
- పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లొస్తే రాయలసీమలో కరువే ఉండదు: చంద్రబాబు
- శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి
శ్రీశైలం, వెలుగు: దేశంలో నదుల అనుసంధానం జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ద్వారా బనకచర్లకు నీళ్లొస్తే.. అప్పుడు కృష్ణానదికి ఎక్కువ నీళ్లు రాకపోయినా రాయలసీమలో కరువు ఉండదని చెప్పారు. తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, నగరి–గాలేరు, హంద్రీనీవా కింద ఉన్న ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన పర్యటించారు. ముందుగా ఆయన ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. 4 ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో సమావేశమై మాట్లాడారు.
ఏపీలో 1,004 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం 554 టీఎంసీ నీళ్లు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 450 టీఎంసీలు వస్తే రాష్ట్ర జలాశయాలన్నీ కళకళలాడతాయని పేర్కొన్నారు. జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామమని, ఈ నీటితో రాయలసీమ జలాశయాలన్నీ నిండుతాయని అన్నారు. ఈ నెల 15 కల్లా హంద్రీనీవాకు 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
పోలవరం వల్లే సీమకు నీళ్లు
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు అన్నారు. 2019లో తాను మళ్లీ సీఎం అయ్యుంటే ప్రాజెక్టును జాతికి అంకితం చేసేవాళ్లమని చెప్పారు. పోలవరం కుడి కాలువ వల్లే సీమకు నీళ్లు వస్తున్నాయన్నారు. కృష్ణా డెల్టాకు కృష్ణా నీళ్లు కాకుండా.. గోదావరి నీళ్లు వాడుతున్నామన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు 120 టీఎంసీలు వాడి.. ఆ మిగులు జలాలను సీమకు ఇస్తున్నామని చెప్పారు.
గోదావరి నుంచి 2 వేల టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తున్నదని, అందులో 200 టీఎంసీలు ఏపీ, 100 నుంచి 200 టీఎంసీలు తెలంగాణ వాడుకున్నా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. తాను 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటానని చెప్పారు. వరదల సమయంలో సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.