నేడు అందెశ్రీకి సుద్దాల హనుమంతు అవార్డు 

నేడు అందెశ్రీకి సుద్దాల హనుమంతు అవార్డు 

‘‘నేను మీ చప్పట్ల కోసం పాడటం లేదు.. మీ పొగడ్తల కోసం పాడటం లేదు.. నా ప్రజల కోసం పాడుతున్నాను”అంటాడు చిలీ దేశ ప్రజా గాయకుడు విక్టర్ జారా. తెలంగాణలో కదిలే కాలం అంటే, చరిత్ర గాయాలు, వలబోత గేయాలు. అగ్నికి ఆజ్యంలా పాట ఉద్యమాలతో మమేకం అయింది. ఇక్కడ పాట లేకుండా ఊట రాదు, మాట పెకలదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేతిలో పెన్ను, మరో చేతిలో గన్ను పట్టి మాట, ఆట, పాటలతో ఊపిరిలూదిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. ప్రజల భాషను, శ్వాసను, బాణీని ముప్పురిగా పేని ప్రజల మెడలో వీరతాల్లుగా వేసిన తొలి తరం ప్రజా వాగ్గేయకారుడు ఆయన. ‘సుద్దాల హనుమంతు – జానకమ్మ’  పేరుతో ఇచ్చే జాతీయ పురస్కారం ఈసారి లోకకవి అందెశ్రీని వరించింది. ఆయన జయ జయహే తెలంగాణ గీతాన్ని స్వరాష్ట్రోద్యమం గాయత్రీ మంత్రంగా ప్రవచించింది. ‘ఇది దగాపడ్డ దరువు.. మాకు ఏది బతుకు తెరువు’ అని ప్రశ్నించాడు. రాజ్య ధిక్కార కవి పోతన వలె పోత పోసిన నిబద్ధతగల మనిషి అందెశ్రీ.  పల్లెటూరి పిల్లగాడు పసుల గాసే మొనగాడు. కొలువు కుదిరిచ్చుకున్న దొరోడు ఇచ్చే అద్దశేరు నూకలు ఎగ్గొట్టినా కూడా, యెట్టోడిలా పనిచేసిన వాడు ఆయన. సుద్దాల పురస్కారానికి పుష్కలమైన అర్హత కలిగిన నిఖార్సైన కవి అందెశ్రీ.

జోల పాటలు కాదు.. పోరు పాటలు

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం అందెశ్రీది. ఆయనకు కులం లేదు మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికెట్స్ లో కులం ఉండదు. చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మరిచిపోవడానికి రామాయణం, యక్షగానాలు కోలాటల్లో మునిగిపోయేవాడు. తెల్లవార్లు మోట కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం అశువుగా పాడటం అబ్బింది. ఏకసంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు చరణాలు తోబుట్టువులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండె గాయం సలుపులు తీస్తున్న కొద్దీ కంఠ గేయం చిక్కగైంది. కూలీ పని, మేస్త్రి పనీ ఇలా కనపడ్డ ప్రతి పని చేసిండు. బువ్వలేని బతుకు దుఃఖపూరితమైన జీవితం. 60 ఏళ్ల అందెశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వలపోతల కాగితం. తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది, వంగిపోయేది జీవితం కాదు అంటాడు అందెశ్రీ. ‘‘జై బోలో తెలంగాణా.. జనగర్జనలా జడివాన’’ అని అందెశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువులా ఊగిపోయింది. కాంక్రీట్ జంగల్ లో మాయమైపోతున్న మానవుడిని వెతుకుతున్న సంచారి. ఆయనవి జోల పాటలు, జోకుడు పాటలు కాదు. రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి జబ్బజరిచి నిద్రలేపి, ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరుపాటలు. అవి మండే నిప్పు కణికలు. 

ఆయన అక్షరాల పొగరు..

మా పాటల భిక్షే కదా మీరేలే పదవులు. మా పాటలే కదా ముందుండి ప్రజలను నడిపినవి. ఆ పాటలే పెట్టని కోటలై నిలిచినవి. అలాంటి పాటలనవమానించ పదవులకు అహంకారమా! అని నిలేస్తాడు. మాటలో సత్యం ఉన్నప్పుడు స్వరంలో స్పష్టత వస్తుంది. దానికి గంభీర్యం తోడు అవుతుంది. అందుకే ఆయన అక్షరాలు అంత పొగరుగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం‘ రాష్ట్ర గీతం’గా ప్రకటించకపోయినా ప్రజలు పాడుకుంటున్నారనే నిండైన ఆత్మసంతృప్తి కలిగి ఉన్నవాడు. అంతే తప్ప ఎక్కడా పాలకులను ప్రాధేయపడలేదు.ప్రభుత్వాలకు వంగి, లొంగి పోలేదు. అవార్డులు, రివార్డులను కొనగోటితో ధిక్కరించిన వ్యక్తి.  సుద్దాల హనుమంతు పురస్కారం గనుకనే దాన్ని అందుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎనిమిదేండ్ల మౌనం మాట్లాడబోతున్నది. నేటి సాయంత్రం ఆరు గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ లో కలుసుకుందాం రండి.
– భూపతి వెంకటేశ్వర్లు