కందనూలు, వెలుగు : ఉన్నత చదువులకు పాఠశాల విద్య పునాదిలాంటిదని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందాయ లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు శ్రద్ధగా పాఠాలు విని పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట మండల తహసీల్దార్ మునుద్దీన్, హెచ్ఎం నరసింహ, టీచర్లు తదితరులు ఉన్నారు.
