ఏపీలో ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్ విద్యార్థి అత్యాచారం

ఏపీలో ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్ విద్యార్థి అత్యాచారం

ఆడ పిల్లలకు రక్షణ కరువవుతోంది. 6 నెలల చిన్నారి నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు ఎవరనీ వదలట్లేదు కామాంధులు. ఆడవారి భద్రత కోసం ఎంత కఠినమైన చట్టాలు తెచ్చినా మార్పు రావట్లేదు. ఏపీలో ఇటీవలే దిశ చట్టం తీసుకువచ్చిన అక్కడ వరుసగా రేప్ ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై పొరుగింట్లో ఉండే ఇంటర్ విద్యార్థి (17 ఏళ్లు) రేప్ చేశాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆ పాప దగ్గరకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు ఆ దుర్మార్గుడు.

ఈ దారుణం జరిగిన సమయంలో చిన్నారి తల్లిదండ్రులిద్దరూ పొలం పనులకు వెళ్లి ఉన్నారు. సాయంత్రం వచ్చాక చిన్నారి ఏడుస్తుండడంతో ఏమైందని అడిగితే అమాయకంగా ఆ చిన్నారి అంకుల్ ఇలా చేశాడంటూ చెప్పే ప్రయత్నం చేయడంతో జరిగిన ఘోరం తెలిసింది. దీంతో వారు మంగళవారం జి.కొండూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు పోలీసులు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు  పరారీలో ఉన్నాడని తెలిపారు.

పసికందు ఏడుస్తున్నా పట్టించుకోని స్థానికులు

ఈ ఘోరం జరిగిన సమయంలో ఆ చిన్నారి ఏడుస్తున్నా ఇరుగు పొరుగు ఎవరూ పట్టించుకోలేదు. ఆ పాపను తల్లిదండ్రులు ఇంటి దగ్గర వదిలేసి.. పొలం పనులకు వెళ్తుంటారని, తరచూ ఆ చిన్నారి ఇలా ఏడుస్తుంటుందని చెబుతున్నారు. తల్లిదండ్రుల కోసం ఏడుస్తుందేమోనని పట్టించుకోలేదంటున్నారు.