
- 40 నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!
- అనంతరం లోటస్‌పాండ్‌కు వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు
హైదరాబాద్, వెలుగు : తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు జగన్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి జగన్ చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం ఫస్ట్ ఫ్లోర్‌లోని కేసీఆర్ గదికి వెళ్లిన జగన్ఆయనకు పుష్పగుచ్చం అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి ఫొటోను బహూకరించారు. కాసేపు నేతల సమక్షంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వారంతా బయటకు వెళ్లాక జగన్, కేసీఆర్ ఇద్దరే 40 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో వారిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. జగన్ సోదరి షర్మిల గురువారమే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే రోజు జగన్తెలంగాణ మాజీ సీఎంతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. జగన్‌వెంట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిలా రాఘురాం ఉన్నారు.
రెండేండ్ల తర్వాత లోటస్‌పాండ్ ఇంటికి జగన్
కేసీఆర్ నివాసం నుంచి లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి జగన్ రెండేండ్ల తర్వాత వెళ్లారు. అక్కడ తల్లి విజయమ్మతో అరగంట పాటు మాట్లాడి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లో చేరడానికి షర్మిల వెంట ఆమె కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ వెళ్లడంతో గురువారం విజయమ్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. షర్మిల త్వరలోనే ఏపీ పీసీసీ చీఫ్పగ్గాలు చేపడుతారనే ప్రచారం నేపథ్యంలో తల్లి విజయమ్మను జగన్కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.