- ఇసుకతోపాటు కోల్ ఆదాయం పెంపుపైనా ఫోకస్
- ఇసుక పాలసీపై సీఎం అసంతృప్తి
- ఇంటికే ఇసుక చేర్చడంలో అధికారులు విఫలం
- ఇప్పటికే ఎండీని మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మైనింగ్ రంగం నుంచి ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేస్తున్నది. 2027–28 నాటికి మైనింగ్ రంగం నుంచి రూ.9వేల కోట్ల ఆదాయం సాధించాలని మైన్స్ అండ్ జియాలజీ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా కోల్, ఇసుక, ప్రధాన, చిన్నపాటి ఖనిజాల నుంచి ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మైన్స్ అండ్ జియాలజీ శాఖ రాబోయే మూడేండ్లకు (2025–28) ఆదాయ లక్ష్యాలను రూపొందించింది. 2025–26లో రూ.6,500 కోట్లు, 2026–27లో రూ.7,500 కోట్లు, 2027–28లో రూ.9వేల కోట్ల ఆదాయం సాధించాలని నిర్దేశించింది. ఈ లక్ష్యాల్లో కోల్ నుంచి రూ.3,732 కోట్లు (2027–28), ప్రధాన ఖనిజాల నుంచి రూ.692 కోట్లు, చిన్నపాటి ఖనిజాల నుంచి రూ.3,076 కోట్లు, ఇసుక నుంచి రూ.1,500 కోట్లు రాబట్టాలని ఆ శాఖ భావిస్తున్నది.
ఈ లక్ష్యాల సాధనకు పలు వ్యూహాలను అమలు చేయనున్నది. ప్రధాన, చిన్నపాటి ఖనిజ బ్లాక్‌ల వేలం ద్వారా ఆదాయాన్ని పెంచడం, చిన్నపాటి ఖనిజాలపై సీజర్ ఫీజు రేట్లను సవరించడం, 2025–26 కోసం అడ్వాన్స్ డెడ్ రెంట్ వసూలు, బకాయిల వసూలుకు వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం అమలు వంటివి అమలు చేయనున్నది. అయితే, ఇసుక పాలసీ అమలులో అధికారులు విఫలమవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లబ్ధిదారుల ఇంటికే ఇసుక చేర్చే పథకంలో లోపాలు, అక్రమ రవాణా నియంత్రణలో జాప్యం వంటి అంశాలపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శాఖ ఎండీని మార్చిన ప్రభుత్వం, రాబోయే నెలల్లో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
2024–25లో టార్గెట్ రీచ్ అయినా..
మైన్స్ అండ్ జియాలజీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.6,588 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది గతేడాది (2023–24) సాధించిన రూ.5,439.93 కోట్ల కంటే 21% ఎక్కువ. ఈ లక్ష్యంలో కోల్ నుంచి రూ.2,944 కోట్లు, ప్రధాన ఖనిజాల నుంచి రూ.3,168 కోట్లు, చిన్నపాటి ఖనిజాల నుంచి రూ.2,100 కోట్లు, ఇసుక నుంచి రూ.1,320 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ మేరకు 102 శాతం ఆదాయం వచ్చింది. ఇందులో కోల్ నుంచి రూ.3 వేల కోట్ల పైనే వచ్చింది.
(మేజర్) ప్రధాన ఖనిజాల నుంచి రూ.230 కోట్లు , చిన్నపాటి ఖనిజాల నుంచి దాదాపు రూ.1600 కోట్లు, ఇసుక నుంచి రూ.720 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే, ఇసుక, చిన్నపాటి ఖనిజాల ఆదాయంలో గణనీయమైన లోటు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ ప్రకారం.. నిర్మాణ రంగంలోని వినియోగదారులకు ఇంటికే ఇసుక చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ పథకం అమలులో అధికారులు విఫలమవుతున్నారు. ఇసుక రవాణాలో అక్రమాలు, లైసెన్స్ లేని వాహనాల ద్వారా రవాణా, అధిక ధరల వసూళ్లు వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలిసింది.
అక్రమ రవాణా కట్టడికి తనిఖీలు.. జరిమానాలతో ఆదాయం
ఖనిజ అక్రమ రవాణాను నియంత్రించేందుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. 2024–25లో ఫిబ్రవరి నాటికి 81,639 వాహనాలను తనిఖీ చేసి, రూ.13.65 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇది గత ఏడాది (2023–24) కంటే 29% అధికం. నిరుడు 63,214 వాహనాలను తనిఖీ చేసి రూ.11.62 కోట్లు వసూలు చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తనిఖీలు గణనీయంగా పెరగడంతో జరిమానా వసూళ్లు కూడా పెరిగాయి. అయితే, ఇసుక రవాణాలో అక్రమాలు పూర్తిగా నియంత్రణలోకి రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
