నుంచి ఎందుకు దూరం చేయలేకపోయిండు? ప్రజలకు తెలుసు ‘జయ జయహే తెలంగాణ’ పాట ఏందో? అందెశ్రీ అంటే ఏందో?!

నీ సీఎం సీటు తాకట్టు పెట్టినా శ్రీకాంతాచారిని తేగలవా?

వెలుగు: స్వరాష్ట్రంలో అమరుల త్యాగాలకు గుర్తింపు ఉన్నదా?

అందెశ్రీ: సిద్దిపేటలో కేసీఆర్​ నిరహార దీక్షలో కూర్చున్నప్పుడు.. మొట్టమొదలు హరీశ్​రావు తన మీద పెట్రోల్​పోసుకున్నడు. తర్వాత.. ఎల్బీనగర్​చౌరస్తా దగ్గర శ్రీకాంతాచారి నిండు ప్రాణం బలిచ్చిండు. నిజంగా ఇక్కడ కావాలనే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్న..  ఆత్మబలిదానానికి శ్రీకాంతాచారి అనే పిలగాడు ఒంటి మీద పెట్రోల్​పోసుకున్నడా..? ఎవరన్న పోసిన్రా? అనేది అన్వేషించాలి. నిండు ప్రాణాన్నైతే బలిగొన్నరు కదా? వందసార్లు నీ ముఖ్యమంత్రి పదవి తాకట్టు పెట్టినా.. శ్రీకాంతాచారి ప్రాణం తిరిగి రాదు కదా? ఇయ్యాల ఆ పిలగాడి కుటుంబానికి నువ్వు(కేసీఆర్​) ఇచ్చిన గౌరవమెంత? 1,400 మంది ఆత్మబలిదానాలకు ఇచ్చిన గౌరవమెంత? నువ్వు కలిసిన అమరుల కుటుంబాలు ఎన్ని? వారికి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలెన్ని? 2009లో నువ్వు నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు సమైక్య పాలకులు కన్నెర్ర చేసి బెదిరిస్తే.. సిగ్గు, ఎగ్గు లేకుండా నువ్వు నిమ్మరసం తీసుకోలేదా? దీన్ని వంచన అని విద్యార్థి లోకం పసిగట్టకపోతే.. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పిల్లలు పోరాడకపోతే రాష్ట్రం వచ్చేదా? ఆషాఢభూతి టైపు

వెలుగు: తెలంగాణ క్రెడిట్​ ఎవరికి దక్కుతది?

అందెశ్రీ: కేసీఆర్​ ప్రతిభ, చతురత, అపర చాణక్యనీతితోని తెలంగాణ రాలేదు. సబ్బండవర్గాలు, సకల జనుల పోరాటంతో, అమరుల త్యాగాలతో, కళాకారులు, కవుల ఆటపాటలతో రాష్ట్రం వచ్చింది. వాళ్లందరిదీ తెలంగాణ సాధన క్రెడిట్ దక్కుతుంది. రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్​సోనియమ్మకు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత సుష్మాస్వరాజ్​కు, అప్పటి లోక్​సభ స్పీకర్​ మీరాకుమార్​కూ దక్కుతుంది. ‘సద్ది తిన్నా.. రేవును తల్వాలి బిడ్డా.. సచ్చేదాకా అన్నం పుడ్తది’ అని మా నాయిన అంటుండె. కానీ, అన్నం పెట్టిన వాళ్లకు సున్నం కొట్టే పద్ధతి మంచిది కాదు. మాటిచ్చి పది రోజులు కాకముందే.. కాంగ్రెస్​ను కేసీఆర్​ ఎంత మోసం చేసిండో.. జగద్విదితమే. తెలంగాణ వస్తే పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేస్తానని మాట్లాడిన కేసీఆర్​.. తెలంగాణలో కాంగ్రెస్​ను లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్నడు. ఇక్కడొక ఆషాఢభూతి అనే క్యారెక్టర్​కథ యాదికొస్తున్నది.  అనగనగా ఓ సాధువు ఉండెటోడట.  ఓ రోజు ఆయనను కలిసేందుకు ఓ వ్యక్తి వచ్చిండట. ‘గురువుగారు మీరు పక్క ఊడ్చుకుంటున్నప్పుడు మీ చీపురుపుల్ల పడిపోయింది.. దాన్ని మీకు అప్పజెప్పెటందుకు రోజంతా నడుచుకుంటూ మీ దర్శన భాగ్యం కోసం వచ్చిన. సాధుపుంగవుల చిన్న వస్తువు కూడా ఎంతో విలువైనది. అందుకే తెచ్చిన. నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి’ అని ఆ వ్యక్తి ఎంతో వినయంగా చెప్పంగనే.. పుట్టినప్పటి నుంచి ఎవరినీ నమ్మని ఆ సాధువు.. ఆ వ్యక్తి మాటలకు ఉప్పొంగిపోయి శిష్యుడిగా చేర్చుకుంటడట. ఓ రోజు సాధువు తన మూట ముల్లెను ఆ వ్యక్తి చేతిలో పెట్టి నదిలో స్నానానికి వెళ్లి నీట మునుగుతడు.అంతే, 
ఆ శిష్యుడు ముల్లెమూటతో గాయబ్​. అతడే ఆషాఢభూతి. అట్లనే ఉన్నది కేసీఆర్​ తీరు.