AI దోమల డాక్టర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ప్లాన్.. వ్యాధులకు గుడ్‌బై!

 AI దోమల డాక్టర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ప్లాన్.. వ్యాధులకు గుడ్‌బై!

వర్షాకాలంలో చాల మంది ఇళ్లలో జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతుంటారు. అయితే ఈ వ్యాధులు ఎక్కువగా దోమల వల్లే వ్యాపిస్తుంటాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఇలాంటి వాతావరణంలోనే ఎక్కువగా, వేగంగా సోకుతుంటాయి కూడా. దీనికి చెక్ పేటెందుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చొరవ ప్రారంభించింది. ఇప్పుడు AIతో పనిచేసే సిస్టం ప్రజలను దోమల నుండి రక్షిస్తుంది. అవును, ఇది నిజమే..  ఎపి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ (SMoSS)ను రెడీ చేసింది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్నారు. ఈ పైలట్ పోజెక్టు రాష్ట్రంలోని ఆరు నగరాలలో ప్రారంభమవుతుంది. దీనిలో AIతో పనిచేసే సెన్సార్లతో పాటు ఇతర పరికరాలు ఉంటాయి, ఇది దోమల గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే వాటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 

 దోమల గురించి సమాచారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారుచేసిన స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ (SMoSS)లో AI- అమర్చిన సెన్సార్లు, డ్రోన్లు, ఇతర  పరికరాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పరికరాలు దోమల జాతులు, వాటి లింగం, సంఖ్య, తేమ ఇంకా ప్రాంతాల ఉష్ణోగ్రత గురించి సమాచారాన్ని అందిస్తాయి. ఎక్కడైతే దోమల సంఖ్య ఎక్కువగా ఉందో అక్కడ వెంటనే హెచ్చరికలు పంపుతుంది. దీని తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అక్కడికి వెళ్లి స్ప్రేయింగ్ లేదా ఫాగింగ్ చేస్తారు. ఇంకా దోమల గురించి రియల్-టైమ్ సమాచారాన్ని అందిస్తుందని పేర్కొంది. 

ఈ పైలట్  ప్రాజెక్ట్ దోమల గురించి సమాచారాన్ని అందించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. లార్విసైడ్ స్ప్రే  చేయడానికి ప్రభుత్వం డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. దీని వల్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా రసాయనాల వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. 

ఈ నగరాలలో ప్రారంభం : ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్  ఆరు మునిసిపల్ కార్పొరేషన్లలోని 66 ప్రదేశాలలో ప్రారంభించనుంది.  ఇందులో విశాఖపట్నంలోని 16 ప్రాంతాలు, విజయవాడలోని 28, కాకినాడలోని 4, రాజమహేంద్రవరంలోని 5, నెల్లూరులోని 7, కర్నూలులోని 6 ప్రాంతాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే దోమలపై  AI సహాయంతో ఓ పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడం ఇదే మొదటిసారి.  ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తర్వాత ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించవచ్చు.