
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ క్రాకర్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలతోపాటు పరిశ్రమ యజమాని సత్తిబాబు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కంపెనీలో 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
భారీ పేలుడు ధాటికి యూనిట్ షెడ్డు గోడ కూలిందన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఘటనపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ స్పందిస్తూ..కంపెనీలో అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు వారం క్రితమే తమకు నివేదిక అందిందన్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
క్రాకర్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలు, వైద్యసాయం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఏపీ హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.