Rishab Shetty : 'కాంతార చాప్టర్‌ 1'కి ఏపీ సర్కార్ బూస్ట్: టికెట్ ధర పెంపునకు గ్రీన్‌సిగ్నల్!

Rishab Shetty : 'కాంతార చాప్టర్‌ 1'కి ఏపీ సర్కార్ బూస్ట్: టికెట్ ధర పెంపునకు గ్రీన్‌సిగ్నల్!

 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘కాంతార’. ఒక చిన్న సినిమాగా విడుదలై, కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టిలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ చిత్రం... ఇప్పుడు ‘కాంతార చాప్టర్‌ 1’ పేరుతో ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా తెలుగు సినిమాలు, పెద్ద బడ్జెట్, స్టార్ హీరోల చిత్రాలకు ఇచ్చే విధంగానే ఈ వెసులుబాటును  ‘కాంతార చాప్టర్‌ 1’ కూడా ఇచ్చారు. అక్టోబరు 2న సినిమా విడుదలైనప్పటి నుంచి అక్టోబరు 11 వరకు... పది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీని ప్రకారం, సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్ ధరపై రూ.75 (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీ అదనం) అదనంగా వసూలు చేసుకోవచ్చు.

ఇది మాత్రమే కాదు, అభిమానుల కోసం ఒక రోజు ముందే అంటే అక్టోబరు 1న బుధవారం రాత్రి 10 గంటలకు ప్రత్యేకంగా ప్రీమియర్‌ ప్రదర్శనలు వేసుకునేందుకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్‌ షోలకు కూడా పెంచిన ధరలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం వల్ల సినిమా కలెక్షన్లకు భారీగా ఊతం లభిస్తుందని, తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు నమోదవుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కాంతార’ కథకు మూలమైన భూతకోల, దైవారాధన సంస్కృతికి సంబంధించిన పూర్వ చరిత్రను ఈ ప్రీక్వెల్‌లో చూపించబోతున్నారు.

రిషబ్‌ శెట్టి నటన, దర్శకత్వం ఈ సినిమాలో మరోసారి శిఖరాలను అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రత్యేక అనుమతులతో, ‘కాంతార చాప్టర్‌ 1’ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి తోడ్పడుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడతున్నాయి.. ఈ నిర్ణయం సినిమా విడుదలకు ముందే దానిపై ఉన్న క్రేజ్‌ను మరోసారి చాటి చెప్పింది. మొత్తంగా, రిషబ్‌ శెట్టి టీమ్, అభిమానులకు ఇది నిజంగా పండగే అని చెప్పాలి. మరికొన్ని గంటల్లో విడుదలవుతున్న  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.