వానొచ్చినా.. వరదొచ్చినా.. పెళ్లి మాత్రం ఆగలేదు

 వానొచ్చినా.. వరదొచ్చినా.. పెళ్లి మాత్రం ఆగలేదు

కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదని చెబుతుంటారు పెద్దలు. ఏపీలో జరిగిన ఈ ఘటన చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలోని లంకపేటకు చెందిన ప్రశాంతికి, మలికిపురం మండలం కేసనపల్లి తూర్పుపాలెం గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌తో పెళ్లి కుదిరింది. గురువారం (జులై 14న) ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నిజానికి ఆగస్టులోనే ఈ పెళ్లి చేయాలని అనుకున్నా ఆ సమయంలో భారీ వర్షాలు పడతాయన్న భయంతో జులైలోనే పెళ్లి పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. 

వధూవరుల గ్రామాల మధ్య 28 కిలోమీటర్ల దూరం ఉండటం, ఓ వైపు భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండంతో అందరూ అందోళన చెందారు. కానీ వధువు తరపు బంధువులు అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు పడవే వారధి అయింది. వరద నీటిలోనే పడవలో ప్రయాణం చేసి మరీ వరుడి ఇంటికి చేరుకున్నారు. మధ్యలో కొబ్బరి చెట్లు అడ్డురావడం.. ఎదురు నీటి ప్రవాహంతో పడవ ముందుకు కదలకపోవడం వంటి ఇబ్బందులు ఎదురైనా వారు పెళ్లి సమయానికి అర్ధగంట ముందే మండపానికి చేరుకున్నారు. అనుకున్న సమయానికి ప్రశాంతి, అశోక్‌కుమార్‌ పెళ్లి జరిపించారు.